జగన్ ది రియాక్షన్ అనుకుంటే యాక్షన్ స్టార్ట్ చేసింది ఎవరు...?
ఏపీ మరో తమిళనాడుగా మారిపోయిందని, ప్రతీకార రాజకీయాలు ఏపీలో జడలు విప్పుకున్నాయని కూడా అపర మేధావులు బావురుమంటున్నారు.
ఈ రోజున చాలా మంది బుద్ధి జీవులు మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు అరెస్ట్ అన్యాయం అక్రమం అని గుండెలు బాదుకుంటున్నారు. ఏడున్నర పదుల వయసులో ఈ కష్టాలు అని కూడా కన్నీరు కారుస్తున్నారు. ఏపీ మరో తమిళనాడుగా మారిపోయిందని, ప్రతీకార రాజకీయాలు ఏపీలో జడలు విప్పుకున్నాయని కూడా అపర మేధావులు బావురుమంటున్నారు.
అయితే ఏపీ రాజకీయాలలో ప్రతీకార ధోరణులు ఇపుడే పుట్టాయా లేక వాటికి మూలాలు ఎక్కడ ఎపుడు మొలిచాయన్నది చూడాలన్న ఆశ కోరిక తపన తాపత్రయం ఈ బుద్ధిజీవులకు ఉందా అన్నది అతి ముఖ్యమైన పాయింట్. ఏపీలో ప్రతీకార రాజకీయాలు లేనట్లుగా ఇపుడే చూస్తున్నామన్నట్లుగా ఆవుళిస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పెద్ద మనుషులు ఫ్లాష్ బ్యాక్ కధలను బ్లాక్ అండ్ వైట్ రోజులను చాలా ఈజీగా కన్వీనియెంట్ గా మరచిపోతున్నారు అన్న విమర్శలు వారి వెనకనే బిగ్ సౌండ్ తో వినిపిస్తున్నాయి.
వైఎస్సార్ కి వీరాభిమాని అయిన మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు జగన్ తనను జైలుకు పంపించిన వారిని అందరినీ జైలుకు పంపాలనే ఇలా బాబుని అరెస్ట్ చేశారని విశ్లేషిస్తున్నారు. బాలయ్య బావమరిది బాలయ్య సైతం అదే మాటను పదే పదే అంటున్నారు. తాను పదహారు నెలలు జైలులో ఉన్నాను కాబట్టి కనీసం పదహారు రోజుల పాటు బాబుని జైలు గోడల మధ్యన ఉంచాలన్నది జగన్ తాపత్రయం అని అంటున్నారు.
ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ అయితే జగన్ క్రిమినల్ అని తీవ్ర వ్యాఖ్యలే చేశారు. అందుకే ఆయనకు ఎపుడూ జైలు కనిపిస్తుందని, అందరికీ జైలుకు పంపాలని చూస్తున్నారు అని భారీ ఆరోపణే చేశారు. ఇదే తీరున చదువరులైన వారు, మేధావులుగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చి ఇపుడు రిటైర్ అయిన వారు మాజీ ఐఏఏస్ లు చాలా మంది ఏపీలో పాలిటిక్స్ ఇలా ఉన్నాయా అని తెగ చింతిస్తున్నారు.
కానీ 2009లో వైఎస్సార్ మరణానంతరం జగన్ అనే మూడు నెలల ఎంపీతో చంద్రబాబుకు ఏ వైరం ఉందని ఆయన మీద కాంగ్రెస్ పెట్టిన అవినీతి కేసులు అనబడే వాటిలో ఇంప్లీడ్ అయ్యారన్నది మరో వైపు నుంచి వస్తున్న ప్రశ్న. ఇక వైఎస్సార్ చంద్రబాబు మంచి మిత్రులుగా ఉండేవారు. ఎన్ని విభేదాలు ఉన్నా అని ఇప్పటికీ చాలా మంది చెబుతూ ఉంటారు. మరి వైఎస్సార్ తోనే విభేదాలు లేకపోతే జగన్ తో ఎందుకు బాబుకు ఇప్పటికి పుష్కర కాలం క్రితం విభేదాలు వచ్చాయో చెప్పగలరా అంటే జవాబు ఉంటుందా.
జగన్ కి కాంగ్రెస్ పెద్దలకు మధ్య విభదాలు వచ్చాయంటే వారిది ఒక పార్టీ. జగన్ ఓదార్పు యాత్రకు హై కమాండ్ అనుమతి ఇవ్వలేదని ఆయన వారిని ఎదిరించారని అనుకుందాం. అపుడు కాంగ్రెస్ పెద్దల అహం దెబ్బతిని తమ వద్ద ఉన్న అస్త్రాలను బయటకు తీసి ఆయన మీద కేసులు పెట్టించారు అన్నది ఈ రోజుకీ మెజారిటీ జనం నమ్ముతున్న మాట. అదే టైంలో వైసీపీ వారు కూడా ఈనాటికీ అదే మాటను అంటూ ఉంటారు.
