పాచిపోయిన పలావ్ కధ ఎంత కాలం జగన్ ?
వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తన భాషను తన సెటైర్లను తన విమర్శలను పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.;
వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తన భాషను తన సెటైర్లను తన విమర్శలను పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఏదైనా చెబితే ఒకటి రెండు సార్లు వినడానికి మాత్రమే బాగుంటుంది. ఆ తరువాత అవి పూర్తిగా బోర్ కొడతాయి. అందులోనూ సోషల్ మీడియా యుగం ఇది. టెక్నాలజీ అరచేతిలో ఉన్న కాలమిది.
ప్రతీ వారూ క్రియేటర్ గా ఉన్న ఈ కాలంలో నాయకులు కూడా ఎప్పటికప్పుడు తమ భాషను తమ ప్రసంగాలను మార్చుకుంటూ ఎలా జనాలను ఎట్రాక్ట్ చేయాలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ఏడున్నర పదుల వయసులో ఉన్న గ్రాండ్ ఓల్డ్ పొలిటీషియన్ అయిన చంద్రబాబే ఏపీలో అందరి కన్నా బెటర్ అని అంటున్నారు అంటే బాబు ఎపుడూ అప్టూ డేట్ గానే ఉంటారు అంటున్నారు.
చంద్రబాబు స్పీచ్ ఎక్కువగా ఉండవచ్చు, కొంత రొటీన్ గానూ ఉండవచ్చు. కానీ ఆయన మధ్యలో అప్పటికప్పుడు ఏదో విషయం తెచ్చి జనాలను తన వైపు తిప్పుకుంటారు. అది బహిరంగ సభ అయినా పార్టీ మీటింగ్ అయినా మీడియా మీట్ అయినా బాబు ఎంతో కొంత కొత్తదనానికి చూస్తారు. కానీ జగన్ మాత్రం అలా పడికట్టు పదాలనే నమ్ముకుంటున్నారు అన్న విమర్శలు అయితే గట్టిగానే ఉన్నాయి.
తాజాగా జగన్ ఏపీ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబుని విమర్శిస్తూ తన ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా జగన్ తెచ్చిన పోలికలు వేసిన సెటైర్లు పాతవి అరిగిపోయినవి అన్న సెటైర్లు పడుతున్నాయి.
వైసీపీ జనాలకు పలావ్ పెట్టిందని అయితే బిర్యానీ పెడతాను అని నమ్మించి చంద్రబాబు మోసం చేశారని జగన్ సెటైర్లు వేశారు. ఇది ఇప్పటికి అనేకసార్లు జగన్ వాడేసిన సెటైరే అని అంటున్నారు. ప్రతీ ఇంట్లో ఇపుడు చర్చ ఏమిటి అంటే అని మొదలెట్టారు జగన్. సీఎం గా జగన్ ఉన్నపుడే బాగా చూసుకున్నారని జనాలు అనుకుంటున్నారని ఆయన చెప్పారు.
కనీసం పలావ్ అయినా పెట్టాడు, ఈ రోజు పలావూ పోయింది చంద్రబాబు పెడతాను అన్న బిర్యానీ కూడా పోయిందని చివరికి మోసంగా మారిందని జనాలు అంటున్నారని చెబుతూ జగన్ ఈ సెటైర్ పేల్చారు. ఇక గత తొమ్మిది నెలలుగా జగన్ ఇదే సెటైర్ వేస్తున్నారు.
తాను బాగానే జనాలను చూసుకున్నాను పలావ్ పెట్టాను అని. అయితే జనాలు పలావ్ పెట్టినా ఎందుకు ఓడించారో మాత్రం ఆయన తెలుసుకోలేకపోతున్నారని అంటున్నారు. జగన్ పెట్టిన పలావ్ వారికి నచ్చితే ఎందుకు ఇంతలా ఓడిస్తారు అన్నది కూడా ఆలోచించుకోవాలని అంటున్నారు.
సరే చంద్రబాబు బిర్యానీ పెడతాను అని అంటే ఆశపడడంలో తప్పు లేదు కానీ పలావ్ పెట్టిన జగన్ కి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనంత అవమానకరంగా ఓడించారు అంటే తప్పు బిర్యానీకి ఆశపడిన జనాలది మాత్రమే కాదని వైసీపీలోనూ ఉందని జగన్ తెలుసుకోవాలని అంటున్నారు.
అంతే కాదు ప్రజలకు తాను పెట్టిన పలావ్ సరిపోలేదని గ్రహించి ఇక మీదట ఏమి చేయాలో కూడా ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు. ఇక బాబు ప్రభుత్వం మీద విమర్శలు చేసేందుకు కొత్త పోలికలు సరికొత్త సెటైర్లు ఎంచుకోవాల్సి ఉందని అంటున్నారు. లేకపోతే జగన్ కి పలావ్ మాటలు బోర్ కొట్టకపోయినా జనాలకు మాత్రం అవి రొటీన్ గానే వినిపించి వారి చెవులకు సోకే చాన్స్ లేకుండా పోతుందని అంటున్నారు.