జగన్ తో పాటే పవన్... పక్కా వ్యూహంతోనే !

దాంతో ఇపుడు ప్రభుత్వం కూడా గ్రౌండ్ లెవెల్ రిపోర్టులను తెప్పించుకునే పనిలో పడింది.

Update: 2024-12-30 09:30 GMT

ఏపీలో రాజకీయం గేరు మారుస్తోంది. ఆరు నెలలుగా కొంత స్తబ్దతగా ఉన్న పొలిటికల్ సీన్ వైసీపీ నిరసనలతో మళ్లీ మెల్లగా రూట్ లోకి వస్తొంది. ఇంకో వైపు ఏపీలో టీడీపీ కూటమి ఏర్పాటు అయిన తరువాత తొలి ఆరు నెలల కాలం ముగిసింది. హానీమూన్ పీరియడ్ కూడా పూర్తి అయింది. దాంతో ఇపుడు ప్రభుత్వం కూడా గ్రౌండ్ లెవెల్ రిపోర్టులను తెప్పించుకునే పనిలో పడింది.

అదే విధంగా ఏపీలో ప్రజలు ఏమి అనుకుంటున్నారు. ప్రభుత్వం పని తీరు ఎలా ఉంది అన్నది కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. ఈ నేపథ్యంలో చూస్తే కొత్త ఏడాది వస్తూనే వైసీపీ అధినేత జగన్ జనంలోకి వస్తాను అని చెబుతున్నారు. ఆయన జనవరి నెలాఖరులో ఏపీలో ఉన్న ఇరవై ఆరు జిల్లాలలో ఒక షెడ్యూల్ ప్రకారం పర్యటించనున్నారు. జిల్లాలో రెండు రోజులు వంతున జగన్ పర్యటన సాగనుంది.

ఆ సమయంలో ఆయన జిల్లాలోనే బస చేస్తారు. ఆ విధంగా పార్టీని పటిష్టం చేసుకుంటూనే జనంతో మమేకం అయి వారి సమస్యలను నేరుగా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు జగన్ జనంలోకి రావాలని చూడడంతో టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా అప్రమత్తం అవుతోంది.

ఇక పవన్ కళ్యాణ్ సైతం జనంలోకి రావాలని చూస్తున్నారు. ఆయన కూడా ప్రతీ జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించేలా కార్యక్రమం సిద్ధం చేస్తున్నారు. జగన్ ఒక వైపు విపక్ష నేత హోదాలో వస్తూంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ పర్యటనలకు శ్రీకారం చుట్టడం పట్ల చర్చ సాగుతోంది.

ఏపీలో వైసీపీని బలపడనీయకూడదు అన్న ఆలోచనతోనే ఇదంతా చేస్తున్నారా అన్నది కూడా చర్చిస్తున్నారు. ఏపీలో ఆరేడు నెలల కూటమి పాలన మీద జనంలో మిశ్రమ స్పందన ఉంది. దానికి కారణం సూపర్ సిక్స్ హామీలు నెరవేరలేదని దిగువ వర్గాలలో అసంతృప్తి ఉంది.

ఉన్నత మధ్యతరగతి వర్గాలలో చూస్తే అభివృద్ధి ఇంకా మొదలు కాలేదని ఉంది. ఇక ఉద్యోగ వర్గాలలో చూస్తే తమకు కొత్త పీఆర్సీ మాట పక్కన పెట్టి ఇంటీరియం రిలీఫ్ ని ఇవ్వలేదని ఏడు నెలల కొత్త ప్రభుత్వం పాలనలో ఒక డీయే అయినా ఇవ్వలేదని అంటున్నారు నిరుద్యోగ యువత కొత్త పోస్టింగుల కోసం చూస్తోంది. డీఎస్సీ రిక్రూట్మెంట్ ఆలస్యం కావడం పోలీస్ రిక్రూట్మెంట్ విషయంలో నూ లేట్ కావడం వంటిని వారిలో కొంత కలవరం కలిగిస్తున్నాయి.

అదే విధంగా నిత్యావసర ధరలు అధికంగా పెరగడం, దానికి తోడు అన్నట్లుగా విద్యుత్ చార్జీల పెంపు కూడా సగటు జనానికి ఇబ్బందిగా మారుతున్నాయి. దీంతో ప్రభుత్వం పట్ల ప్రస్తుతానికి అయితే సన్నగా అసంతృప్తి మొదలైంది. అది ఇంకా ఒక రూపం అయితే సంతరించుకోలేదు. వైసీపీ వైపుగా ఈ అసంతృప్తిని మళ్ళించుకోవాలని వైసీపీ అధినాయకత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.

అయితే అంతవరకూ పరిస్థితి రానీయకుండా చూడాలని కూటమి పెద్దలు ఆలోచిస్తున్నారు. అందుకే చరిష్మాటిక్ లీడర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ ని జనంలోకి వెళ్తున్నారు అని అంటున్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని ప్రభుత్వం అన్నింటినీ పరిష్కరిస్తుందని ప్రభుత్వ పెద్దగా భరోసా ఇచ్చేలా పవన్ పర్యటనలు ఉంటాయని అంటున్నారు.

మరో వైపు చూస్తే ప్రభుత్వం ఆరు నెలలకే అన్ని విధాలుగా విఫలం అయింది అని జగన్ జనంలోకి రానున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా మరచిపోయారని ప్రభుత్వం ప్రజలకు రిక్త హస్తం చూపిస్తోందని ఆయన బిగ్ సౌండ్ చేయనున్నారు

ఇలా రెండు విభిన్న వాదనలతో పవన్ జగన్ జనంలోకి కొత్త ఏడాది రానున్నారు అని అంటున్నారు. మరి జనాలు ఎవరి వైపు చూస్తారు, ఎవరి వాదన కరెక్ట్ అని ఆలోచిస్తారు అన్న దాని మీద 2025లో ఏపీ పాలిటిక్స్ ఆధారపడి ఉంటుందని అంటున్నారు. అదే సమయంలో ఏపీ పాలిటిక్స్ ని విపక్షం స్టీరింగ్ తిప్పి తన వైపు తీసుకోకుండా కూటమి తగిన ప్రణాళికతోనే ముందుకు సాగుతోంది అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News