ఇక కాంగ్రెస్ జగన్ ల మధ్య అలా రచ్చ సాగుతూ ఉంటే అప్పట్లో విపక్షంగా ఉన్న టీడీపీకి ఏమి సంబంధం అని జగన్ తో డైరెక్ట్ గా పెట్టుకుంది అన్నది కీలకమైన ప్రశ్నగానే ఫ్లాష్ బ్యాక్ కధలు తెలిసిన వారు వేస్తూ ఉంటారు. దివంగత ఎర్రన్నాయుడు, అశోక్ గజపతిరాజు ప్రభృతులు అంతా కలసి కాంగ్రెస్ పెట్టిన కేసులో ఇంప్లీడ్ అయ్యారు.
అలా జగన్ తో చంద్రబాబు డైరెక్ట్ ఫైట్ కి నాడు ముందుకు వచ్చారు అని అంటారు. మరి అది యాక్షన్ అనుకుంటే ఇపుడు రియాక్షన్ అని అపర మేధావులు, వివేకవంతులు అని తాముగా ఫీల్ అయ్యే వారు ఎందుకు భావించరని కూడా అంటున్నారు. సైన్స్ లో ఒక సిద్ధాంతం ఉంది. ప్రతీ యాక్షన్ కి ఒక రియాక్షన్ ఉంటుంది.
నాడు జగన్ అనబడే ముప్పయ్యారేళ్ల యువకుడిని రాజకీయాల్లో పెద్దగా ఏమీ తెలియని వ్యక్తిని, ఎవరితోనూ ఏ విధంగానూ బంధాలు వివాదాలు లేని నవతరం నేతను అరెస్ట్ చేసి పదహారు నెలలు జైలుకు పంపించారు అన్నది చరిత్రలో ఉంది కదా. అయితే అది కక్ష కాదు అవినీతి ఆరోపణల మీదనే జగన్ జైలుకు వెళ్లారు అని అంటే ఇది కూడా అలాగే తీసుకోవచ్చు కదా.
నాడు ఒప్పు అయింది నేడు ఏ విధంగా తప్పు అవుతుంది అన్నది చూడాలి కదా. నాడు కోర్టులు ఆధారాలు ఉన్నాయని నమ్మబట్టే జగన్ కి రిమాండ్ విధించారు అని వాదించిన మేధావులు పెద్దలు ఇపుడు అదే కోర్టు తీర్పుతోనే కదా బాబు రిమాండ్ లో ఉన్నారని ఎందుకు అంగీకరించరు అన్నది కూడా లాజిక్ పాయింటే కదా.
తమిళనాడుని పోలికగా తెస్తున్నారు కానీ అక్కడ జరిగిందేంటి కరుణానిధి వర్సెస్ జయలలిత ఎపిసోడ్ లో నిండు సభలో జయలలితను అవమానించారు. దానికి ఆమె వైపు నుంచి రియాక్షన్ వచ్చింది. అయితే ఏపీ ప్రభుత్వం అయితే ఇందులో కక్ష సాధింపు లేదని చెబుతోంది. చట్టం తన పని తాను చేస్తోందని అంటోంది.
నాడు పనిచేసిన చట్టాలూ కోర్టులే ఇపుడు రిమాండుకు పంపుతున్నాయి. చట్టం నాడు గొప్పది అయితే నేడు కూడా గొప్పదే. నాడు న్యాయం గెలిచింది అని గొప్పగా చెప్పుకున్న వారు నేడు కూడా అదే న్యాయం గెలిచింది అని మౌనం వహించాల్సిందే కదా. మొత్తం మీద చూస్తే రాజకీయాలు అంటే బేలతనాలు ఉండవు, సానుభూతులు ఉండవు. టిట్ ఫర్ టాట్. చాన్స్ ఎవరికి వస్తే వారు చూపిస్తారు. అలా అనుకుని హుందాగా ఆట ఆడితేనే లీడర్ అనిపించుకుంటారు. అంతే తప్ప తమకు దెబ్బ తగిలినపుడు యాగీ చేసి ఎదుటి వారిని అదే దెబ్బ కొడితే అదంతా రాజకీయ చాణక్యం అని అనుకుంటేనే చిక్కులు వస్తాయి.
నీతులు ధర్మపన్నాలు వల్లించే పెద్దల మనుషులు చెప్పే ప్రవచనాల ప్రకారం చూస్తే ఏడున్నర పదుల వయసులో బాబుని అరెస్ట్ చేయకూడదు, మూడున్నర పదుల వయసులో ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్న జగన్నిఅసలు
అరెస్ట్ చేయకూడదు. కానీ చట్టానికి ఇవేమీ పట్టదు కదా. అందుకే దాని పని అది చేసుకుని పోతుంది. అందుకే ఎవరైనా చట్టాన్ని గౌరవించాలి. చట్ట ప్రకారం నడచుకోవాలి. అపుడే కారాలూ మిరియాలు ఉండవు, ప్రతీకారాలు అంతకంటే ఉండవు.