వీసాలేకుండానే అమెరికా వెళ్లొచ్చు.. వారికి మాత్రమే ఈ ఆఫర్!
ఈ సందర్భంగా ప్రసంగించిన బైడెన్... మిత్రదేశాల వల్లే మనం సురక్షితంగా ఉంటున్నాం. మన విలువలు, విధానాలే అందుకు కారణం.
అమెరికా వెళ్లడం చాలా మందికి అతిపెద్ద కల అని అంటారు. ముఖ్యంగా అమెరికా వీసా దొరకడం అంటే అదొ పెద్ద అదృష్టంగా చెప్పుకుంటారు. అందులో ఏ చిన్న తేడా ఉన్నా ఎయిర్ పోర్టు నుంచి రిటన్ ఫ్లైట్ ఎక్కించేస్తారు. అంత స్ట్రిక్ట్ గా ఉండే వీసా లేకుండానే అమెరికాకు వెళ్లొచ్చు. ఈ ఆఫర్ తాజాగా ప్రకటించింది అగ్రరాజ్యం. అయితే ఈ ఆఫర్ అందరికీ కాదు సుమా... ఇజ్రాయెలీలకు మాత్రమే!
అవును... ప్రస్తుతం రెండు వారాలకు పైబడి ఇజ్రాయేల్ – హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధం హమాస్ మొదలుపెట్టినా.. ముగించేది మాత్రం తామే అని ఇజ్రాయేల్ బలంగా చెబుతుంది. తమ శత్రువులు కొన్ని దశాబ్ధాలపాటు గుర్తుంచుకునే స్థాయిలో ఈ యుద్ధాన్ని ముగిస్తామని గట్టిగానే చెబుతుంది. మాటలే కాదు.. చేతలు కూడా ఆ దిశగా ఉండేలా పనులు మొదలుపెట్టింది.
ఈ సమయంలో ఇజ్రాయేల్ కు అగ్రరాజ్యం అమెరికా తమ మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పర్యటించారు. ఈ సమయంలో ఉక్రెయిన్, ఇజ్రాయెల్ కు సాయం అందించడంతో పాటు మరికొన్ని అవసరాల కోసం 105 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ఆమోదించాల్సిందిగా కాంగ్రెస్ ను బైడెన్ కోరనున్నారు. ఇందులో 60 బిలియన్ డాలర్లు ఉక్రెయిన్ కు, 14 బిలియన్ డాలర్లు ఇజ్రాయెల్ కు అందించనున్నారు.
ఇక మిగిలిన సొమ్ములో మానవతా చర్యల కోసం 10 బిలియన్ డాలర్లు, అమెరికా - మెక్సికో సరిహద్దు నిర్వహణకు 14 బిలియన్ డాలర్లు, ఇండో - పసిఫిక్ ప్రాంతం కోసం 7 బిలియన్ డాలర్లు కేటాయించాలన్నది ప్రణాళిక అని తెలుస్తుంది. ఈ సందర్భంగా... హమాస్, రష్యా వేర్వేరు విధాలుగా బెదిరింపులకు పాల్పడుతున్నా.. ఆ రెండింటి ఎజెండా పొరుగున ఉన్న ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడమే అని జో బైడెన్ సంచలన ఆరోపణలు చేశారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన బైడెన్... మిత్రదేశాల వల్లే మనం సురక్షితంగా ఉంటున్నాం. మన విలువలు, విధానాలే అందుకు కారణం. ఇప్పుడు ఉక్రెయిన్ కు ఇజ్రాయెల్ కు సాయం చేయకుండా పక్కకు జరిగితే.. మనకే నష్టం జరుగుతుంది అని తమ పౌరులను ఉద్దేశించి అన్నారు. ఇక ఈ యుద్ధాల్లో ఉక్రెయిన్, ఇజ్రాయెల్ గెలిచేలా మనం చేసే చిన్న సాయం.. తర్వాతి తరాల అమెరికన్ల భద్రతకు మూలమవుతుందని బైడెన్ వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా... ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం తీవ్రమైన ఈ సమయంలో ఇజ్రాయెలీ పౌరులు ఎలాంటి వీసా లేకుండానే 90 రోజులపాటు తమ దేశాన్ని సందర్శించడానికి అమెరికా ప్రభుత్వం వీలు కల్పించింది. ఈ వీసా మినహాయింపు కార్యక్రమం గురువారం నుంచే అమలులోకి వచ్చింది. బయోమెట్రిక్ పాస్ పోర్టులు ఉన్నవారికి ఈ సౌలభ్యం లభిస్తుంది. అటువంటి పాస్ పోర్ట్ లు లేనివారు మాత్రం వీసా కోసం దరఖాస్తు చేసుకోవలసిందే.