జగన్ గతాన్ని మరిచిపోయారు అధ్యక్షా: నారా లోకేష్
ఆయనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేందుకు రూల్స్ ఒప్పుకోవడం లేదని.. ప్రజలు ఇవ్వనప్పుడు తాను ఇవ్వడం సమంజసం కాదని స్పీకర్ అయ్యన్న తన రూలింగ్ పత్రంలో పేర్కొన్నారు.;
వైసీపీ అధినేత జగన్ కేంద్రంగా బుధవారం అసెంబ్లీలో అధికార పక్షం నిప్పులు చెరిగింది. వరుస పెట్టి మంత్రులు జగన్‌పై విమర్శల తూటాలు పేల్చారు. ముఖ్యంగా బుధవారం స్పీకర్ అయ్యన్న పాత్రుడు జగన్‌ను ఉద్దేశించి.. విడుదల చేసిన రూలింగ్ పై సభలో చర్చ జరిగింది. ఆయనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేందుకు రూల్స్ ఒప్పుకోవడం లేదని.. ప్రజలు ఇవ్వనప్పుడు తాను ఇవ్వడం సమంజసం కాదని స్పీకర్ అయ్యన్న తన రూలింగ్ పత్రంలో పేర్కొన్నారు.
దీనిపై మంత్రి నారా లోకేష్, మంత్రి నాదెండ్ల మనోహర్ సహా పలువురు మాట్లాడారు. తొలుత మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. జగన్ గతాన్ని మరిచిపోయారని అన్నారు. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబును ఇదే సభలో అవమానించారని తెలిపారు. ఆయనకు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. ఐదారుగురు సభ్యులను తాము లాగేస్తే.. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఉండదని జగన్ నిండు సభలోనే చెప్పారని గుర్తు చేశారు.
అంటే.. అసెంబ్లీ రూల్స్ గురించి.. జగన్‌కు తెలుసునని.. 10 శాతం మంది అభ్యర్థులు ఉంటేనే ఏ పార్టీకైనా.. ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కుతుందని.. ఈ విషయం తెలిసి కూడా..జగన్ ఇప్పుడు యాగీ చేస్తున్నారని మండిపడ్డారు. ముందుగా.. జగన్ తన బాధ్యతను పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. 11 మందిని గెలిపించిన ప్రజల తరఫున మాట్లాడేందుకు.. సభకు రాకుండా.. తనకు ప్రతిపక్ష హోదా కోసం.. మారాం చేయడం.. చిన్నపిల్లలను తలపిస్తోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని శాసనసభలూ పార్లమెంట్ సంప్రదాయాలనే అనుసరిస్తాయని మంత్రి నారా లోకేష్ చెప్పారు. సెక్షన్ 121 సి ప్రకారం ఏదైనా సభలో సభ్యుల సంఖ్యలో పదో వంతు ప్రతిపక్షానికి ఉండాలని లోక్‌సభలో రూలింగ్ ఉందన్నారు. ఈ విషయం తెలిసి కూడా.. జగన్ మారాం చేయడం సహేతుకం కాదన్నారు. ప్రజాతీర్పును గౌరవించి వారి కోసం పోరాడాల్సిన బాధ్యత పార్టీలదేనని హితవు పలికారు.
ఇక, జనసేన నాయకుడు, మంత్రి మనోహర్ మాట్లాడుతూ.. తనకు దక్కని దాని కోసం.. జగన్ ప్రయత్ని స్తున్నారని అన్నారు. ఆయన ఆశలు ఇప్పట్లో తీరవని.. వచ్చే ఎన్నికల్లో ప్రయత్నిస్తే.. అప్పుడేమైనా ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుందేమో చూడాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజలు గౌరవం ఇవ్వకుండా ఛీ కొట్టినప్పుడు హోదా ఇవ్వాలని ఎలా కోరుకుంటారని నిలదీశారు. దేశంలో జగన్ లాంటి నాయకుడు ఎవరూ ఉండరని ఆగ్రహం వ్యక్తం చేశారు.