ఈ కళ్లు మూసుకోవటం ఏమిటి జగన్ బాబు?

అందుకే.. మాట్లాడే ప్రతి సందర్భంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం.

Update: 2024-06-14 04:17 GMT

గతంలో మాదిరి కాదు. మనం మాట్లాడే ప్రతి మాటను ఈకకు ఈక.. పీకకు పీక పీకి మరీ లాగేస్తూ.. లేని అర్థాల్ని అపాదిస్తూ అల్లరి చేస్తున్న సోషల్ మీడియా కాలం. ఇలాంటి వేళ అత్యంత అప్రమత్తంగా మాట్లాడాల్సిన పరిస్థితి. అందునా.. అధికారం చేతిలో లేని వేళ.. నోటి నుంచి వచ్చే ప్రతి మాటను జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఎక్కువగా మాట్లాడకుండా ఉన్న నేపథ్యంలో.. నోటి నుంచి వచ్చే మాటల్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. మాట్లాడే ప్రతి మాటలోనూ.. ఏం మాట్లాడుతున్నారు? ఎలాంటి మైండ్ సెట్ లో ఉన్నారన్న విషయాన్ని అర్థం చేసుకునే విషయంపై ఫోకస్ ఉంటుంది.

అందుకే.. మాట్లాడే ప్రతి సందర్భంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ఈ విషయాన్ని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మిస్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఓటమి వేళ.. ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మొదటి సందర్భంలోనూ ఆయన నోటి నుంచి వచ్చిన మాటలపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. అవ్వ తాతల ప్రేమ ఏమైంది? అక్క చెల్లెళ్ల ఆదరణ ఏమైంది? నేనెంతో చేసినా ఓట్లు వేయకపోవటం ఏమిటి? అంటూ చేసిన ఎమోషనల్ స్పీచ్ ను అర్థం కంటే అపార్థం చేసుకున్నోళ్లే ఎక్కువ. ప్రజల సొమ్మును ప్రజలకు ఇచ్చిన వైనాన్ని తన గొప్పగా జగన్ ఎలా చెప్పుకుంటారన్న విమర్శను తెర మీదకు తీసుకొచ్చారు.

ఈ సందర్భంలోనూ జగన్ చేసిన వ్యాఖ్యల్లోని అర్థాన్ని.. భావాన్ని పట్టించుకోకుండా సెటైర్లు వేయటం ద్వారా.. ఆయన చెప్పాలనుకున్న విషయాన్ని పక్క దారి పట్టేలా చేశారని చెప్పాలి. ఇలాంటి సందర్భంలో తగిన జాగ్రత్తలతో మాట్లాడాల్సి ఉంది. తాజాగా పార్టీ నేతలతో భేటీ అయిన సందర్భంలో ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. సదరు వీడియో వైరల్ గా మారింది.

‘‘ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాం. ఈ ఎన్నికల్లో ఏమైందో తెలియదు. కళ్లు మూసుకుంటే ఐదేళ్లు అయిపోయాయి. మళ్లీ 2024 నుంచి 2029 వరకు కళ్లు మూసుకుంటే ఎన్నికలు వచ్చేస్తాయి. మనం గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏమంటే.. సినిమాలో ఫస్ట్ ఆఫ్ మాత్రమే అయింది’’ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు అసలు అర్థం.. కాలం పరుగులు తీస్తోంది. కళ్లు తెరిచి మూసే లోపు ఐదేళ్లు ఇట్టే గడిచిపోతాయి. అధికారం పోయిందని పట్టించుకోవద్దు.. భవిష్యత్తు మొత్తం మనదే అంటూ పార్టీ నేతలను ఊరడించే ప్రయత్నం జగన్ చేస్తే.. మాట్లాడే మాటల్ని సరైన పద్దతిలో మాట్లాడకపోవటంతో తప్పుడు అర్థం వచ్చేలా చేసిందని చెప్పాలి.

దీనికి తోడు ప్రముఖులు మాట్లాడే మాటల్ని తమకు అనువుగా ఎడిట్ చేసే ధోరణి నేపథ్యంలో ఒరిజినల్ గా మాట్లాడిన మాటలకు తమ అతిని అతికించటం ద్వారా తాము కోరుకునే ఎఫెక్టు కోసం ప్రయత్నించే వారు ఉండనే ఉంటారు. ఇదంతా చదివి.. ఈ సమర్థింపులకు తక్కువ లేదని అనుకోవచ్చు. కానీ.. ఇక్కడ జగన్ సైతం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే.. తాను మాట్లాడే మాటల్ని సూటిగా.. స్పష్టంగా తాను ఇవ్వాలనుకున్న సందేశాన్ని ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే తప్పించి.. తాను మాట్లాడిన మాటల్ని ఎవరికి వారు అర్థం చేసుకుంటారన్న భరోసా సరికాదు.

ఇక్కడే మరో విషయాన్ని ప్రస్తావించాలి. ఎవరు అవునన్నా.. కాదన్నా.. ఒక వ్యక్తి జీవితంలో ఐదేళ్లు అన్నది చాలా చాలా పెద్ద సమయం. దీన్ని సింఫుల్ గా తీసిపారేయటం కూడా తప్పు అవుతుంది. ఇలాంటి విషయాల్లో జగన్ స్పందించే వేళలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. లేదంటే.. అభాసుపాలు కావటం ఖాయం.

Tags:    

Similar News