ఐదేళ్ల తర్వాత తొలిసారి సామాన్యులతో కలిసి జగన్ ఫ్లైట్ జర్నీ

అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. చేతిలో ఉన్న అధికారం చేజారితే మరోలా వ్యవహరించే తీరు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

Update: 2024-07-19 04:28 GMT

అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. చేతిలో ఉన్న అధికారం చేజారితే మరోలా వ్యవహరించే తీరు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానాల్ని మాత్రమే వినియోగించే వారు. ఏ సందర్భంలోనూ సామాన్యులతో కలిసి విమాన ప్రయాణం చేసింది లేదు. వ్యక్తిగత పర్యటనల కోసం ప్రత్యేక విమానాన్ని వినియోగించేవారు.

చివరకు తన సతీమణి భారతిని హైదరాబాద్ నుంచి పికప్ చేసుకోవటానికి కూడా ప్రత్యేక విమానంలో వెళ్లినట్లుగా అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అధికారం చేజారి.. ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగిని తర్వాత తొలిసారి జగన్మోహన్ రెడ్డి సామాన్యులతో కలిసి ఇండిగో ఫ్లైట్ లో ప్రయాణించారు. వైఎస్ జగన్ వెంట ఆయన సతీమణి భారతి కూడా ఉన్నారు. దాదాపు ఐదేళ్ల తర్వాత తన భార్య భారతితో కలిసి బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు ఇండిగో ఫ్లైట్ లో ప్రయాణించారు.

ఆయన ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చిన సందర్భంలో వైసీపీ నేతలు అంబటి రాంబాబు.. ఎమ్మెల్సీలు తలశిల రఘురాం.. అరుణ్ కుమార్.. లక్ష్మణరావుతో సహా పలువురు నేతలు స్వాగతం పలికారు. రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్లారు. ఇదే సాదాసీదాతనాన్ని జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్న వేళలోనూ చేసి ఉంటే బాగుండేదన్న మాట వినిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారం చేజారినప్పుడు మరోలా కాకుండా.. ఎప్పుడూ ఒకేలా ఉంటే ఆ ఇమేజ్ వేరుగా ఉంటుందన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా గమనించాలన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News