పక్కా ప్లాన్‌ తో హమాస్‌ చీఫ్‌ హత్య... రెండు నెలల క్రితం ఏమి జరిగింది?

అయితే... టెహ్రాన్ లో అతడు ఇంటిలో ఉన్న సమయంలో ఇజ్రాయెల్ క్షిపణులతో దాడి చేసినట్లు తొలుత వార్తలు వచ్చాయి

Update: 2024-08-02 09:31 GMT

ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని విలాసవంతమైన, కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్న ప్రాంతంలోని ఓ గెస్ట్ హౌస్ లో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా (62) ఇటీవల హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే... టెహ్రాన్ లో అతడు ఇంటిలో ఉన్న సమయంలో ఇజ్రాయెల్ క్షిపణులతో దాడి చేసినట్లు తొలుత వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అసలు కారణం అది కాదంటూ షాకింగ్ విషయాలు తెరపైకి వచ్చాయి.

అవును... హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హత్యకు గురవ్వడానికి.. టెహ్రాన్ లో అతడు ఉంటున్న ఇంటిపై క్షిపణులతో ఇజ్రాయేల్ దాడిచేయడమే కారణం అని కథనాలొచ్చాయి. అయితే... తాజాగా విశ్వసనీయ వర్గాల మేరకు అంటూ ది న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం ప్రచురించింది. దీనికోసం సుమారు రెండు నెలల క్రితమే ఆ ఇంట్లో బాంబుని అమర్చినట్లు తెలుస్తోంది.

ఇస్మాయిల్ హత్యకు గురైన గెస్ట్ హౌస్.. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ (ఐ.ఆర్.జీ.సీ)కి చెందిన ఓ పెద్ద భవన సముదాయంలోనిదని.. దీన్ని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ తమ రహస్య సమావేశాలతోపాటు, ముఖ్యమైన నేతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఉపయోగిస్తారని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఇక్కడ నిత్యం ఐ.ఆర్.జీ.సీ. బలగాలు పహారా కాస్తుంటాయి.

అయితే... ఈ హై సెక్యూరిటీ గెస్ట్ హౌస్ కు హనియా వస్తాడనే పక్కా సమాచారం ఉండటంతో.. సుమారు రెండు నెలల క్రితమే ఓ బాంబును సీక్రెట్ గా తీసుకొచ్చి దాచిపెట్టినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది. నాటి నుంచి సరైన సమయం కోసం హంతకులు కాచుకుని కూర్చున్నారని పేర్కొంది!

ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం హమాస్ అగ్రనేత ఆ గెస్ట్ హౌస్ లో ఇన్నారనే విషయాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న హంతకులు.. అప్పటికే అమర్చిన బాంబును రిమోట్ తో పేల్చినట్లు ఆ కథనం వెల్లడించింది. ఈ పేలుడుతో ఇస్మాయిల్ హనియాతో పాటు అతడి వ్యక్తిగత సహాయకుడు కూడా మృతిచెందినట్లు చెబుతున్నారు. ఈ పేలుడు ధాటికి భవనం పూర్తిగా ధ్వంసమైందని అంటున్నారు.

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు!:

హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా హత్యతో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని కథనాలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ దాడి చేయించింది ఇజ్రాయేల్ అనేది హమాస్ ఆరోపించింది. అటు హమాస్ మరో కీలక నేత డెయిఫ్ ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐ.డీ.ఎఫ్.) హై అలర్ట్ జారీ చేసింది. ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉందని అంచనా వేస్తోంది! మరోపక్క... ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తో... అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడినట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News