రేవంత్ కోరికను తీర్చేందుకు రెఢీ అయిన కేసీఆర్

ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ గులాబీ పార్టీని ఇరుకున పెడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Update: 2024-07-25 04:35 GMT

తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కారు కొలువు తీరటం తెలిసిందే. ముఖ్యమంత్రిగా రేవంత్ ను ఎంపిక చేయటం.. ఆయన చేతుల్లోకి తెలంగాణ రాష్ట్ర పగ్గాలు వచ్చేశాయి. రేవంత్ ను సీఎంగా ఒప్పుకోవటానికి కేసీఆర్ అండ్ కో సిద్ధంగా లేదన్న విషయాన్ని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేయటం తెలిసిందే. చివరకు గులాబీ బాస్ కేసీఆర్ సైతం అసెంబ్లీకి హాజరు కాకపోవటం.. ఎట్టకేలకు ఒకసారి వచ్చినప్పటికీ.. ఇలా వచ్చి అలా వెళ్లిపోయారే కానీ.. సభలో పాల్గొన్నది లేదు.

ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ గులాబీ పార్టీని ఇరుకున పెడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తాజా బడ్జెట్ సమావేశాల్లోనూ ఇదే అంశం చర్చకు వచ్చింది. బడ్జెట్ సెషన్ మొదలైన రెండు రోజుల్లోనూ బీఆర్ఎస్ కు కౌంటర్ ఇచ్చే వేళలో.. ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ.. సభకు ప్రతిపక్ష నేత ఎందుకు రావట్లేదని.. చర్చలో పాల్గొనాలంటూ పేర్కొనటం తెలిసిందే.

ఈ తరహా వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. కేసీఆర్ రావాల్సిన అవసరం లేదని.. తమకు సమాధానం చెబితే సరిపోతుందన్న వ్యాఖ్యలపై సీఎం రేవంత్ అంతే ఘాటుగా రియాక్టు కావటం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈ రోజు (గురువారం) ప్రవేశపెడుతున్న రాష్ట్ర బడ్జెట్ సందర్భంగా గులాబీ బాస్ కేసీఆర్.. అసెంబ్లీకి వస్తారని చెబుతున్నారు. ఇంతకాలం ముఖం తప్పించినట్లుగా సభకు హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేయని కేసీఆర్.. తాజాగా మాత్రం అసెంబ్లీకి వచ్చేందుకు ఓకే చెప్పినట్లుగా గులాబీ వర్గాలు చెబుతున్నాయి.

ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణం చేయటానికి ఒక్కసారి అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్.. చివరకు 2024-25 ఓటాన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టినప్పుడు కూడా అసెంబ్లీకి రాకపోవటం తెలిసిందే. తాజా బడ్జెట్ సెషన్ లో అయినా ఆయన పాల్గొంటారా? లేదా? అన్నది సందేహంగా మారింది. ఇలాంటి వేళ.. తమ బాస్ కేసీఆర్.. గురువారం అసెంబ్లీకి వస్తారంటూ చెబుతున్నారు. దీంతో.. ఈ సీన్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి కోరికను గులాబీ బాస్ తీర్చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. అసెంబ్లీ ఆవరణలో కేసీఆర్ కు కేటాయించిన ఛాంబర్ పైన బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే ఇరుకు ఛాంబర్ ను కేటాయించారని ఆరోపిస్తున్నారు. తమ అధినేతను అవమానించేందుకు ఇలా చేశామని చెబుతున్నా.. అలాంటిదేమీ లేదని.. తాము విపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎలా స్పందించిందో.. తాము అదే తీరును ప్రదర్శిస్తున్నామని చెబుతున్నారు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. కేసీఆర్ ఎంట్రీతో ఈ రోజు అసెంబ్లీ హాట్ హాట్ గా మారుతుందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News