దేవుడు పెద్ద స్క్రిప్ట్ రాయబోతున్నారు.. జగన్ చెప్పిన జోస్యం !
ఇంతలా దిగజారి నా మీద రాళ్ళతో దాడి చేశారు అంటే ప్రత్యర్ధులు తమ ఓటమిని తాము అంగీకరించారు అని జగన్ సంచలన కామెంట్స్ చేశారు.
నా నుదిటి మీద అయిన గాయం రేపటి వైసీపీ వైసీపీ విజయానికి సంకేతం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. నా నుదుటి మీదనే రాయి తగిలి గాయం అయింది. అదే కన్ను మీదనో లేక తల మీదనో తగిలి ఉంటే ఎంతో ముప్పు అయి ఉండేదని ఆయన అన్నారు. కానీ అలా జరగలేదు అంటే మీ ఆశీస్సులు వల్లనే అన్నారు. దేవుడు పెద్ద స్క్రిప్ట్ ఒకటి రాయబోతున్నారు అని దీని వల్లనే అర్ధం అవుతోంది అన్నారు.
ఇంతలా దిగజారి నా మీద రాళ్ళతో దాడి చేశారు అంటే ప్రత్యర్ధులు తమ ఓటమిని తాము అంగీకరించారు అని జగన్ సంచలన కామెంట్స్ చేశారు. మనం విజయానికి ఎంత దగ్గరగా ఉన్నామో కూడా కూడా వారు చాటి చెప్పారని అన్నారు. నా నుదుటి మీద దాడితో వారు ఏదో సాధిద్దామనుకున్నారు కానీ అది జరిగే పని కాదు అన్నారు.
నేను ఎక్కడా వెనక్కి తగ్గేది లేదు అని ఆయన అన్నారు. నా సంకల్పం ఒక్క అడుగు కూడా తగ్గదు అని జగన్ అన్నారు. నేను పేదల కోసం ఇంకా మరిన్ని అడుగులు ముందుకు వేస్తాను అని జగన్ అన్నారు. నా మీద దాడి చేయడం అంటే అది పేదల మీదనే దాడి అని ఆయన అన్నారు.
చంద్రబాబు తన రాజకీయ జీవితంలో పేదలకు ఎన్నో గాయాలు చేశారని ఆయన గుర్తు చేశారు. తన నుదిటిన తగిన గాయం అన్నది ఒక పది రోజులలోనే తగ్గిపోతుందని బాబు పేదలకు చేసిన గాయాలు అన్యాయాలు మాత్రం అలాగే ఉన్నాయని అన్నారు. వాటిని సరి చేయాలన్నది తన ఆశయం అన్నారు.
చంద్రబాబు రాజకీయ సిద్ధాంతం అంతా వెన్నుపోట్లు మోసాలు అని జగన్ మండిపడ్డారు. దొంగ వాగ్దానాలతో అధికారంలోకి రావడం వచ్చిన తరువాత హామీలను చెత్తబుట్టలో వేయడం చంద్రబాబుకు అలావాటుగా మారింది అని అన్నారు. ఆయన 2014 నుంచి 2019 దాకా పాలించారు, ఆ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గుర్తు చేసుకుంటే ఈసారి ఆయన హామీలను ఎవరూ న మ్మరని అన్నారు.
రుణ మాఫీ చేస్తాను అని రైతులను బాబు మోసం చేశారని అలాగే డ్వాక్రా మహిళలను మోసం చేశారని నిరుద్యోగ భృతి ఇస్తామని నెలకు రెండు వేలు అన్నారని అది కూడా ఇవ్వలేదని అన్నారు. మొత్తం మీద చూస్తే బాబు అన్నీ సున్నా చుట్టేశారు అన్నారు. అలాంటి పెద్ద మనిషి ఎన్నికలు వస్తున్నాయంటే మళ్లీ సూపర్ సిక్స్ అంటూ జనం లోకి వచ్చారు అని అన్నారు. బాబు చెప్పే ఏ ఒక్క దానిని నమ్మవద్దు అని ఆయన కోరారు.
బాబు అంటే పేదల వ్యతిరేకి అని ఆయన విమర్శించారు.చంద్రబాబుకు ఎంతసేపూ అధికారం మీద యావ తప్ప పేదలకు మంచి చేయాలన్న తపన మానవత్వం ఏమీ లేవు అని అన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఓటమి పాలు అయి అన్ని విధాలుగా ఇబ్బందులో ఉంటే ఆయన మామ ఎన్టీయార్ ఆయనను తెచ్చి పార్టీలో చేర్చుకున్నారు అని అన్నారు. అలాంటి ఎన్టీయార్ ని వెన్నుపోటు పొడిచిన చరిత్ర బాబుది అన్నారు.
చంద్రబాబుకు అవసరం అయినపుడల్ల ఎన్టీయార్ ఫోటో బయటకు తీసి దండం పెడతారు అని ఆ తరువాత దాన్ని పక్కన పెడతారు అని విమర్శించారు. ఎస్సీలను బీసీలను ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ చులకన చేసిన చంద్రబాబుకు బడుగులు అంటే ప్రేమ అభిమానం లేఅనేలేవని అన్నారు. చంద్రబాబు గెలుపు కోసం ఎన్ని అయినా చేస్తాడని ఆయనతో జాగ్రత్త అని జగన్ హెచ్చరించారు.
ప్రతీ ఇంటికీ ఒక బెంజ్ కారు కేజీ బంగారం ఇస్తాను అని చెబుతాడని అదే విధంగా ఏమైనా చేస్తాను అంటాడని జగన్ వెటకారమాడారు.. చంద్రబాబుని నమ్మడం అంటే చెరువులో చేపలకు కొంగను కాపాలా పెట్టడమే అన్నారు. అలాగే దొంగ చేతికి ఇంటి తాళాలు అప్పగించడమే అన్నారు. పులి నోట్లో బుర్ర పెట్టడమే బాబుని నమ్మడం అని కూడా అన్నారు. ప్రజలు అంతా అన్నీ ఆలోచించుకోవాలని ప్రతీ ఇంటికి మేలు చేసిన తన ప్రభుత్వానికి అండగా ఉండాలని పేదల ప్రభుత్వాన్ని తీసుకుని రావాలని జగన్ కోరారు. ఈ విషయంలో అంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. తాము మంచి చేసి మాత్రమే ఓట్లు అడుగుతున్నామని ఆయన చెప్పారు.