జగన్ కి జనాల కి మధ్య దూరం ?

జగన్ టూర్లలో జనానికి దగ్గరగా వెళ్తున్నారు. అది సిద్ధం సభలు అయితే ర్యాంప్ వాక్ చేస్తున్నారు.

Update: 2024-04-15 00:30 GMT

జగన్ టూర్లలో జనానికి దగ్గరగా వెళ్తున్నారు. అది సిద్ధం సభలు అయితే ర్యాంప్ వాక్ చేస్తున్నారు. అలాగే రోడ్ షోల టైం లో ఆయన బస్సు దిగి మరీ జనాల వద్దకు వెళ్తున్నారు. వారితో ముచ్చటిస్తున్నారు. ఇదంతా గత పదిహేను రోజులుగా జగన్ మేమంతా బస్సు యాత్ర సందర్భంగా చోటు చేసుకుంటున్న సన్నివేశాలు.

ఇదిలా ఉంటే జగన్ బస్సు యాత్రలో భారీ గజమాలలు స్పెషల్ అట్రాక్షన్ గా మారిపోయాయి. ఒక్క చోట స్టార్ట్ అయి మంచి రెస్పాన్స్ వచ్చింది దాంతో క్రేన్ సాయంతో భారీ గజమాల తీసుకుని వస్తున్నారు. దాంతో వాటి వల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయి.

ఇవన్నీ సమీక్షించుకున్న తరువాత జగన్ భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని నిఘ విభాగం పోలీసులకు కీలక సూచనలు చేసింది. జగన్ బస్సు యాత్ర స్టార్ట్ అయిన తరువాత ఇప్పటికి రెండు దాడులు జరిగాయి. మొదటి దాడి చూస్తే అది చెప్పులతో చేసిన దాడి. అనంతపురం జిల్లా గుత్తిలో జరిగింది. కానీ జగన్ మీద చెప్పు పడకుండా సెక్యూరిటీ అడ్డుకున్నారు

కానీ ఇపుడు ఏకంగా ఒక రాయి ఆయన ఎడమ కంటి బొమ్మకు తగిలి గాయం అయింది. తృటిలో ప్రాణాపాయం తప్పింది. లేకపోతే అదే కణత మీద జరిగి ఉంటే జగన్ ప్రాణానికే ముప్పు అని అంటున్నారు. అలాగే కంటి మీద దాడి జరిగితే కచ్చితంగా కన్ను పోయి ఉండేదని అంటున్నారు.

ఇదిలా ఉంటే జగన్ మీద రాళ్ల దాడి జరగడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. ఏపీ పోలీసులను నివేదిక అడిగింది. రెండు రోజులలో ఆ నివేదిక ఈసీకి చేరుతుంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే జగన్ భద్రతకు సంబంధించి ఇంటెలిజెన్స్ వర్గాలు సూచనలు చేశాయి అని అంటున్నారు.

ఇక మీదట సిద్ధం సభలలో జగన్ ర్యాంప్ వాక్ చేయకూడదు అని వారు కచ్చితమైన సూచనగా చెబుతున్నారు. అలాగే జగన్ ప్రయాణిస్తున్న బస్సు కి వంద మీటర్ల దూరంలో మాత్రమే జనాలను అనుమతిస్తారు. ఆ లోపలికి ఎవరికీ రానీయకుండా భారీ భద్రతను ఏర్పాటు చేస్తారు. అదే విధంగా జగన్ కూడా బస్సు టాప్ పైకి ఎక్కి జనాలకు అభివాదం చేయడం కంటే ఎక్కువ సమయం బస్సులోనే ఉంటూ ఆ విధంగా రోడ్ షోలను చేయాలని సూచిస్తున్నారు.

ఇంకో విషయం ఏమిటి అంటే జగన్ బస్సు యాత్రలో భారీ గజమాలలను నిషేధిస్తున్నారు. వాటిని ఇక మీదట ఎవరూ తేరాదని అంటున్నారు. జగన్ మీద రాళ్ళ దాడి జరిగిన కేసులో ఇప్పటికి అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద చూస్తే జనానికి జగన్ కి మధ్య మాత్రం ఒక పెద్ద గ్యాప్ ని పెంచేలా భద్రతా సూచనలు ఉన్నాయి.మరి వీటిని జగన్ ఎంతవరకూ పాటిస్తారు అన్నది చూడాల్సి ఉంది.

ఎన్నికల సీజన్ కాబట్టి ఆయన జనంలోకి తప్పనిసరిగా వెళ్లాల్సి ఉంది. అదే విధంగా వారితో ముచ్చటించాల్సి ఉంటుంది. ఇక జగన్ కి భద్రతను మరింతగా పెంచాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జెడ్ ప్లస్ కేటగిరీలో జగన్ ని తీసుకుని రావాలని కోరుతున్నారు జగన్ కి సంఘ విద్రోహక శక్తుల నుంచి ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. మొత్తానికి జగన్ మేమంతా బస్సు యాత్ర మళ్ళీ ప్రారంభం అయినపుడు కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీసులకు నిఘా సంస్థలు సూచించాయని అంటున్నారు.

Tags:    

Similar News