వసంత ఔటేనా.. జ్యేష్టకేనా టికెట్‌!

2019 ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావుపై విజయం సాధించారు.

Update: 2024-01-23 23:30 GMT

ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటి.. మైలవరం. ఇక్కడి నుంచి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావుపై విజయం సాధించారు. అటు వసంత, ఇటు దేవినేని ఇద్దరూ కమ్మ సామాజికవర్గానికి చెందినవారే.

కాగా వచ్చే ఎన్నికల్లో మైలవరం టిక్కెటును వసంత కృష్ణప్రసాద్‌ కు వైసీపీ ఇవ్వదనే టాక్‌ నడుస్తోంది. వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఈ నియోజకవర్గంలో అంతగా జరగలేదని అంటున్నారు. ఈ విషయంలో పలుమార్లు వైసీపీ ముఖ్య నేతలు వసంత కృష్ణప్రసాద్‌ ను హెచ్చరించారని గుర్తు చేస్తున్నారు.

అయితే మైలవరం నియోజకవర్గానికి స్థానికుడయిన పెడన ఎమ్మెల్యే, రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్‌ తన నియోజకవర్గంలో జోక్యం చేసుకోవడం, పెడనను వదిలేసి ఆయన కార్యకలాపాలన్నీ ఇక్కడే చేయడం వంటి కారణాలతో వసంత కృష్ణప్రసాద్‌ పార్టీ కార్యక్రమాలను పట్టించుకోలేదని టాక్‌ నడిచింది. వైసీపీ అధిష్టానం సైతం ఈ విషయంలో తనకు కాకుండా జోగి రమేశ్‌ కు మద్దతు ఇవ్వడంతో గతంలోనే వసంత కృష్ణప్రసాద్‌ పార్టీకి రాజీనామా చేస్తారని వార్తలు వచ్చాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీ డీపీ అభ్యర్థికి ఓటేసిన వైసీపీ ఎమ్మెల్యేల్లో వసంత పేరు కూడా వినిపించింది. అయితే ఆయన వేయలేదని వెల్లడైంది.

ఈ నేపథ్యంలో మైలవరం పంచాయతీ విషయంపై వసంత కృష్ణ ప్రసాద్, జోగి రమేశ్‌ ల మధ్య ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాజీ కుదిర్చారు. మైలవరం నియోజకవర్గంలో జోగి రమేశ్‌ ను జోక్యం చేసుకోవద్దని జగన్‌ ఆదేశించారు. అంతేకాకుండా జోగి అనుచరులు సైతం ఎమ్మెల్యే వసంతకు వ్యతిరేకంగా కార్యకలాపాలు మానుకోవాలన్నారు.

అయితే వసంతను ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మైలవరం నుంచి జగ్గయ్యపేటకు వెళ్లాల్సిందిగా జగన్‌ సూచించారని టాక్‌ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జగ్గయ్యపేట నుంచి పోటీ చేయాలని ఆదేశించినట్టు చెబుతున్నారు. ఇది నచ్చని వసంత సైతం పార్టీకి గుడ్‌ బై చెప్పడానికి సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ మైలవరం నుంచి జ్యేష్ట రమేశ్‌ బాబును ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించే యోచనలో ఉందని అంటున్నారు.

జ్యేష్ట రమేశ్‌ బాబు గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు. మన మైలవరం – మన నాయకత్వం పేరుతో ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమా, వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ఇద్దరూ నందిగామ నియోజకవర్గం వారేనని.. మైలవరంకు చెందినవారు కాదని ఆయన అంటున్నారు. ఈసారి నాన్‌ లోకల్‌ కు టికెట్‌ ఇవ్వకుండా లోకల్‌ అభ్యర్థికే సీటు ఇవ్వాలని కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో వసంత కృష్ణప్రసాద్‌ కు జగ్గయ్యపేట సీటు ఇచ్చి.. మైలవరం సీటును మాజీ ఎమ్మెల్యే జ్యేష్ట రమేశ్‌ బాబుకు జగన్‌ ఇస్తారని టాక్‌ నడుస్తోంది.

Tags:    

Similar News