జ‌గ‌న్ ప్ర‌భుత్వం మ‌రో మైలు రాయి.. తెలంగాణ‌ను వెన‌క్కునెట్టి మ‌రీ!

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం ఏమీ చేయ‌డం లేద‌ని, ఏమీ సాధించ‌డం లేద‌ని, రికార్డుల్లో వెనుక‌బ‌డి పోయింద‌ని విమ‌ర్శిస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం తాజాగా షాకిచ్చింది.

Update: 2023-12-11 04:16 GMT

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం ఏమీ చేయ‌డం లేద‌ని, ఏమీ సాధించ‌డం లేద‌ని, రికార్డుల్లో వెనుక‌బ‌డి పోయింద‌ని విమ‌ర్శిస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం తాజాగా షాకిచ్చింది. రాష్ట్రంలో ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం(2023-24)లో ఏప్రిల్ నుంచి సెప్టెంబ‌రు వ‌ర‌కు అంటే.. రెండు త్రైమాసికాల్లో భారీ ఎత్తున ఎగుమ‌తులు జ‌రిగిన‌ట్టు తేల్చి చెప్పింది. ఈ ఎగుమ‌తుల్లో రాష్ట్ర ఉత్ప‌త్తులు ఉన్నాయ‌ని తెలిపింది. పారిశ్రామిక‌, మౌలిక‌, చేతివృత్తులు, వ్య‌వ‌సాయ‌ రంగాల‌కు చెందిన అనేక ఉత్ప‌త్తుల‌ను ఏపీ ఎగుమ‌తి చేసిన‌ట్టు కేంద్రం పేర్కొంది.

సాధార‌ణంగా ఏ సంవ‌త్స‌రంలోఅయినా.. రాష్ట్రాలు సాధించిన ఎగుమ‌తుల రికార్డుల‌ను ఆయా ఉత్ప‌త్తుల ఆధారంగా కాకుండా.. ఎంత మేర‌కు సొమ్ము వ‌చ్చింద‌నే విధానంపై ఆధార‌ప‌డి కేంద్రం నిర్ణ‌యానికి వ‌స్తుంది. ఈ క్ర‌మంలోనే తాజాగా వెలువ‌రించిన ఇండియ‌న్ టెక్‌-ఇన్‌ఫ్రా నివేదిక‌లో ఏపీ ఎగుమ‌తుల రంగంలో దేశంలోనే 5వ స్థానంలో ఉన్న‌ట్టు తెలిపింది. ఈ ఆరు మాసాల కాలంలో మొత్తం 85 వేల 21 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మేర‌కు ఉత్ప‌త్తుల‌ను ఏపీ ఎగుమ‌తి చేసిన‌ట్టు వివ‌రించింది. ఈ విష‌యంలో తెలంగాణ రాష్ట్రం చాలా వెనుక‌బ‌డిపోయిన‌ట్టు తెలిపింది.

ఇక‌, ఎగుమ‌తుల రంగంలో గుజ‌రాత్ తొలి స్థానంలో ఉంది. ఈ రాష్ట్రం ఏకంగా 5ల‌క్ష‌ల‌, 52 వేల కోట్ల రూపాయ‌ల ఉత్ప‌త్తుల‌ను ఎగుమ‌తి చేసింది. ఇక‌, రెండో స్థానంలో మ‌హారాష్ట్ర 2ల‌క్ష‌ల 72 వేల కోట్ల రూపాయ‌ల‌తో ఉండ‌గా, మూడో స్థానంలో త‌మిళ‌నాడు రూ.ల‌క్షా 71 వేల కోట్ల విలువ చేసే వ‌స్తువుల‌ను ఎగుమ‌తి చేసిన‌ట్టు నివేదిక వివ‌రించింది. నాలుగో స్థానంలో క‌ర్ణాట‌క ఉన్న‌ట్టు తెలిపింది. ఈ రాష్ట్రం నుంచి ల‌క్షా 4 వేల కోట్ల రూపాయ‌ల ఎగుమ‌తులు జ‌రిగిన‌ట్టు తెలిపింది.

ఇక‌, ఈ జాబితాలో 8వ స్థానంలో ఉన్న తెలంగాణ నుంచి కేవ‌లం 49 వేల 120 కోట్ల రూపాయ‌ల విలువైన వ‌స్తువులు మాత్ర‌మే ఎగుమ‌తి అయిన‌ట్టు నివేదిక వివ‌రించ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి ఏపీలో ఏమీ జ‌ర‌గ‌డం లేదు.. అభివృద్ధి లేదు.. అని విమ‌ర్శ‌లు గుప్పించే వారు ఇప్పుడు ఏమంటారో చూడాలి.

Tags:    

Similar News