'అమ్మ' పార్టీలో అగ్ని జ్వాలలు.. తమిళనాట పెను ప్రకంపనలు!
తాజాగా పళని స్వామి వర్గ నేతగా ఉన్న అన్నాడీఎంకే ప్రిసైడింగ్ కమిటీ చైర్మన్ తమిళ్ మగన్ హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమ్మగా తమిళనాట పూజలందుకున్న దివంగత ముఖ్యమంత్రి జయలలిత సొంత పార్టీ అన్నాడీఎంకేలో అగ్నిజ్వాలలు ఎగిసి పడ్డాయి. ఇప్పటికే ఈ పార్టీ ముక్కలు చెక్కలుగా ఉంది. మాజీ ముఖ్యమంత్రులు ఎడ ప్పాడి పళని స్వామి, పన్నీర్ సెల్వంలు.. పార్టీ విషయంలో కోర్టుకు కూడా వెళ్లారు. వీరిలో ఇద్దరూ బీజేపీకి మద్దతుగా ఉండడం గమనార్హం. ఇక, వచ్చే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో వీరిరువురు కూడా రెండు గ్రూపులుగా విడిపోయి.. పార్టీని బలహీన పరుచుకునే ప్రయత్నాల్లో ముందుకు సాగుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
తాజాగా పళని స్వామి వర్గ నేతగా ఉన్న అన్నాడీఎంకే ప్రిసైడింగ్ కమిటీ చైర్మన్ తమిళ్ మగన్ హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది కూడా పార్టీ గుర్తు(రెండాకులు)కు సంబంధించి కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపినట్టు అయింది. తనకు పన్నీర్ సెల్వం 5 కోట్ల రూపాయల లంచం ఇవ్వజూపారని ఆయన బాంబు పేల్చారు. అన్నాడీఎంకే పార్టీనిముక్కలు చేసే క్రమంలో ఆ పార్టీ ఎన్నికల గుర్తు అయిన రెండాకుల వ్యవహారం పన్నీర్ సెల్వం-పళని స్వామిల మధ్య వివాదాన్ని రాజేసింది.
దీంతో ఇరువురూ.. పార్టీ ఎన్నికల గుర్తపై కోర్టులకు వెళ్లారు. ఈ క్రమంలో హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామికి అనుకూలంగా తీర్పులు వెలువరించాయి. అన్నాడీఎంకే పార్టీ పేరును, ఎన్నికల గుర్తు రెండాకులను కూడా పళనికే కేటాయిస్తూ తీర్పులు చెప్పాయి. అయితే.. ఈ రెండింటి విషయంలో పంతంపై ఉన్న మాజీ సీఎం పన్నీర్‌సెల్వం.. తెరచాటున చేసిన ప్రయత్నాలను.. తాజాగా హుస్సేన్ బట్టబయలు చేశారు.
''పార్టీకి సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై సంతకం చేయకుండా, తనకు మద్దతిస్తే రూ.5 కోట్లు ఇస్తానని ఓపీఎస్ బేరమాడారు. రాత్రికిరాత్రే ఇంటికి సొమ్ము పంపిస్తానన్నారు. అయితే.. అమ్మ(జయ)పై మమకారంతో నేను ఆ సొమ్ము తీసుకోలేదు. అంతేకాదు.. ఇంత పెద్ద కుట్ర పన్నిన ఓపీఎస్ గురించి పళనికి చెప్పేశా. ఇలాంటి ద్రోహులను పార్లమెంటు ఎన్నికల్లో తరిమి తరిమి కొట్టాలి'' అని హుస్సేన్ వ్యాఖ్యానించారు. మాజీ సీఎం, జయలలితకు నమ్మిన బంటు వంటి.. పన్నీర్ సెల్వంను నమ్మక ద్రోహిగా పేర్కొన్నారు.