నితీష్ కి జగన్ థాంక్స్... రూట్ మ్యాప్ రెడీ ?
ఆయన గత అయిదేళ్ళలో ఎన్ని కూటములు మార్చారో బీహార్ ప్రజలకూ తెలుసు.
రాజకీయాల్లో చాన్సులు ఇవ్వరు తీసుకోవాలి. ఇది నిజమే. అలాగే రాజకీయాల్లో చాన్సులు ఇస్తూంటారు. వాటిని అంది పుచ్చుకోవాలి ఇది కూడా నిజమే. తనదైన ఏక దృక్కోణం ఆలోచనలతో అధికారాన్ని చంద్రబాబుకు అప్పనంగా అప్పచెప్పి ఘోర ఓటమిని కొని తెచ్చుకున్న జగన్ కి ఇపుడు ఎన్డీయే పార్టనరే మిత్రుడుగా మారిపోయారు.
ఆయన ఎవరో కాదు బీహార్ సీఎం నితీష్ కుమార్. ఆయన రాజకీయంగా చంచల స్వభావం కలిగిన వారు అని అంటారు. ఆయన గత అయిదేళ్ళలో ఎన్ని కూటములు మార్చారో బీహార్ ప్రజలకూ తెలుసు. దేశానికీ తెలుసు. అటువంటి నితీష్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు అంటే ఆ ప్రభుత్వం ఆయుష్షు మీద అంతా డౌట్ పడుతున్నారు.
దానికి తగినట్లుగానే నెల రోజులు కూడా పూర్తి కాని ఎన్డీయే ప్రభుత్వం మీద నితీష్ కుమార్ బాణాలు వేశారు. ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే అని ఆయన అల్టిమేటం జారీ చేశారు. కేంద్రంలోని బీజేపీ రాజకీయ అవసరాలను ఉపయోగించుకుని బీహార్ రాష్ట్రంలో తాము అభివృద్ధి చెందాలని జేడీయూ వేసిన ప్లాన్ ఇది.
సరిగ్గా ఇలాంటి ప్లాన్ నే 2019లో జగన్ వేశారు. కానీ ఆనాడు ఆయనకు 22 మంది ఎంపీలు ఉన్నా కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి ఫుల్ మెజారిటీ వచ్చింది. దాంతో అది కుదరదు అనేశారు. ఇపుడు చూస్తే బీజేపీ జగన్ కోరుకున్నట్లుగానే ఇతరుల మద్దతు మీద ఆధారపడి ఉంది.
దాంతో జేడీయూ అధినేత నితీష్ కుమార్ డిమాండ్ చేసినట్లుగా ఏపీలో చంద్రబాబు కూడా డిమాండ్ చేయాలన్నది జగన్ ఆలోచనగా ఉందిట. ఈ రకమైన డిమాండ్ పెట్టి బాబు మీద ఒత్తిడి పెట్టి తనకు బ్రహ్మాండమైన చాన్స్ ఇచ్చారని నితీష్ కి జగన్ థాంక్స్ చెప్పుకుంటున్నారుట.
జనాల్లోకి వెళ్లాలీ అంటే బలమైన ఇష్యూ ఉండాలి. అది జనాలకు కనెక్ట్ అయ్యే ఎమోషనల్ ఇష్యూగా కూడా ఉండాలి. ఇపుడు ప్రత్యేక హోదా అలాంటి ఇష్యూగానే ఉంది. దాంతో జగన్ దీని మీద సీరియస్ గా ఫోకస్ చేస్తున్నారు అని అంటున్నారు. బీహార్ రాష్ట్రం ప్రత్యేక హోదా కోరినపుడు ఏపీలో ఎందుకు అలా చేయకూడదు అని జగన్ అంటున్నారు.
కేంద్రం మీద నితీష్ కుమార్ తరహాలోనే బాబు కూడా ఒత్తిడి పెంచి ప్రత్యేక హోదా తీసుకుని రావాలని ఆయన కోరుతున్నారు. హోదా వస్తేనే ఏపీకి పరిశ్రమలు వస్తాయని అలాగే అందరికీ ఉపాధి కూడా లభిస్తుందని అంటున్నారు. ఇది జనాలు కూడా విశ్వసుబ్చేదుగా ఉంటోంది.
ఇదే ఇష్యూని బేస్ చేసుకుని జనంలోకి వెళ్ళేందుకు జగన్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు అని అంటున్నారు. దానికి సంబంధించిన రూట్ మ్యాప్ తయారు చేయమని ఆయన పార్టీ నేతలను ఆదేశించినట్లుగా ప్రచారం సాగుతోంది.
ఇక చంద్రబాబు చూస్తే ప్రత్యేక హోదా విషయం మీద పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఆయన ఏపీకి నిధులు తెచ్చుకోవడం అలాగే పోలవరం అమరావతి పరిపూర్తిని ప్రయారిటీలుగా పెట్టుకున్నారు. ఇపుడు జగన్ కనుక ప్రత్యేక హోదా నినాదంతో జనంలోకి వెళ్తే బాబుకు అది రాజకీయ సంకటంగా ఉంటుంది అని అంటున్నారు.
పైగా నరేంద్ర మోడీ హోదా అన్నది ఇవ్వరని అంటున్నారు. ప్యాకేజి ఇస్తామని చెప్పినా అది ఒక బ్రహ్మ పదార్ధంగానే ఉంటుంది. దాంతో జగన్ కి ఈ ఇష్యూ రాజకీయంగా ఎవర్ గ్రీన్ గానే ఉంటుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. మొత్తానికి ఓటమితో దిగులు చెందిన జగన్ కి నితీష్ కుమార్ ప్రత్యేక హోదా అంటూ ఒక భారీ అస్త్రమే ఇచ్చారని అంటున్నారు ఇక మంచి రోజు చూసుకుని జగన్ రంగంలోకి దిగడమే తరువాయి అని అంటున్నారు. చూడాలి మరి జగన్ ఏ విధంగా జనంలోకి వస్తారో.