నిరసనకు యత్నించిన ఐటీ ఉద్యోగులు... ఈసారి సైబర్ టవర్స్ వద్ద ఉద్రిక్తత!

చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఈ రోజు మరోసారి సాప్ట్ వేర్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.

Update: 2023-09-14 11:04 GMT

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఈ రోజు మరోసారి సాప్ట్ వేర్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. రాజకీయ కక్షతోనే అర్ధరాత్రి అరెస్టు చేశారంటూ హైదరాబాద్ గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్, సైబర్ టవర్స్ వద్ద ఐటీ ఉద్యోగులు నిరసనకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

అవును... నిన్న (బుధవారం) హైదరాబాద్ గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ వద్ద "ఐ యాం విత్ సీబీఎన్" ప్లకార్డులతో ఐటీ ఉద్యోగులు మానవహారం, ర్యాలీ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఉద్యోగుల నిరసనకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. ఉద్యోగులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఇదే క్రమంలో ఈరోజు (గురువారం) టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మరోసారి ఐటీ ఉద్యోగులు ఆందోళనకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ సైబర్ టవర్స్ వద్ద ఆందోళనలకు యత్నించారు. దీంతో హైటెక్ సిటీ వద్ద మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఈ సమయంలో సైబర్ టవర్స్ వద్ద తమ నిరసన కార్యక్రమాలూ చేపట్టాలని నిర్ణంచుకున్న ఐటీ ఉద్యోగులు.. అటువైపుగా కదిలారు. “ఐ యాం విత్ సీబీఎన్” ఫ్లకార్డులతో బయలుదేరారు. దీంతో నిరసనకు ఎలాంటి అనుమతి లేదని చెబుతూ.. ఎలాంటి ఆందోళన చేయవద్దని పోలీసులు హెచ్చరించారు. ఈ సమయంలో ముందు జాగ్రత్తగా సైబర్ టవర్స్ వద్ద భారీగా పోలీసు బలగాలను మొహరించారు.

కాగా... ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. దీంతో... చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని, రాజకీయ కక్ష సాధింపు అని టీడీపీ నేతలు ఆరోపిస్తుండగా... దొంగను పట్టుకుంటే కక్ష సాధింపు ఎలా అవుతుందని వైసీపీ కౌంటర్స్ వేస్తుంది!

Tags:    

Similar News