ఏపీలో రాష్ట్రపతి పాలన...జగన్ సంచలన డిమాండ్

పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించిన తరువాత జగన్ అక్కడే ప్రెస్ మీట్ పెట్టారు.

Update: 2024-07-19 14:39 GMT

ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ సంచలన డిమాండ్ చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలన్నర రోజులే అయింది. అయితే రాష్ట్రమంతా రావణ కాష్టంగా చేశారు అని అంటూ జగన్ తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించిన తరువాత జగన్ అక్కడే ప్రెస్ మీట్ పెట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదని అన్నారు. టీడీపీ నేతలకు అధికారం ఇచ్చింది ఎందుకు అంటే వైసీపీ నేతలను ఏమైనా చేయడానికే అన్న నీచ సంస్కృతికి తెర తీశారు అన్నారు. గత 45 రోజులలొ 36 హత్యలు తమ పార్టీ వారి మీద జరిగాయని అన్నారు. అలాగే 300 మంది మీద హత్యా యత్నం జరిగిందని అన్నారు.

వేయి మంది మీద దాడులు జరిగితే 560 ప్రైవేట్ ఆస్తులను మరో వేయికి పైగా ప్రభుత్వ ఆస్తులను ద్వంసం చేశారు అని అన్నారు. ఇదేమని అడిగితే వైసీపీ వారి మీదనే దొంగ కేసులు పెడుతున్నారని జగన్ మండిపడ్డారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ లేనందున రాష్ట్రపతి పాలన పెట్టమని కేంద్రాన్ని కోరుతామని జగన్ స్పష్టం చేసారు.

ఈ నెల 24న ఢిల్లీలో వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కలసి నిరసన కార్యక్రమం చేపడతారు అని ఆయన చెప్పారు. ఏపీలో జరుగుతున్న దాడులతో పాటు శాంతిభద్రతల లోపం గురించి దేశమంతా తెలిసేలా ఈ నిరసన కార్యక్రమం ఉంటుదని జగన్ అన్నారు. దాని కంటే ముందు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే సమయంలోనే అడ్డుతగులుతామని జగన్ చెప్పరు. . రాష్ట్రంలో శాంతి భద్రతలపై గవర్నర్‌ ని కలుస్తామని అన్నారు.

రాష్ట్రంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వేటినీ అమలు చేయలేదని ఆయన విమర్శించారు. అయితే వీటన్నింటి నుంచి దృష్టి మరల్చేందుకు ప్రజల్లో భయాందోళనలు సృష్టించే కార్యక్రమాలకు తెరలేపారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు ఇలా దాడులు చేస్తూ, అన్యాయాలు చేస్తూ దిగజారిన రాజకీయాలు చేస్తున్నారని దానిని తాము సమర్ధంగా అడ్డుకుంటామని జగన్ అన్నారు.

రైతన్నకు భరోసా పధకం ఏదీ అని ఆయన ప్రశ్నించారు. అలాగే తల్లికి వందనం అని ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఆ ఊసే మరచారు అని అన్నారు. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాలు ఏమి చేశారని ప్రశ్నించారు.

ముందు పధకాల సంగతి చూడాలని ఆయన బాబుకు సూచించారు. అయితే హామీలను మరచి వైసీపీ వారి మీద దాడులు చేస్తూ పోతే తాము ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో పాటు రాష్ట్రపతిని కూడా కలసి ఏపీలో జరుగుతున్న రాజకీయ దాడుల గురించి ప్రస్తావిస్తామని ఏపీలో దెబ్బ తిన్న లా అండ్ ఆర్డర్ ని పునరుద్ధరించేలా రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరుతామని జగన్ అన్నారు.

Tags:    

Similar News