అక్టోబర్ 24 నుంచి జగన్ విశాఖలోనే !
అక్టోబర్ 24న విజయదశమి రోజున మంచి ముహూర్తాన జగన్ నూతన గృహంలో గృహ ప్రవేశం చేస్తారని
జగన్ విశాఖ వాసి అయిపోతున్నారు. ఆయన మరో ఎనభై రోజుల వ్యవధిలో అంటే అక్టోబర్ 24 నుంచి విశాఖలో మకాం పెడుతున్నారు. ఇందుకోసం అద్భుతమైన భవనం తయారు అవుతోంది. రుషికొండ వద్ద ఆ భవన నిర్మాణం పనులు చురుకుగా సాగుతున్నాయి.
ఇదిలా ఉంటే సీ ఎం ఓ ఆఫీసు నుంచి అధికారులు శనివారం వచ్చి సీఎం నివాసం ఉంటే భవనం నిర్మాణం పనులను పరిశీలించారు. అదే విధంగా భద్రతా సిబ్బంది కూడా వచ్చి భద్రతకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకున్నారు. రుషికొండ పరిసరాలలో భద్రతాపరంగా ఎలాంటి కట్టుదిట్టం చేయవచ్చు అన్నది కూడా చర్చించారు.
ఇక తాజాగా సీఎం నూతన నివాసం వస్తే అవుట్ పోస్ట్ ఒకటి పోలీసులతో ఏర్పాటు చేశారు. అక్టోబర్ 24న విజయదశమి రోజున మంచి ముహూర్తాన జగన్ నూతన గృహంలో గృహ ప్రవేశం చేస్తారని నాటి నుంచి ఆయన విశాఖలో పూర్తిగా నివాసం ఉంటారని అంటున్నారు.
ఇప్పటికి నాలుగు నెలల క్రితం శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా జగన్ తాను సెప్టెంబర్ లో విశాఖకు షిఫ్ట్ అవుతాను అని తొలిసారి ప్రకటించారు. రీసెంట్ గా విశాఖకు చెందిన యువ మంత్రి గుడివాడ అమరనాధ్ కూడా ఈ దసరాకు విశాఖ ప్రజలు మంచి వార్త వింటారు అంటూ ఊరించారు.
ఇపుడు శరవేగంగా జరుగుతున్న సీఎం నివాసం పనులను చూస్తూంటే ముఖ్యమంత్రి జగన్ విశాఖ ముచ్చటకు రంగం సిద్ధం అయిపోయింది అని అంటున్నారు. విశాఖ రుషికొండ ప్రాంతంలో పెద్ద ఎత్తున సాగుతున్న నిర్మాణం పనులు ఎప్పటిలోగా పూర్తి అవుతాయని సీఎం ఓ అధికారులు వచ్చి ఆరా తీశారని అంటున్నారు.
ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి నివాసం తో పాటు క్యాంప్ ఆఫీసు కూడా ఇదే భవనంలో ఉంటుంది అని అంటున్నారు. ప్రతీ రోజూ జగన్ వివిధ శాఖలకు సంబంధించి సమీక్ష చేస్తారు. దాంతో ఆయా శాఖలకు చెందిన మంత్రులు, అధికారులు కూడా క్యాంప్ ఆఫీసుకు కచ్చితంగా రావాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి విశాఖలో మకాం పెడితే మంత్రులు కూడా దగ్గరలోనే బస చేసేందుకు ప్రభుత్వ ఖాళీ భవనాలను కూడా చూస్తున్నారు అని అంటున్నారు.
అలాగే అధికారులు ఉండేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. మొత్త్తం మీద ఇవన్నీ చూస్తూంటే పేరు పెట్టలేదు కానీ దాదాపుగా రాజధాని విశాఖకు తరలివచ్చినట్లే అని అంటున్నారు. జగన్ కనుక విశాఖ నుంచి పాలన ప్రారంభిస్తే రేపటి రోజున ఈ ప్రాంత వాసులలో కూడా రాజధాని కోరిక బలంగా నాటుకుపోతుందని అంటున్నారు. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చినా అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించడం కష్టం అని అంటున్నారు. మూడు రాజధానుల విషయాన్ని ఆచరణలో న్యాయ వివాదాలకు తావు లేకుండా ముందుకు తీసుకుని వెళ్ళే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేస్తోంది అని అంటున్నారు. అందులో భాగమే ముఖ్యమంత్రి విశాఖ మకాం అంటున్నారు.
ఇక కర్నూల్ కి హైకోర్టు తరలింపు అంశం కూడా హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వం కలసి చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలని కేంద్రం అంటోంది. కొత్తగా చీఫ్ జస్టిస్ గా నియమితులైన వారితో ప్రభుత్వం ఈ మేరకు చర్చించే అవకాశాలు లేకపోలేదు అని అంటున్నారు. అమరావతిలో హైకోర్టు ఉన్నది కూడా టెంపరరీ భవనంలో కాబట్టి కర్నూల్ కి హైకోర్టు షిఫ్టింగ్ అన్నది హైకోర్టు ప్రభుత్వం కలసి ఒక అంగీకారానికి వస్తే సులువుగానే సమస్య పరిష్కారం అవుతుందని అంటున్నారు.