5 నెలల్లో 91 అత్యాచారాలు... కూటమి ప్రభుత్వంపై జగన్ నిప్పులు!
తాజాగా జరిగిన కేబినెట్ మీటింగ్ లోనూ తన ఆవేదనను వెల్లడించడంతో ఈ విషయంలో ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది.
ఏపీలో ఇప్పుడు లా అండ్ ఆర్డర్ పై విపరీతమైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ విషయంపై పిఠాపురంలో తీవ్ర స్థాయిలో ఫైరవ్వడం, తాజాగా జరిగిన కేబినెట్ మీటింగ్ లోనూ తన ఆవేదనను వెల్లడించడంతో ఈ విషయంలో ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది.
అయితే... ఈ విషయాలపై స్పందించిన చంద్రబాబు సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ పోస్టులు పెడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచిస్తూ.. మరో నెల రోజుల్లో పోలీసు వ్యవస్థను గాడిలో పెడతామని అన్నారు! ఈ సమయంలో తాజాగా మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు.
అవును... ఏపీలో శాంతి భద్రతల సమస్య, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, ప్రస్తుతం నెలకొన్న మిగిలిన పరిస్థితులపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ స్పందించారు. ఇందులో భాగంగా.. ప్రస్తుతం ఏపీలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని.. బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడా ఇలాంటివి చూసి ఉండరని అన్నారు.
ఇదే సమయంలో... ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని.. ఫలితంగా ఏపీ అతలాకుతలం అవుతోందని.. రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తునాయని జగన్ నిప్పులు చెరిగారు. ఎన్నికలప్పుడు చెప్పింది ఒకటి, ఇప్పుడు చేస్తున్నది మరొకటి.. ఇదేమి అని ప్రశ్నిస్తే, వారిని అణగదొక్కే చర్యలు కనిపిస్తున్నాయని జగన్ విమర్శించారు.
ప్రధానంగా ఎన్నికల వేళ సూపర్ సిక్స్ అని, సూపర్ సెవెన్ అని హామీలు ఇచ్చి అన్ని వర్గాలనూ మోసం చేశారని.. మూడు విడతలుగా ఇవ్వాల్సిన విద్యాదీవెన ఇవ్వలేదు, ఆరోగ్య శ్రీ అటకెక్కింది, ఆర్బీకే (రైతు భరోసా కేంద్రాలు) నిర్వీర్యం, ఫ్యామిలీ డాక్టర్ ఊసే లేదు.. అన్ని విషయాల్లోనూ ఈ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని జగన్ ఫైర్ అయ్యారు.
ఇక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అత్యంత దారుణంగా ఉందని చెప్పిన జగన్... మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు పెరిగిపోయాయని అన్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచీ మహిళలు, పిల్లలపై 91 ఘటనలు చోటు చేసుకున్నాయని.. వీటిల్లో ఏడుగురు బాధితులు చనిపోయారని.. టీడీపీ కార్యకర్తలే దగ్గరుండి ఈ పనులు చేయిస్తున్నారని మండిపడ్డారు!
చంద్రబాబు బావమరిది బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలతో పాటు ప్రతీచోటా ఇలాంటి ఘోరమైన ఘటనలు జరుగుతున్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని చెబుతూ.. 41ఏ నోటీసులు ఇవ్వకుండా.. కనీసం కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా వైసీపీ కార్యకర్తలను, సోషల్ మీడియా జనాలను అరెస్టులు చేస్తున్నారని.. అరెస్టుల అనంతరం కోర్టులో హాజరుపరచడం లేదని జగన్ విమర్శించారు! ఏళ్లకాలం ఈ ప్రభుత్వమే ఉంటుందని పోలీసులు అనుకోకూడదని.. చట్ట ప్రకారం ముందుకుపోవాలని సూచించారు!