అసైన్డ్ భూములపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం!
ప్రభుత్వం నుంచి ఎసైన్డ్ భూముల్ని పొంది 20 ఏళ్లు దాటితే వాటిని అమ్ముకునే అవకాశాన్ని కల్పిస్తూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది
ప్రభుత్వం నుంచి ఎసైన్డ్ భూముల్ని పొంది 20 ఏళ్లు దాటితే.. వాటిని అమ్ముకునే అవకాశాన్ని కల్పిస్తూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. గత మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన మేరకు.. పాత చట్టాన్ని సవరిస్తూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పేరుతో ఈ ఆర్డినెన్స్ విడుదలైంది.
అవును... అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల 15 లక్షల మందికిపైగా రైతులకు ప్రయోజనం చేకూరడంతోపాటు రాష్ట్రంలో అసైన్డ్ భూముల వివాదాలకు తెరపడనుందని అంటున్నారు.
రాష్ట్రంలో దశాబ్దాలుగా ప్రభుత్వాలు నిరుపేదలకు వేల ఎకరాల భూముల్ని కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే... వాటిని పొందినవారు కానీ, వారి వారసులు కానీ ఆ భూములను అనుభవించడానికి మాత్రమే హక్కు ఉండేది కానీ.. అమ్ముకోడానికి హక్కులు లేవు.
అయితే ప్రభుత్వ తాజా నిర్ణయం మేరకు.. ఎసైన్డ్ భూములను పొంది 20 ఏళ్లు దాటితే వారికి ఆ భూములపై పూర్తి హక్కులు లభిస్తాయి. అమ్ముకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఎసైన్ చేసిన భూమి పక్కన వ్యవసాయేతర భూములు ఉండి, వాటి ధరలు ఎక్కువగా ఉంటే.. మార్కెట్ విలువకు అనుగుణంగా ఆ వ్యత్యాసాన్ని కొనుగోలుదారు చెల్లించాలని ప్రభుత్వం ఆర్డినెన్స్ లో పేర్కొంది.
కాగా... 1954కు ముందు భూములు ఇచ్చిన వారికి పట్టాల్లో ఎక్కడా వాటిని అమ్మకూడదనే షరతు లేదు. 1954 తర్వాత ఇచ్చిన అసైన్డ్ చట్టాల్లో మాత్రం భూములు అమ్మకూడదనే నిబంధన ఉంది. దీనివల్ల వాటి క్రయవిక్రయాలకు అవకాశం లేకుండా పోయింది. అయితే.... వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1954కు ముందు అసైన్డ్ అయిన భూములను నిషేధిత జాబితా నుంచి తీసివేసింది!
ఈ భూములపై అనేక విజ్ఞప్తులు అందడంతో వీటిపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో 13 మంది ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలతో 2022 ఆగస్టు 30న సీఎం జగన్ ప్రజాప్రతినిధుల కమిటీ ఏర్పాటు చేశారు. తాజాగా ఆ కమిటీ చేసిన సూచనల మేర... ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది!