తన వయసు గురించి జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ పూర్తిగా అన్ని విషయాల మీద అవగాహనతో ఉన్నారనే అంటున్నారు

Update: 2024-06-13 11:07 GMT

మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ పూర్తిగా అన్ని విషయాల మీద అవగాహనతో ఉన్నారనే అంటున్నారు. భారీ ఓటమి షాక్ నుంచి ఆయన తొందరగానే తేరుకున్నారు. ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రం విషాద వదనంతో కనిపించిన జగన్ ఆ మీదట రెండు రోజులలోనే తేరుకున్నారు.

పార్టీ నేతలతో ఆయన మాట్లాడుతూ ఉన్న ఫోటోలలో నవ్వుతూ కనిపించారు. ఇక జగన్ పార్టీ నాయకులకు ధైర్యం చెబుతున్నారు. 2029 మనదే అని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కళ్ళు మూసుకుంటే అయిదేళ్ళ కాలం ఇట్టే గడచిపోతుంది అని ఆయన అంటున్నారు.

అధికార పార్టీ చేయగలిగేది ఏమీ లేదని కాకపోతే కొన్ని కేసులు మాత్రం పెడతారని ఆయన నేతలకు చెబుతున్నారు. ఓడినా గెలిచినా క్యారెక్టర్ ముఖ్యమని ఆయన అంటున్నారు. ప్రజలకు చేసిన మంచి అలాగే ఉందని, తమ ట్రాక్ రికార్డుని మంచి పాలన అందించిన దానిని ఎవరూ తీసి పెట్టలేరని అన్నారు.

ఓడినా జనంలో ఉంటూ పోరాడితేనే ఫలితం వస్తుందని అన్నారు. వైసీపీకి విపక్ష పాత్ర కొత్తది కాదని పదేళ్ళ పాటు గతంలో చూసి వచ్చామని ఆయన గుర్తు చేస్తున్నారు. ఇక నేతలకు ఆయన ధైర్యం నూరిపోస్తున్నారు. తన గురించి కూడా చెబుతున్నారు.

తాను ఏకధాటిగా పద్నాలుగు నెలల పాటు మూడు వేల అయిదు వందల కిలోమీటర్ల దూరం పాదయాత్ర సుదీర్ఘంగా చేశాను అని గుర్తు చేశారు. తనకు అదే వయసు ఇపుడూ ఉందని తన సత్తా అలాగే ఉందని ఆయన పార్టీ నేతలకు చెబుతున్నారు.

దీనిని బట్టి వచ్చే ఎన్నికల ముందు మరోసారి పాదయాత్రకు ఆయన రెడీ అన్నట్లుగానే చెబుతున్నారు. జనంలోనే ఉందాం, జనం మాటే విందాం, ప్రజల సహకారంతోనే పోరాటాలు చేద్దాం, టీడీపీ చేసిన తప్పులను ఎండగడదామని అన్నారు.

దీనిని బట్టి చూస్తే జగన్ 52 ఏళ్ళ వయసులోనూ తాను తగ్గేది లేదు అని అంటున్నారు. మరో అయిదేళ్ళ ప్రతిపక్ష పోరాటం అంటే 2029 ఎన్నికల నాటికి జగన్ కి 57 ఏళ్ళు వస్తాయి. అయినా తన ఫిట్ నెస్ గుగించి ఆయన చెబుతున్నారు. తాను దూకుడుగానే రాజకీయాలు చేస్తాను అని పార్టీ నేతలకు భరోసా ఇస్తున్నారు.

పడి లేచిన చరిత్ర వైసీపీది మళ్లీ అదే విధంగా కొత్త చరిత్ర రాద్దామని ఆయన అంటున్నారు. ఇదిలా ఉంటే జగన్ కీలక వ్యాఖ్యలే చేశారు. బహుశా ఆయన మరో పోరాటానికి ఎంచుకునే అంశాలలో ప్రత్యేక హోదా కూడా ముఖ్యంగా ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు.

కేంద్రంలో బీజేపీకి 240 సీట్లు ఎపుడూ రాలేదు. అదే టైంలో ఏపీలో టీడీపీకి 16 సీట్లతో మంచి నంబర్ ఉంది. అయినా ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని నిలదీయకుండా బాబు మహా పాపం చేశారు అని జగన్ తాజాగా ఎమ్మెల్సీల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు చూస్తూంటే జగన్ ప్రజా పోరాటానికి సెంటిమెంట్ అస్త్రం సిద్ధం అయింది అని అంటున్నారు.

ఎటూ బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వదు. దాంతో ఈ అస్త్రంతోనే జగన్ జనంలోకి తొందరలో వెళ్లబోతున్నారు అని అంటున్నారు. ఒక వేళ ప్రత్యేక హోదా ఇచ్చినా అది తమ ఖాతాలో వేసుకోవచ్చు అన్నది కూడా వ్యూహంగా ఉంది.

ఇవన్నీ చూసినపుడు జగన్ కి టీడీపీ కూటమి పాలన సాఫీగా చేస్తుంది అని నమ్మకం లేదనే అంటున్నారు. సంక్షేమ పధకాల విషయంలో కూటమి తడబాట్లూ పొరపాట్లూ చేస్తుందని అదే తమకు ఆయుధం అవుతుందని కూడా విశ్వసిస్తున్నారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే జగన్ తన వయసు హాఫ్ సెంచరీ కాదు అని తాను నవ యువకుడిని అని అంటున్నారు. 164 సీట్లతో సునామీ సృష్టించి అధికారంలోకి వచ్చిన కూటమికి ఓడించడం ఖాయమని ఆయన చెబుతున్నారు. చూడాలి మరి జగన్ ఫైర్ ఎలా ఉండబోతోందో.

Tags:    

Similar News