అధికారంలో ఉన్నపుడు చేయాలి జగన్ !

అయితే జగన్ విషయం తీసుకున్నా ఆయన కూడా ఇలాంటి అధికార వెలుగుల మధ్య నుంచి బయటకు చూడలేకపోయారు.

Update: 2024-07-31 17:14 GMT

అవును అధికారంలో ఉన్నపుడు ఎవరికైనా చాలా చిత్త భ్రమలు కలుగుతాయి. ఈ అధికారం శాశ్వతమని ఇక తమకు తిరుగులేదని కూడని భావిస్తారు. అపుడు ఏ కొత్త ఆలోచనలు రావు. ఓటేసి గెలిపించిన ప్రజల విషయం కూడా అంతగా గుర్తుకు రాదు. అది అందరి విషయంలోనూ అలాగే ఉంటుంది. అయితే జగన్ విషయం తీసుకున్నా ఆయన కూడా ఇలాంటి అధికార వెలుగుల మధ్య నుంచి బయటకు చూడలేకపోయారు.

దాని ఫలితాన్ని వైసీపీ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చూసింది. దారుణాతి దారుణంగా వైసీపీకి 11 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే దక్కాయి. దాంతో విపక్ష హోదా లేకుండా పోయింది. అయితే ఓటమి తరువాత వైసీపీ అధినాయకత్వానికి తాము చేసిన తప్పులు ఏమిటి అన్నది తెలిసి వస్తోంది. జగన్ కూడా ఇపుడు పోగొట్టుకున్న చోటనే వెతుక్కోవాలని చూస్తున్నారు.

ఆయన పులివెందుల నియోజకవర్గానికి వెళ్ళినపుడు అక్కడ ప్రజలతో మమేకం అయ్యారు. వారి సమస్యలు ఆలకించారు. అలాగే క్యాడర్ ని కూడా దగ్గరకు తీశారు. ఇపుడు తాడేపల్లి లో కూడా అదే జరిగింది. బెంగళూరు నుంచి జగన్ తన పర్యటనను ముగించుకుని వచ్చిన తరువాత ఆయన అధికార నివాసంలో ప్రజా దర్బార్ తరహాలో ఒక కార్యక్రమం జరిగింది.

జగన్ అందుబాటులో ఉన్నారు అని తెలిసి తాడేపల్లిలోని ఆయన నివాసం వద్దకు జనాలు బారులు తీరారు అలాగే క్యాడర్ కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. జగన్ కూడా కార్యకర్తలు అభిమానులతో మమేకం అయ్యారు.

అంతే కాదు ఒక పిల్లవాడిని దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా ముద్దులు కూడా పెట్టారు. ఇక ఎవరికి కావాల్సి వస్తే వారికి జగన్ సెల్ఫీలు కూడా ఇచ్చారు. వారితో కలసి ఫోటోలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అనేక మంది జగన్ కి తమ సమస్యలు వివరించారు అయితే ఏ ఒక్కరినీ అధైర్యపడవద్దని జగన్ భరోసా ఇచ్చారు.

వారికి వైసీపీ తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దామని కూడా చెప్పుకొచ్చారు. అయితే జగన్ చేసిన ఈ కార్యక్రమం బాగానే ఉన్నా ఈ పని అధికారంలో ఉన్నపుడు చేస్తేనే మేలైన ఫలితాలు వచ్చునని అంతా అంటున్నారు.

అయిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా జగన్ తాడేపల్లి ఇంటి గుమ్మం లోకి ఎవరికీ రానీయలేదు. తాను కూడా పరదాల మాటున సభలు నిర్వహిస్తూ అక్కడితో సరి అనిపించారు. ప్రజలు అంతా తన వెంట ఉన్నారు అని కూడా అనుకున్నారు. కానీ ప్రజలకు కావాల్సింది నాయకుడితో భేటీ అలాగే ఆయన నుంచి భరోసా. ఇది జగన్ సీఎం గా ఏ విధంగానూ ఇవ్వలేకపోయారు అని అంటున్నారు.

ఇపుడు జగన్ వారిని ఓదార్చడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. అధికారం లేని ఆయన మంచి రోజులు వస్తాయని ధైర్యం చెప్పడమే తప్ప ఏమీ చేయలేని పరిస్థితి అని అంటున్నారు. అధికారంలో ఉంటూ కూడా జనంతో మమేకం అయితే ఫలితాలు వేరేగా ఉండేవన్న చర్చ వైసీపీలోనూ బయట రాజకీయ వర్గాలలోనూ ఉంది. అయినా ఇప్పటికైనా వైసీపీ అధినాయకత్వం తప్పు తెలుసుకోవడం మంచిదే అన్న చర్చ కూడా ఉంది.

Tags:    

Similar News