పవర్ పోయినా తీరు మార్చుకోని జగన్.. మరోసారి అదే తప్పు!

అసెంబ్లీ కొలువు తీరేదే అప్పుడప్పుడు. ప్రత్యేక సందర్భాల్లో అసెంబ్లీకి హాజరు కాకుండా.. వేరే కార్యక్రమాలను షెడ్యూల్ చేసుకోవటం వల్ల జగన్ కు కలిగే ప్రయోజనం ఏమిటి? అన్నది ప్రశ్న.

Update: 2024-06-22 04:29 GMT

వెకిలి వ్యాఖ్యలు లేవు. రన్నింగ్ కామెంట్రీ అసలే లేదు. నమస్కారం పెడితే సభా నాయకుడు ప్రతి నమస్కారం పెట్టారు. అసెంబ్లీకి వచ్చే వేళలో.. వాహనాన్ని దిగి రావాల్సి ఉన్నప్పటికీ.. మాజీ ముఖ్యమంత్రి అన్న విషయాన్ని గుర్తించి.. గౌరవించి.. వైసీపీ నేతలు రిక్వెస్టు చేసినంతనే జగన్ కు ఇబ్బంది కలగకుండా చూసుకుంది చంద్రబాబు సర్కారు. అలాంటి వేళ.. జగన్ వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఈ రోజు అసెంబ్లీ సమావేశానికి వైసీపీ నేత జగన్ హాజరు కాకపోవటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.

సభాపతిగా అయ్యన్నపాత్రుడు బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో.. సభా సంప్రయాల ప్రకారం అధికార.. విపక్ష సభ్యుడు ఇద్దరు కలిసి కొత్తగా ఎన్నికైన స్పీకర్ ను.. ఆయన స్థానం వరకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ కీలక కార్యక్రమానికి విపక్ష నేత హోదా లేని వేళ.. తనను ఆహ్వానిస్తారా? లేదా? అన్న అంశాన్ని ప్రభుత్వం మీద పడేసి.. తాను సభకు వెళితే బాగుండేది. కానీ.. వైఎస్ జగన్ మాత్రం అసెంబ్లీకి వెళ్లకుండా.. శనివారం పులివెందులకు వెళ్లటం చర్చనీయాంశంగా మారింది.

అసెంబ్లీ కొలువు తీరేదే అప్పుడప్పుడు. ప్రత్యేక సందర్భాల్లో అసెంబ్లీకి హాజరు కాకుండా.. వేరే కార్యక్రమాలను షెడ్యూల్ చేసుకోవటం వల్ల జగన్ కు కలిగే ప్రయోజనం ఏమిటి? అన్నది ప్రశ్న. విపక్ష నేత హోదా లేనప్పటికీ తనమీద ప్రజలు పెట్టిన బాధ్యతను నెరవేరుస్తూ సభకు హాజరు కావాల్సిన అవసరం ఉంది. కానీ.. అదేమీ చేయకుండా ముఖం చాటేశారన్న నింద వేయించుకునేలా జగన్ తాజా నిర్ణయం ఉండటాన్ని వైసీపీ వర్గం జీర్ణించుకోలేకపోతోంది.

ఇటీవల అయ్యన్నపాత్రుడు వేరే వారితో మాట్లాడుతూ.. జగన్ మీద చేసిన వ్యాఖ్యలను సాకుగా చూపించి.. స్పీకర్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న వేళ.. తమ నాయకుడు వెళ్లటం లేదని వైసీపీ నేతలు చెప్పుకోవటం కన్వీన్స్ అయ్యేలా లేదంటున్నారు. ఎక్కడో తన సన్నిహితుల వద్ద మాట్లాడిన మాటల వీడియో ఒకటి బయటకు వచ్చిన దానికే అంతలా రియాక్టు అయితే.. నేరుగా ముఖం మీదనే.. చంద్రబాబును.. ఆయన సతీమణి మీద చేసిన దారుణ వ్యాఖ్యల మాటేమిటి? అన్నది ప్రశ్నగా మారింది.

ఏదో ఒక సాకు చూపించి అసెంబ్లీకి రాకుండా ఉండేలా జగన్ ప్రయత్నించటం ఆయనకు నష్టం వాటిల్లేలా చేస్తుందని చెబుతున్నారు. నిజానికి విజయం సాధించిన వేళ ప్రదర్శించే స్థైర్యం కంటే.. ఓటమి వేళ ప్రదర్శించే ధీరత్వమే గొప్పది. అసలుసిసలు పోరాట యోధుడు ఎప్పుడూ వెన్నుచూపుడు. పోరాడతాడు. తిరిగి తాను అనుకున్నది సాధిస్తాడు. అప్పటివరకు విశ్రమించడు. అందుకు ప్రతి ప్రతికూలతను ఎదుర్కొంటాడు. మరి.. జగన్ ఏం చేస్తున్నట్లు? అన్నది ప్రశ్న.

Tags:    

Similar News