ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్... భారత వాణిజ్యంపై ప్రభావం ఎంతంటే..?

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య జరుగుతున్న పోరు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

Update: 2024-10-03 04:14 GMT

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య జరుగుతున్న పోరు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతీయ యుద్ధం ముదిరి పాకానపడి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులను కొట్టిపారేయలేమనే కమెంట్లూ వినిపిస్తున్నాయి. ఈ సమయంలో... ఈ ఘర్షణ భారతదేశ వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం చూపించింది.. ఇంకా ఎలాంటి ప్రభావం చూపించబోతోందనేది ఆసక్తిగా మారింది.

అవును... గత ఏడాది ఇజ్రాయెల్ – హమాస్ మధ్య మొదలైన పోరు ఇప్పుడు లెబనాన్, సిరియా, ఇరాన్ కూ పాకిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా మారింది. అయితే ఈ వ్యవహారం మరింత ముదిరితే అది ఎలక్ట్రానిక్స్, అగ్రికల్చర్, చమురు వంటి రంగాలను దెబ్బతీస్తుందని.. లాజిస్టిక్ వ్యయాన్ని మరింతగా పెంచుతుందని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయాలపై స్పందించిన గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీ.టీ.ఆర్.ఐ)... ఈ ఘర్షణల వల్ల ఇప్పటికే ఇజ్రాయెల్, లెబనాన్, జోర్డాన్ వంటి దేశాలతో భారత వాణిజ్య సంబధాలు దెబ్బతిన్నాయని పేర్కొంది. ఈ వాతావారణం ప్రపంచ వాణిజ్యంతో పాటు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేయగలదని ఫేడరేషన్ ఆఫ్ ఇండియా ఎక్స్ పోర్ట్ ఆర్గనైజేషన్ (ఎఫ్.ఐ.ఈ.ఓ) పేర్కొంది.

ప్రధానంగా చమురు మార్కెట్ లో ఇరాన్ పాత్ర కీలకం కావడంతో.. ఈ ఘర్షణ వాతావారణం ఎఫెక్ట్ ఇప్పటికే పడిందని అంటున్నారు. ఇందులో భాగంగా... ఇప్పటికే బ్యారెల్ చమురు 4 డాలర్ల మేర పెరిగిందని చెబుతున్నారు. ఈ వివాదం ముదిరితే ప్రపంచ దేశాలకు చమురు రవాణా జరిగే ప్రధాన మార్గమైన హర్ముజ్ జలసంధి ప్రభావితం కానూందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దీనివల్ల ప్రధానంగా షిప్పింగ్ కాస్ట్ పెరగడంతోపాటు సరఫరా కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ ఘర్షణల వల్ల ఈ ఏడాది జనవరి - జూలై మధ్య ఆయా దేశాల్లో భారత వాణిజ్యం గణనీయంగా తగ్గిందని చెబుతున్నారు. ఇందులో భాగంగా ఎగుమతులు ఇజ్రాయెల్ కు 63.5 శాతం, జోర్డాన్ కు 38.5 శాతం, లెబనాన్ కు 6.8 శాతం తగ్గినట్లు చెబుతున్నారు.

ఈ సమయంలో ఒకవేళ పశ్చిమ దేశాలు వాణిజ్యంపై ఆంక్షలు పెడితే మాత్రం ప్రపంచ వాణిజ్య ముఖచిత్రమే మారిపోయే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News