నాది డైరెక్ట్ కనెక్షన్...జగన్ బిగ్ స్టేట్మెంట్ !
ఆయన ప్రత్యర్ధులను విమర్శించినా ఒక మోతాదులోనే ఉంటుంది. అవసరం లేదు అనుకున్నపుడు వారి పేర్లు కనీసంగా కూడా ప్రస్తావించరు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బయట ఎక్కువగా మాట్లాడరు. ఇక సభలలో సైతం ఆచీ తూచీ మాట్లాడుతారు. ఆయన ప్రతీ మాట కూడా తూకంగానే ఉంటుంది. ఆయన ప్రత్యర్ధులను విమర్శించినా ఒక మోతాదులోనే ఉంటుంది. అవసరం లేదు అనుకున్నపుడు వారి పేర్లు కనీసంగా కూడా ప్రస్తావించరు.
ఏపీ పాలిటిక్స్ లో జగన్ తన ప్రత్యర్ధిగా 2024 ఎన్నికల్లో మొదటి నుంచి చంద్రబాబునే భావిస్తున్నారు. ఆయన అంచనాయే నిజం అయింది. జనసేనతో పొత్తు పెట్టుకుని మెయిన్ ఫోర్స్ గా టీడీపీ వైసీపీతో తలపడుతోంది. ఈ నేపధ్యంలో జగన్ తన బలాన్ని ధైర్యాన్ని పల్నాడు సభలో ఆవిష్కరించారు. ఈసారి సరికొత్త పంధాలో ఆయన చెప్పాల్సింది చెప్పారు.
నాకు ప్రజలకు మధ్య ఎవరూ మధ్యలో ఉండరు. నాకు దళారులు అవసరం లేదు. నేనూ మీరు అంతే నో అదర్స్ అంటూ జగన్ పేర్కొనడం విశేషం. అంతే కాదు నాది డైరెక్ట్ కనెక్షన్ అని ఆయన బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అయిదు కోట్ల మంది ఏపీ జనంతోనే జగన్ అని ఆయన స్పష్టం చేసారు.
గత ప్రభుత్వానికి ఎంతో మంది మధ్య దళారులు ఉన్నారు. కానీ నాకు ప్రజలే ఉన్నారు అని ఆయన అంటున్నారు. ప్రతీ ఇంటితోనూ డైరెక్ట్ కనెక్షన్ ఉంది అన్నట్లుగా ఆయన మాట్లాడారు. నేను అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు అన్నీ మీ డోర్ స్టెప్ దాకా తీసుకుని వస్తున్నాను అంటే మన మధ్య ఎవరికీ చోటు లేదనే అర్ధం అని ఆయన అన్నారు.
తనకు ఇంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది అంటే అది ప్రజలు ఇచ్చిందే అన్నారు. తాను ప్రజలకు నమ్ముకున్నాను అని ఆయన చెప్పేశారు. నాకు పొత్తులు అంటే తెలియవు. ఉన్న పొత్తు ఏదైనా ఉందంటే అది ప్రజలతోనే. అది కూడా డైరెక్ట్ గానే అని జగన్ చెప్పాక జనాలు రియాక్షన్ కూడా పాజిటివ్ గానే ఉండాలి మరి.
ఏపీలో ఎన్నో కార్యక్రమాలు చేశాం, అనేక పధకాలను ప్రజల కోసం అందించాం, రెండేళ్ళ పాటు కరోనా వచ్చి ఏపీ అతలాకుతలం అయింది. అయినా కూడా ఏ ఒక్క సంక్షేమాని అసలు ఆపలేదు దానికి కారణం పేదలు నష్టపోకూడదనే అని జగన్ చెప్పుకొచ్చారు.
మరో వైపు చూస్తే తాము చెప్పిన మాటలను ఇచ్చిన హామీలను నెరవేర్చాం కాబట్టే ఇంత ధైర్యంగా ప్రజల వద్దకు వచ్చి మరో మారు ఓటు వేయమని అడుగుతున్నామని జగన్ అన్నారు. అదే ధైర్యం టీడీపీకి లేదని జగన్ ఎద్దేవా చేశారు. 2014 టైం లో అనేక హామీలు ఇచ్చిన టీడీపీ పెద్దలు ఒక్క దాన్ని కూడా నెరవేర్చలేకపోయారు అని ఆయన విమర్శించారు.
దత్తపుత్రుడు నాడు టీడీపీ ఎన్నికల ప్రణాళికకు హామీలకు బాధ్యత తీసుకుని కూడా ఏమీ చేయలేకపోయారని పవన్ని అటాక్ చేశారు. తాను ప్రతీ ఇంటికీ చేసిన మంచిని గుర్తించి తనకు ఓటు వేయాలని ఆయన కోరారు. ఎవరు ఏమేమి చేశారు అన్నది ప్రజల కళ్ల ముందు ఉందని కూడా జగన్ చెప్పుకొచ్చారు.
హామీలు నెరవేర్చని వారికి 2019లో జనాలు గట్టిగా బుద్ధి చెప్పి 23 సీట్లు ఇచ్చారని జగన్ అనడం వెనక మరోసారి అదే పరాభవం టీడీపీకి చేయాలనే అంటున్నారు. ఇక చంద్రబాబు విజన్ని కూడా పవన్ సెటైరికల్ గా ఎద్దేవా చేశారు. 2000లో చంద్రబాబు ఉంటే 2020 అంటారు, 2023లో ఉంటే 2047 అంటారు. అదే తన విజన్ అంటారు.
ఆయన ఎపుడూ ఫ్యూచర్ అంటూ వర్తమానాన్ని వదిలేస్తారు అని గట్టిగానే టార్గెట్ చేశారు. ఈ రోజు బాగు చూడకుండా మరో ఇరవై పాతికేళ్ళకు అంటూ కబుర్లు చెప్పడమే టీడీపీ అధినేతలు అలవాటు అంటూ జగన్ విజనరీ బాబుని గట్టిగానే తగులుకున్నారు.
మొత్తానికి జగన్ చెప్పేది ఏంటి అంటే తన పొత్తులు తన నేస్తాలు తన దేవుళ్ళూ అంతా ప్రజలే అని. ప్రజల కోసమే తాను ఉన్నాను అని తన పాలనను చూసి ఓటేయమని, హామీలు తీర్చని టీడీపీ ఈసారి మరిన్ని కొత్త హామీలతో ముందుకు వచ్చినా నమ్మవద్దు అని. మరి జగన్ డైరెక్ట్ కనెక్షన్ జనంతో అంటున్నారు. ప్రతీ ఇంటితోనూ తనకు బంధం ఉందంటున్నారు. ఆ ఫలితాలు ఎలా ఉంటాయో మరి కొద్ది నెలలలో జరిగే ఎన్నికలు తెలియచేస్తాయి.