నాడు శారదాపీఠం...నేడు శృంగేరీ పీఠం
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఉన్నట్లుండి విజయవాడ గాంధీనగర్ బీఆర్టీఎస్ రోడ్ లో ఉన్న శృంగేరి శారదా పీఠాన్ని ఆయన సందర్శించారు.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఉన్నట్లుండి విజయవాడ గాంధీనగర్ బీఆర్టీఎస్ రోడ్ లో ఉన్న శృంగేరి శారదా పీఠాన్ని ఆయన సందర్శించారు. శారదా పీఠంలో శ్రీ విధుశేఖర భారతి మహా స్వామీజీని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి ప్రత్యేకంగా బయటకు వచ్చి జగన్రీ శృంగేరి పీఠాన్ని సందర్శించడం ఆసక్తిని రేపిన సందర్భంగానే చూడాల్సి ఉంది.
జగన్ కి శ్రీ విధుశేఖర భారతి మహా స్వామీజీ ఆశీస్సులు అందించారు. జగన్ స్వామి పీఠంలో కొద్ది సేపు గడిపారు. ఆయన వెంట బాబాయ్ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. ఇదిలా ఉంటే జగన్ సడెన్ గా ఈ పీఠానికి ఎందుకు వచ్చారు దీని వెనక ఏమిటి అన్న చర్చ సాగుతోంది.
జగన్ 2014 నుంచి నిన్నటిదాకా విశాఖ శ్రీ శారదా పీఠం స్వామీజీ ఆశీస్సులు అందుకుంటూ వచ్చారు. స్వరూపానందేంద్ర స్వామీజీ జగన్ కి ఆశీస్సులు ఇచ్చారు. జగన్ కి ఆయన ఆధ్యాత్మికపరంగా రాజ గురువుగా కూడా చెప్పుకుటూ ఉండేవారు.
ఆయన మాట మీదనే తూర్పు నుంచి పాలించాలని భావించి జగన్ విశాఖను రాజధానిగా చేయాలని అనుకున్నారని అంటారు. ఆయన రాజశ్యామల యాగం చేసిన మీదటనే జగన్ కి రాజ్య యోగం లభించింది అని కూడా ప్రచారంలో ఉంది.
ఇవన్నీ పక్కన పెడితే ఇక 2024 ఎన్నికల్లో జగన్ ఓటమి పాలు అయ్యారు. దాంతో పాటు ఆయన గత అయిదారు నెలలుగా పార్టీ పునర్ నిర్మాణ పనులలో ఉన్నారు. ఆయన వారంలో మూడు రోజులు తాడేపల్లిలో ఉంటే నాలుగు రోజులు బెంగళూరులో ఉంటున్నారు అని అంటున్నారు.
ఈ క్రమంలో వీక్ స్టార్టింగ్ లో తాడేపల్లికి వచ్చిన జగన్ రెండవ రోజునే శృంగేరి శారదా పీఠాన్ని సందర్శించడం మాత్రం చర్చకు తావిస్తోంది. జగన్ మరోమారు ఆధ్యాత్మిక బలాన్ని గట్టిగా కోరుకుంటున్నారా అన్న డిస్కషన్ కూడా సాగుతోంది. జగన్ రాజకీయంగా ఇపుడు ఇబ్బందులలో ఉన్నారు.
భారీ ఓటమి తరువాత వైసీపీలో అంతా అయోమయంగా కనిపిస్తోంది అని అంటున్నారు. దాంతో మరో మారు వైసీపీ పైకి లేవడానికి అదే విధంగా తన రాజకీయ జాతకం మారడానికి జగన్ ఏమైనా ఆలోచిస్తున్నారా అన్న చర్చ సాగుతోంది.
ఇక జగన్ కి అత్యంత ఆప్తుడైన స్వామీజీగా స్వరూపానందేంద్ర ఉన్నారు కదా శృంగేరీ పీఠం ఎందుకు అని కూడా అంటున్న వారు ఉన్నారు. ఏది ఏమైనా జగన్ పనిగట్టుకుని అక్కడికి వెళ్ళారు అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు. చూడాలి మరి స్వామీజీ ఆశీస్సుల బలంతో జగన్ ఏమి చేయబోతున్నారో.