కమలానికి జగన్ మరీ దూరం !?
గత పదేళ్ళుగా తెర చాటుగా బీజేపీతో సాగిస్తున్న నేస్తానికి చెక్ పెట్టేసేలా జగన్ నిర్ణయాలు ఉండబోతున్నాయని అంటున్నారు.
కలువకు చంద్రుడు ఎంతో దూరం అని ఒక పాట ఉంది. దాన్ని ఏపీ రాజకీయాలకు అనువుగా మార్చి పాడుకుంటే కమలానికి జగన్ మరీ దూరం అని అంటున్నారు. గత పదేళ్ళుగా తెర చాటుగా బీజేపీతో సాగిస్తున్న నేస్తానికి చెక్ పెట్టేసేలా జగన్ నిర్ణయాలు ఉండబోతున్నాయని అంటున్నారు.
లోక్ సభలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకించిన తీరు ఇందులో భాగమే అని అంటున్నారు. అలాగే రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ పోలవరానికి బడ్జెట్ లో నిధులే ఇవ్వలేదు ఎలా పూర్తి చేస్తారు అని నిలదీశారు. ప్రత్యేక హోదా సహా విభజన హామీలను వైసీపీ ఎంపీలు తరచూ ప్రస్తావిస్తున్నారు.
ఇవన్నీ చూస్తూంటే జగన్ బీజేపీకి దూరం అవడానికి సిద్ధపడుతున్నారని సంకేతాలు పంపుతున్నారు. నిజానికి బీజేపీతో సఖ్యత నెరపినా ఏపీలో ఇపుడున్న రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో వైసీపీకి ఒనకూడే ప్రయోజనాలు ఏమీ లేవు అని అంటున్నారు.
పైగా ఏపీలో కాంగ్రెస్ పొంచి ఉంది. సొంత చెల్లెలు పీసీసీ చీఫ్ గా ఉన్నారు. బీజేపీతో వైసీపీ అంటకాగుతొంది అని ఆమె పదే పదే ఆరోపిస్తున్నారు ఇప్పటికే జరగాల్సిన నష్టం అంతా సార్వత్రిక ఎన్నికల్లో జరిగిపోయింది. ఈసారి కూడా అలాగే ఉంటే వైసీపీ ఉనికికే ముప్పు రావచ్చు అన్నది మరో ఆలోచన.
దీంతో పాటుగా రాజ్యసభలో వైసీపీకి చెందిన నలుగురైదుగురు వైసీపీ ఎంపీలను లాగేసుకోవడానికి బీజేపీ పెద్దలు స్కెచ్ గీస్తున్నారు అన్న అనుమానాలు వైసీపీ అధినాయకత్వంలో ఉన్నాయట. పదకొండు మందిలో సగానికి సగం మందిని లాగేసి విలీనం అని ముద్ర వేసి ఫిరాయింపుల బెడద లేకుండా చేసుకుంటారని అంటున్నారు. ఎటూ అధికారం చేతిలో ఉంది కాబట్టి ఏమైనా చేసినా ఎన్డీయేకు అయితే ఇబ్బంది లేదు.
ఈ విధంగా తన రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ పెద్దలు తెగబడుతూంటే ఇంకా ఎందుకు మడి గట్టుకుని ఈ గట్టున కూర్చోవడం అన్నదే వైసీపీకి కలుగుతున్న ఆలోచనలు అని అంటున్నారు. నిజానికి ఏపీలో టీడీపీతో పొత్తుని బీజేపీ పెట్టుకోవడం జగన్ కి ఇష్టం లేదు అని అంటున్నారు. కేంద్ర సాయంతో ఈవీఎంల వల్లనే టీడీపీ ఏపీలో గెలిచింది అన్నది కూడా వైసీపీ మరో అనుమానం.
ఇలా తనను రాజకీయంగా బదనాం చేసిన బీజేపీతో కటీఫ్ కే వైసీపీ మొగ్గు చూపిస్తోంది అని అంటున్నారు. అదే టైం లో ఇండియా కూటమి వైపుగా జగన్ అడుగులు పడుతున్నాయని అంటున్నారు. ఇటీవల లోక్ సభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఒకరు ఏపీకి కేంద్రం దగా చేసిందని అమరావతి రాజధానికి నిధులు ఇవ్వకుండా అప్పు ఇచ్చిందని ఘాటు విమర్శ చేసి సంచలనం రేపారు. అది వైసీపీని తమ వైపునకు తిప్పుకునేందుకే అని అంటున్నారు.
వైసీపీ కూడా ఈ పార్టీలతో మంచి రిలేషన్స్ మెయిన్ టెయిన్ చేస్తోంది. మొత్తానికి ఇవన్నీ చూస్తున్నపుడు వైఎస్ జగన్ సరికొత్త నిర్ణయాల వైపుగా వెళ్తున్నారు అని అంటున్నారు. రానున్న రోజులలో జగన్ ఏపీకి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నారు. ఏది ఏమైనా కమలానికి కటీఫ్ చెబుతూ వదిలించుకోవాలన్నదే వైసీపీ అధినాయకత్వం దృఢంగా భావిస్తోంది అని అంటున్నారు.