ఏపీ కాంగ్రెస్ కి వైసీపీ స్పాన్సర్ చేస్తోందా...!?
అలాంటి కాంగ్రెస్ కి ఒక అస్థిత్వం గుర్తింపు కేవలం వంద రోజుల వ్యవధిలో జరిగే ఎన్నికల లోపు వస్తాయా అంటే అదంతా భ్రమగానే చూడాలి.
ఏపీలో కాంగ్రెస్ ఉందా అంటే రాజకీయం తెలిసిన వారు ఎవరైనా బుర్ర గోక్కోవాల్సిందే. ఎందుకంటే కాంగ్రెస్ ని జనాలు పాతరేసి రెండు ఎన్నికలు జరిగిపోయాయి. కాంగ్రెస్ కి ఈ రోజున ఏ ఒక్క రాజకీయ పార్టీ తో పోటీ లేదు. ఉంటే గింటే నోటాతోనే తప్ప. అలాంటి కాంగ్రెస్ కి ఒక అస్థిత్వం గుర్తింపు కేవలం వంద రోజుల వ్యవధిలో జరిగే ఎన్నికల లోపు వస్తాయా అంటే అదంతా భ్రమగానే చూడాలి.
అయితే కొత్త ఎపుడూ వింతగానే ఉంటుంది. అలా కాంగ్రెస్ కి షర్మిల వచ్చారు. ఆమె పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ గొప్పది. కాంగ్రెస్ కి రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి తెచ్చి ఉమ్మడి ఏపీలో ఊపిరి పోసిన వైఎస్సార్ కుమార్తె ఆమె. వైఎస్సార్ పేరు చెబితే ఈనాటికీ జనాల కళ్ళు తడుస్తాయి. ఆయన జనం ముఖ్యమంత్రిగా మిగిలిపోయారు.
అందుకే ఆయన కుమర్తెను తమ వైపు తిప్పుకుని కాంగ్రెస్ ఏపీలో బండి లాగాలని చూస్తోంది. సరే రాజకీయ పార్టీ అన్నాక తన తిప్పలు తాను పడడంతో తప్పు లేదు. అయితే కందకు లేని దురద కత్తిపీటకు అన్నట్లుగా కాంగ్రెస్ కి పైసా ఖర్చు లేకుండా ప్రచారం సాయం చేసే ఎల్లో మీడియా ఒక వైపు ఉంది.
ఆ మీడియా వ్యూహాలు రాజకీయాలు అందరికీ తెలిసిందే. మరి కాంగ్రెస్ ని ఎంతో కొంత పైకి లాగితే ఆ పార్టీ వైసీపీ ఓటు బ్యాంక్ ని చీల్చితే అది అంతిమంగా టీడీపీకి ప్లస్ అవుతుందని అంచనాలో టీడీపీ అనుకూల మీడియా ఆ పార్టీని లేపే ప్రయత్నం చేయవచ్చు. మరి వైసీపీకి ఏమైంది. ఆ పార్టీ ఎందుకు కాంగ్రెస్ విషయంలో అలా ఎగిరెగిరి పడుతోంది అంటే ప్రశ్నకు జవాబు అయితే లేదు. ఎందుకంటే ఈ తరహా వ్యూహాలకు ఆలోచనలకు జవాబులు ఎవరూ చెప్పలేరు కాబట్టి.
ఏది ఏమనుకున్నా గత మూడు రోజులుగా చూస్తే ఏపీలో కాంగ్రెస్ వార్తలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏపీలో ఏమీ లేని ఏమీ కాని కాంగ్రెస్ ని మరో వైపు వైసీపీ పని గట్టుకుని స్పాన్సర్ చేసి మరీ ప్రమోట్ చేస్తోందా అన్న డౌట్లు అయితే వచ్చేస్తున్నాయి. కాంగ్రెస్ ని ఎందుకు భుజాలకు వైసీపీ ఎత్తుకుంటోంది అన్నది ఎవరికీ అర్ధం కాని విషయమే.
కాంగ్రెస్ ని లేపితే లాభం ఏమైనా వైసీపీకి ఉందా అంటే దాని మీదనే చర్చ సాగుతోంది. ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదు అని విపక్షాలు పట్టుబట్టి ఉన్నాయి. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంది కూడా అందుకే. ఇపుడు కాంగ్రెస్ గ్రాఫ్ ఏ మాత్రం పెరిగినా అందులోకి కూడా వైసీపీ వ్యతిరేక ఓట్లు వచ్చిపడతాయి. అసలు కాంగ్రెస్ అన్నది కనుక లేకపోతే ఊసులో కనిపించకపోతే ఆ ఓట్లు అన్నీ కూడా టీడీపీ జనసేన కూటమికే పడాల్సి ఉంటుంది.
కానీ ఇపుడు కాంగ్రెస్ వచ్చింది. ఎంతో కొంత జనంలో గుర్తింపు ఉన్న షర్మిల నాయకురాలిగా ఉన్నారు. అలా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. దాన్ని పెంచి పెద్దది చేసేదిగా వైసీపీ వ్యూహాలు ఉన్నాయి. దాంతో కాంగ్రెస్ ఏపీ అధినేత హోదాలో షర్మిల ఒకటి అంటే నాలుగు అంటూ వైసీపీ కాంగ్రెస్ పార్టీని జనం నోళ్ళలో నానేలా చేస్తోంది. కాంగ్రెస్ పేరు ఇపుడు పెద్దగానే వినిపిస్తోంది.
దానికి జవాబు కూడా షర్మిల ఇస్తున్నారు. అలా వారూ వీరూ ఆడుకునే రాజకీయ ఆటలో కాంగ్రెస్ పేరు మారు మోగుతోంది. మరి ఇదంతా కావాలని చేస్తున్నారా దీని వెనకాల ఏమైనా వ్యూహాలు ఉన్నాయా అసలు ఏమిటి ఇదంతా అంటే ఏమో రాజకీయం ఇదని మాత్రమే చెప్పాలి. ఏమైనా ఉండవచ్చు. ఉండకపోవచ్చు. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రమోషన్ విషయంలో వైసీపీ పనిగట్టుకుని చేస్తోంది అన్న మాట మాత్రం అంతటా ఉంది. చూడాలి మరి రానున్న రోజులలో ఏమి జరగనుందో.