రైతు రుణ మాఫీతో జగన్ మాస్టర్ స్ట్రోక్...!?
రైతుల మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి అధికారం అందుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి.
రైతులు దేశానికి వెన్నెముక అంటారు. అంతే కాదు, వారే ఎన్నికల్లో కూడా రాజకీయ పార్టీలకు వెన్నెముకగా ఉంటారు. రైతాంగం ప్రసన్నం అయితే పీఠం దగ్గరకు వస్తుంది. వారు ఆగ్రహిస్తే మాత్రం అపోజిషన్ లోకి వెళ్లిపోతారు. దేశమంతా ఇదే కధ నడుస్తోంది.
మొన్న కర్నాటక అయినా నిన్న తెలంగాణా అయినా రైతుల కోసం వరాలు ఇస్తూ పోయారు. అధికారం పట్టారు. ఇపుడు ఏపీ వంతు. రైతుల మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి అధికారం అందుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి.
ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతు రుణాలా మాఫీ అన్న బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీయనున్నారు అని అంటున్నారు. నిజానికి ఇది చాలా కాస్ట్లీ హామీగా ఉంటుంది. రైతులు ప్రతీ ఏటా కనీసం రెండు పంటలు పండిస్తారు. కానీ ప్రకృతి వైపరిత్యాల వల్ల కానీ గిట్టుబాటు ధర దక్కకపోవడం వల్ల కానీ వారికి నష్టాలే మిగులుతున్నాయి.
తీసుకున్న రుణాలను వారు కట్టలేని పరిస్థితి ఎదురవుతోంది. కొత్తగా సాగు చేయడానికి పెట్టుబడి పుట్టే సీన్ లేకుండా పోతోంది. వడ్డీల మీద వడ్డీలు చక్రవడ్డీలు ఇలా చాలానే పెరిగి రైతులకు ఉరి బిగుస్తోంది. దాంతో రుణ మాఫీ అన్నది అన్న దాతకు ప్రాణ దానం గానే ఉంటోంది.
రాజకీయ పార్టీలు ఇంత పెద్ద హామీని ఇవ్వడానికి సంకోచిస్తాయి ఇచ్చినా పూర్తి స్థాయిలో అమలు చేయలేవు. ఇప్పటికి పదేళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీగా రుణ మాఫీని ముందుకు తెచ్చింది. ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చింది. అయితే తీరా చూస్తే ఆనాటికి రైతు రుణ మాఫీ మొత్తాలు లక్ష కోట్ల రూపాయలుగా ఉంది. దాంతో అనేక కండిషన్లు షరతులు పెట్టి విడతల వారీగా తీరుస్తామని నాడు టీడీపీ చెప్పినా దిగిపోయేనాటికి మొత్తం ఇచ్చింది పాతిక వేల కోట్ల రూపాయలు మాత్రమే అని అంటున్నారు.
ఇపుడు చూస్తే ఆ లక్ష కోట్లు కాస్తా రెండు లక్షల కోట్లకు దాటినా ఆశ్చర్యంలేదు. అయితే ఇంత భారీ హామీ భుజానికి ఎత్తుకున్న పార్టీకి విశ్వసనీయత ఉండాలి. ఇచ్చిన హామీని నాయకుడు నెరవేరుస్తారు అన్న నమ్మకం ఉండాలి. జగన్ అలా అయిదేళ్ల పాలనలో ప్రతీ ఒక్క హామీని చేసి చూపించారు కాబట్టి కచ్చితంగా అమలు చేయగలరు అని రైతులు నమ్ముతారు అని అంటున్నారు.
అందుకే డేరింగ్ అండ్ డేషింగ్ గా జగన్ రైతు రుణ మాఫీ హామీని ఇవ్వబోతున్నారుట. అలా విపక్ష టీడీపీకి మాస్టర్ స్ట్రోక్ ఇవ్వాలని చూస్తున్నారు అంటున్నారు. అలాగే మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణం హామీని కూడా జగన్ ఇవ్వబోతున్నారుట. అసలు హామీ కాదు దీన్ని వీలైనంతవరకూ అమలు చేయాలని చూస్తున్నారుట.
సంక్రాంతి పండుగ వేళ ఈ రెండు హామీలతో పాటు మరిన్ని కొత్త హామీలను జగన్ ఇవ్వబోతున్నారు అని అంటున్నారు. ఇప్పటికే అభ్యర్ధుల ఎంపికలో బిజీగా ఉన్న జగన్ ఇపుడు ఎన్నికల ప్రణాళికకు పదును పెట్టబోతున్నారు అని అంటున్నారు. ఇవన్నీ జనంలోకి వెళ్తే భారీ ఇంపాక్ట్ ఉంటుందని మరోసారి తనకు అధికారాన్ని తెచ్చి పెడుతుందని కూడా భావిస్తున్నారుట. చూడాలి మరి ఏమి జరుగుతుందో.