కాంగ్రెస్ కే యువత పట్టంకట్టిందా!
వీళ్ళలో మెజారిటి ఓటర్లు బీఆర్ఎస్ ను పూర్తిగా వ్యతిరేకించినట్లు అర్ధమవుతోంది.
తాజాగా ముగిసిన పోలింగ్ సరళిపై విశ్లేషణలు మొదలయ్యాయి. వీటి ప్రకారం చూస్తే జనాలు ముఖ్యంగా యువత కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినట్లు అర్ధమవుతోంది. పైగా మొదటిసారి ఓట్లేసిన వారు కాంగ్రెస్ కే పట్టంకట్టారట. తెలంగాణాలోని మొత్తం 3.26 కోట్లమంది ఓటర్లలో యువత ఓట్లు 30 శాతముంది. అంటే సుమారు కోటిమందికి పైగా 18 ఏళ్ళ నుండి 35 ఏళ్ళ మధ్య ఉన్నవారే ఉన్నారు. వీళ్ళలో మెజారిటి ఓటర్లు బీఆర్ఎస్ ను పూర్తిగా వ్యతిరేకించినట్లు అర్ధమవుతోంది.
దీనికి ముఖ్య కారణం ఏమిటంటే ఉద్యోగాలు భర్తీ చేయకపోవటమే. ఉద్యోగాల నోటిపికేషన్లకు నోటీసులు ఇవ్వటం, రద్దు చేయటం, టీఎస్సీపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించటం. ప్రశ్నపత్రాలు లీకయ్యాయని చెప్పి పరీక్షలు రద్దుచేయటమే సరిపోయింది. ఒక్క పరీక్షను కూడా కేసీయార్ ప్రభుత్వం సరిగా నిర్వహించలేకపోయింది. పైగా పేపర్ల లీకేజీలో పాత్రదారులు, సూత్రదారులుగా బయటపడిన వారిలో అత్యధికులు బీఆర్ఎస్ నేతలే. కనీసం ఆరు నోటిఫికేషన్లను ఇచ్చిన కేసీయార్ ప్రభుత్వం అన్నింటినీ రద్దుచేసింది.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన విద్యార్ధులపై, నిరుద్యోగులపైన కేసులు పెట్టి జైళ్ళకు పంపింది. ఇదే సమయంలో కొందరు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంతో నిరుద్యోగ యువతతో పాటు విద్యార్ధులు కేసీయార్ ప్రభుత్వానికి బాగా వ్యతిరేకమైపోయారు. కేసీయార్ అధికారంలో ఉండగా ఉద్యోగాల భర్తీ జరగదని వీళ్ళు నిర్ధారణకు వచ్చారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే నిరుద్యోగులు 30 లక్షలమంది ఉన్నారు. వీళ్ళతో పాటు వీళ్ళ కుటుంబాలను కూడా కలిపితే సుమారు 80-90 లక్షల మంది ఓటర్లవుతారు.
అలాగే ఓటు అర్హతున్న విద్యార్ధులు, వాళ్ళ కుటుంబాలు కలిపితే మరో 20 లక్షలవుతారు. ఈ విధంగా కోటి మందికి పైగా ఓటర్లు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ఈ సమయంలో ఎన్నికలు జరగటంతో వాళ్ళలో మెజారిటి బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓట్లేశారని సమాచారం. ఇదే సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన సిక్స్ గ్యారెంటీస్ యువతను బాగా ఆకర్షించింది. రెండుసార్లు అధికారం ఇచ్చినా కేసీయార్ ఏమీ చేయలేకపోయారు కాబట్టి ఒకసారి కాంగ్రెస్ కు అధికారం ఇచ్చి చుద్దామని అనుకున్నారు. అందుకనే కాంగ్రెస్ కు అవకాశాలు పెరిగిపోయిందనే విశ్లేషణ పెరిగిపోతోంది.