మైలవరంపై ...మార్చలేక, ఉంచలేక!
దీనికి తోడు గత ఎన్నికల్లో గుండుగుత్తగా వసంతకు సహకరించిన.. కమ్మ వర్గం ఆయనను పక్కన పెట్టేసింది.
ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం మైలవరం. ఇక్కడ వైసీపీ నాయ కుడు వసంత కృష్ణ ప్రసాద్ గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. అయితే, అంతర్గత కుమ్ములాట లు, ప్రతిపక్షంతో విభేదాలు, వివాదాలతోనే ఆయన ఐదేళ్లు గడిపేశారు. వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఎక్కడా ఆయన ముద్ర కనిపించడం లేదు. దీనికి తోడు గత ఎన్నికల్లో గుండుగుత్తగా వసంతకు సహకరించిన.. కమ్మ వర్గం ఆయనను పక్కన పెట్టేసింది.
మరోవైపు గత ఎన్నికల్లో వసంత తండ్రి నాగేశ్వరరావు వైసీపీకి సహకరించగా, ఇప్పుడు ఆయన టీడీపీకి అనుకూలంగా ఉన్నారనే వాదన వినిపిస్తోంది. ప్రధానంగా రాజధాని అమరావతి విషయంలో వసంత నాగేశ్వరరావు.. టీడీపీని సమర్థిస్తున్నారు. అంటే.. ఒకరకంగా ఇంట్లోనే ఎమ్మెల్యేకు సెగ ప్రారంభమైంది. ఇక, కేడర్ పరంగా కూడా గత ఎన్నికల్లో ఉన్నంత దమ్ము ఇప్పుడు లేకుండా పోయిందనేది వాస్తవం.
ఇక, గడప గడపకు కార్యక్రమంలో భాగంగా కూడా.. వసంత పెద్దగా దూకుడు ప్రదర్శించలేక పోతున్నారు. మరోవైపు.. టీడీపీకి సానుకూల వాతావరణం ఏర్పడడం.. మాజీ మంత్రి దేవినేని ఉమాకు స్థానికంగా సింప తీ పెరుగుతుండడంతో ఐప్యాక్ టీం కూడా మైలవరం మనకుదక్కడం కష్టమనే సంకేతాలు ఇచ్చేసింది. దీంతో వైసీపీలో అంతర్మథనం ప్రారంభమైంది. ఇప్పటికే కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యం లేదనే టాక్ ఉన్న నేపథ్యంలో(మంత్రి కొడాలిని పక్కన పెట్టేయడం) ఉన్నపళంగా వసంతను తీసేస్తే.. మరింత ప్రభావం పడుతుందని భావిస్తోంది.
అలాగని ఎన్నికల్లో మళ్లీ వసంతకే అవకాశం ఇస్తే.. పోయి పోయి చేతులు కాల్చుకున్నట్టే అవుతుందని కూడా వైసీపీ అధిష్టానం ఆలోచనగా ఉంది. అందుకే.. దూకుడు నిర్ణయాలు తీసుకోకుండా.. ఆలోచించి అడుగులు వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, వసంత కూడా అన్నింటికీ సిద్ధంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ తనను పక్కన పెడితే.. ఆయన వెంటనే తన దారి తాను చూసుకుంటారనే వాదన కూడా వినిపిస్తోంది. మొత్తానికి మైలవరం పై వైసీపీ తర్జన భర్జన పడుతోందన్నది అన్న ప్రచారం చూస్తే వాస్తవం కి దగ్గరగానే ఉంది అని అంటున్నారు .