లెబనాన్ సరిహద్దుల్లో భారత జవాన్లు.. ఏం జరుగుతోంది అక్కడ..?

ఇజ్రాయెల్ - హిజ్బుల్లా మధ్య పెరుగుతున్న ఘర్షణతో మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితి భయంకరంగా మారింది. ఎప్పుడు ఎలాంటి వార్తలు వినాల్సి వస్తోందా అన్న ఉత్కంఠ నెలకొంది

Update: 2024-10-01 13:30 GMT

ఇజ్రాయెల్ - హిజ్బుల్లా మధ్య పెరుగుతున్న ఘర్షణతో మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితి భయంకరంగా మారింది. ఎప్పుడు ఎలాంటి వార్తలు వినాల్సి వస్తోందా అన్న ఉత్కంఠ నెలకొంది. దీంతో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాల ఆధ్వర్యంలో ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దులో ఉన్న భారత సైన్యం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. యునైటెడ్ నేషన్స్ ఇంటర్మ్ ఫోర్స్ ఇన్ లెబనాన్ మిషన్‌లో భాగంగా దాదాపు 600 మంది భారతీయ సైనికులు ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దు వెంబడి మోహరించారు.

యుఎన్ శాంతి పరిరక్షక దళంలో భాగంగా ఇజ్రాయెల్ - లెబనాన్ దేశాల సరిహద్దులో మోహరించిన భారత సైన్యం అక్కడి పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. లెబనాన్‌లో ఇటీవల పేజర్ పేలుడు హిజ్బుల్లా, ఇజ్రాయెల్‌‌ల మధ్య మరింత తీవ్ర స్థాయికి చేర్చింది. అందుకే.. శాంతిభద్రతల పరిరక్షణలో భారత సైన్యం కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమైంది. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్ కింద భారత సైన్యం సమస్యాత్మక ఇజ్రాయెల్ - లెబనాన్ సరిహద్దులో మోహరించింది. సరిహద్దు మధ్యలో ఉన్న బ్లూ లైన్‌లో దాదాపు 600 మంది భారతీయ సైనికులు మోహరించడం గమనార్హం.

ఈ అస్థిర ప్రాంతంలో శాంతిని కాపాడడానికి కేంద్రం దృష్టి కేంద్రీకరించింది. పరిస్థితిని భారత సైన్యం నిశితంగా పరిశీలిస్తోంది. హిజ్బుల్లా ఉపయోగించే పేజర్లు, వాకీ-టాకీలలో వరుస పేలుళ్ల తర్వాత ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య వివాదం తీవ్రమైంది. ఇరాన్-మద్దతుగల మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయెల్‌పై క్షిపణులను ప్రయోగించింది. టెల్ అవీవ్ లెబనాన్ అంతటా విస్తృతమైన దాడులను చేసింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ లెబనాన్‌లోని అనేక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది, హిజ్బుల్లా బలమైన కోటలు, మందుగుండు సామగ్రి నిల్వ స్థలాలను తాకింది. భారత సైన్యం అప్రమత్తం కాగా.. బ్లూ లైన్ వెంబడి తమ స్థానం నుండి పనిచేస్తోంది. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య 120 కిలోమీటర్ల సరిహద్దును 2000లో ఐక్యరాజ్యసమితి స్థాపించింది.

భారత సైనికులు యుద్ధంలో చురుకుగా పాల్గొననప్పటికీ.. అత్యంత సున్నితమైన ఈ ప్రాంతంలో స్థిరత్వాన్ని కాపాడే బాధ్యత కూడా వారిదే. యుఎన్ సిబ్బంది, శాంతి పరిరక్షణ కార్యకలాపాలను రక్షించడం, సరిహద్దు వెంట హింస చెలరేగకుండా నిరోధించడమే వీరి ప్రధాన లక్ష్యం కూడా.

ఈ రెండు దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో చమురు సరఫరాకు అంతరాయం కలిగే ప్రమాదాలూ లేకపోలేదు. దాంతో అది నేరుగా భారత్‌ ఆర్థిక వృద్ధిపై గణనీయంగా ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు సెంటర్ ఫర్ జాయింట్ వార్ ఫేర్ స్టడీస్ మాజీ డైరెక్టర్ జనరల్ మేనేజర్ అశోక్‌కుమార్ వెల్లడించారు. పరిస్థితి మరింత సీరియస్ అయితే గల్ఫ్‌లో ఉన్న 9 మిలియన్ల భారతీయ భవిష్యత్ అంధకారంలో పడుతుందని హెచ్చరించారు. మరోవైపు.. హెజ్బుల్లా సరిహద్దులో శత్రు సైనికులే లక్ష్యంగా దక్షిణ లెబనాన్‌లో దాడులు ప్రారంభించామని ఇజ్రాయిల్ ఆర్మీ తెలిపింది.

Tags:    

Similar News