జగన్ సీరియస్ యాక్షన్...ఉండేదెవరు ?

వైసీపీలో కదలిక మొదలైంది. నిన్నటి దాకా పార్టీ పూర్తి నైరాశ్యంలో ఉంది. ఓటమి భారీగా ఉంది.

Update: 2024-07-11 04:30 GMT

వైసీపీలో కదలిక మొదలైంది. నిన్నటి దాకా పార్టీ పూర్తి నైరాశ్యంలో ఉంది. ఓటమి భారీగా ఉంది. దిక్కు తోచని నంబర్ తో వైసీపీ రిజల్ట్ ని అందుకుంది. దానిని భరించడం అధినేతకే కష్టం అయింది. వైసీపీలో కొంతమంది ఓటమిని కనీస మాత్రంగా అయినా ఊహించారు. అయితే ఎలాంటి పరిస్థితుల్లో అయినా యాభై సీట్లకు తగ్గవని అనుకున్నారు.

కానీ బొత్తిగా 11 సీట్లు అంటేనే వైసీపీలో అలజడి రేగింది. ప్రకంపనలౌ పుట్టాయి. ఎందుకొచ్చిన రాజకీయం అనుకున్న వారూ ఉన్నారు. ఈ పరిస్థితుల మధ్య నెల రోజుల కాలం ఇట్టే సాగిపోయింది. ఓటమిని అలా కౌగలించుకుంటూ కూర్చోవడం కుదరదు.

అందుకే ఇపుడు మెల్లగా నేతలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తన అభిప్రాయాలను చెబుతున్నారు. తప్పు ఒప్పులను చెబుతున్నారు. అవి అన్నీ మీడియా ముఖంగానే ఉండడం విశేషం. అదే సమయంలో జగన్ సైతం జిల్లాల వారీగా నేతలను పిలిచి సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు.

మరి ఆయనకు వారి నుంచి అందుతున్న ఫీడ్ బ్యాక్ ఏమిటో తెలియదు కానీ వైసీపీలో సమూల ప్రక్షాళనకు జగన్ నడుం బిగించారు అని అంటున్నారు. పార్టీలో దాదాపుగా వంద దాకా అసెంబ్లీ సీట్లలో మార్పులు భారీ ఎత్తున చేసి కూడా చేదు ఫలితాలు మూటకట్టుకున్న జగన్ ఇపుడు నియోజకవర్గాల ఇంచార్జిల నియామకాలను కొత్తగా చేపడుతున్నారు.

అందులో భాగంగా కృష్ణా జిల్లాలో పెడన అసెంబ్లీ ఇంచార్జిగా మాజీ మంత్రి జోగి రమేష్ ని జగన్ నియమించారు. ఆయన ఇటీవల ఎన్నికల్లో పెనమలూరు నుంచి పోటీ చేశారు. పెనమలూరుకు కొత్త ముఖాన్ని తీసుకుని వచ్చారు. ఇపుడు అనేక నియోజకవర్గాలలో ఇదే తీరున నియామకాలు జరుగుతాయని అంటున్నారు.

ఈ క్రమంలో అనంతపురం జిల్లా కదిరిలో మాజీ ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ఓడిన పార్టీ నుంచి నేతలే బయటకు పోతారు. ఉన్న వారిని కాచుకోవడమే కష్టం అవుతుంది. అటువంటిది పార్టీలో ఉన్న ఒక మాజీ ఎమ్మెల్యే స్థాయి నేతను సస్పెండ్ చేయడం ద్వారా జగన్ తాను ఏమి చేయదలచుకున్నదీ చెప్పేసారు అని అంటున్నారు.

ఈ సిద్ధారెడ్డి సస్పెండ్ చేయకపోయినా పార్టీ మారుతారు అని అంటున్నారు. అయితే ఆయన పార్టీ అభ్యర్థి ఓటమికి కారకుడు అని నిర్ధారించుకుని ఈ యాక్షన్ తీసుకోవడం ద్వారా జగన్ పార్టీలోని ఇతర నేతలకు ఒక సందేశం పంపారు అని అంటున్నారు ఎవరినీ ఉపేక్షించేది లేదు అన్నదే ఆ సందేశం అని అంటున్నారు.

మరో వైపు చూస్తే జగన్ అదే కదిరి నియోజకవర్గానికి ఇటీవల ఎన్నికలో ఓడిన బీఎస్ మక్బూల్ అహ్మద్ నే నియమించారు. ఇక చాలా చోట్ల వెన్ను పోట్లు చోటు చేసుకున్నాయని వార్తలు వస్తున్నాయి. కొన్ని చోట్ల అభ్యర్ధులు ఇచ్చిన డబ్బులు కూడా తినేసి కూటమి అభ్యర్థుల కోసం కృషి చేసారని వార్తలు ఉన్నాయి. అవి ఏపీలో చాలా చోట్ల జరిగాయని అంటున్నారు.

దాంతో అటువంటి వారిని గుర్తించి వేటు వేసే పనిలో వైసీపీ హై కమాండ్ ఉందని అంటున్నారు. అదే విధంగా మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జిలు పాత కొత్త వారితో నియమిస్తారని ఆ తరువాత జిల్లా కార్యవర్గాలను ప్రకటిస్తారని ఆ మీదట రాష్ట్ర కార్యవర్గాలను ప్రకటిస్తారని అంటున్నారు.

ప్రస్తుతం జగన్ ఈ కసరత్తులో బిజీగా ఉన్నారు అని అంటున్నారు. అదే సమయంలో పార్టీలో ఉండేవారు ఎవరు వెళ్లేవారు ఎవరూ అన్న సమాచారం కూడా పార్టీకి పక్కాగా ఉందని అంటున్నారు పలువురు సీనియర్లు అయితే ఈ రోజుకీ ముఖం చాటేస్తున్నారు. అలాగే చాలా మంది చివరి రెండేళ్లలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప ఈ రోజున ఫీల్డ్ లోకి దిగేందుకు ఆసక్తిగా లేరు.

ఇలా చాలా చోట్ల చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఉన్న నేపధ్యంలో జగన్ మరోసారి 175 నియోజకవర్గాలను ముందు పెట్టుకుని కసరత్తు చేస్తున్నారుట. మరి ఈ కసరత్తు తరువాత పార్టీ పటిష్టం అవుతుందా కొత్త ఉత్సాహం వస్తుందా లేక పార్టీలో నుంచి వెళ్ళే వారు వెళ్తారా అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News