మహిళా బిల్లు మీద జగన్ సంచలన కామెంట్స్

పురుషులతో సమానంగా మహిళలకు ప్రాతినిధ్యం ఇచ్చే విషాంలో తమ ప్రభుత్వం అన్ని విధాలుగా ముందు ఉందని జగన్ అంటున్నారు.

Update: 2023-09-20 04:07 GMT

మహిళా బిల్లుని బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ఈ బిల్లుకు ఇప్పటిదాకా దేశంలోని రాజకీయ పార్టీల నుంచి వ్యతిరేకత అయితే ఎక్కడా రాలేదు. అందరూ స్వాగతిస్తున్నారు. దాంతో ఇది ఉభయ సభలలో ఆమోదం పొంది చట్టంగా రావడం ఖాయమనే అంటున్నారు.

ఇదిలా ఉంటే వైసీపీ ఈ బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా బిల్లుకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ బిల్లుకు వైసీపీ తరఫున మద్దతు తెలపడానికి తాను గర్విస్తున్నట్లుగా ఆయన చెప్పడం జరిగింది.

అంతే కాదు వైసీపీ అజెండా కూడా అదే అని ఆయన అంటున్నారు. మహిళలకు ఎక్కువ అవకాశాలు తమ పార్టీ ఇప్పటిదాకా అందిస్తూ వచ్చింది అని గుర్తు చేశారు. మహిళా సాధికారికత తమ పార్టీ ముఖ్య లక్ష్యమని ఆయన వెల్లడించారు. తమ పార్టీ ప్రభుత్వం ఆ విషయాన్ని పూర్తిగా నమ్ముతాయని జగన్ పేర్కొన్నారు.

ఇక ఏపీలో గత నాలుగేళ్లలో తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని, అన్నిటా మహిళలకే అగ్ర తాంబూలం వేశామని ఆయన గుర్తు చేశారు. మహిళా లబ్దిదారులకే అవకాశాలు ఇచ్చామని, వారికే పెద్ద పీట వేశామని ఆయన వివరించారు. పురుషులతో సమానంగా మహిళలకు ప్రాతినిధ్యం ఇచ్చే విషాంలో తమ ప్రభుత్వం అన్ని విధాలుగా ముందు ఉందని జగన్ అంటున్నారు.

ఈ మహిళా బిల్లు ద్వారా అంతా కలసి అందరికీ సమానమైన భవిష్యత్తుని సృష్టిద్దామని జగన్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే జగన్ పూర్తి మద్దతు ప్రకటించడం తో లోక్ సభలో 22 మంది ఎంపీలు, రాజ్యసభలో తొమ్మిది మంది వైసీపీ ఎంపీల మద్దతు ఈ బిల్లుకు దక్కినట్లు అయింది. అదే విధంగా ఈ బిల్లుకు అవసరమైన రాజ్యాంగ సవరణ చేసే రాష్ట్రాలలో ఏపీ కూడా ఉంటుంది అని అంటున్నారు.

దేశంలోని సగం రాష్ట్రాలు అంటే 14 రాష్ట్రాలు బిల్లుకు మద్దతుగా అసెంబ్లీలో తీర్మానాలు చేసి కేంద్రనికి పంపాల్సి ఉంటుంది. అలా చూసుకుంటే బీజేపీ పది రాష్ట్రాలకు పైగా అధికారంలో ఉంది. ఇక ఏపీ నుంచి వైసీపీ తో పాటు తెలంగాణా నుంచి బీయారెస్ ఒడిషా నుంచి నవీన్ పట్నాయక్ వంటి వారు అసెంబ్లీ తీర్మానాలు చేస్తే చాలా సులువుగా ఈ బిల్లు ఆమోదం పొందుతుంది అని అంటున్నారు.

ఇక కాంగ్రెస్ ఎటూ మద్దతుగా నిలిచింది కాబట్టి ఆ పార్టీ సైతం తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి అసెంబ్లీ తీర్మానాలు చేయిస్తుంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఏ ముహూర్తాన బీజేపీ ఈ బిల్లు ప్రస్తావన తెచ్చిందో కానీ ఈసారి కచ్చితంగా చట్టం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News