తమ పాలనలో హింసా రాజకీయాలపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తామెప్పుడూ హింసారాజకీయాలను ప్రోత్సహించలేదని ఈ సందర్భంగా జగన్ చెప్పుకొచ్చారు.

Update: 2024-07-24 06:34 GMT

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయంటూ ఆరోపిస్తున్న వైసీపీ అధినేత జగన్... ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తామెప్పుడూ హింసారాజకీయాలను ప్రోత్సహించలేదని ఈ సందర్భంగా జగన్ చెప్పుకొచ్చారు.

అవును... హస్తిన వేధికగా ఈ రోజు వైసీపీ ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే "హత్యా రాజకీయాలు ఆపాలి".. "సేవ్ డెమోక్రసీ ఇన్ ఏపీ" అంటూ ఫ్లకార్డులు పట్టుకుని అసెంబ్లీ వద్ద హల్ చల్ చేసిన జగన్ & కో.. నేడు ఇదే అంశంపై ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన... ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఢిల్లీలో జంతర మంతర వద్ద ధర్నా చేపట్టడానికి ముందు మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి జగన్... ఏపీలో కూటమి అధికారం చేపట్టిన తర్వాత 45 రోజుల్లోనే సుమారు 35 రాజకీయ హత్యలు జరిగాయని.. వందల ఇళ్లను ధ్వంసం చేశారని.. ప్రభుత్వ, ప్రైవేటు అస్తులను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా రెడ్ బుక్ ప్రస్థావన తీసుకొచ్చారు.

ఇదే సమయంలో... ఏపీలో ఇప్పటివరకూ వెయ్యికి పైగా అక్రమ కేసులు పెట్టారని చెప్పిన జగన్.. గిట్టని వారి పంటలను కూడా నాశనం చేశారని తెలిపారు. తమ హయాంలో ఏనాడూ ఇలాంటి దాడులు, దౌర్జన్యాలను ప్రోత్సహించలేదని జగన్ చెప్పారు. ఇదే సమయంలో... లోకేష్ రెడ్ బుక్ పేరుతో హోర్డింగులు పెట్టారని.. తనకు నచ్చనివారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని జగన్ ఆరోపించారు.

ఈ నేపథ్యంలోనే... ఏపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించిన ఆయన.. ఆ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని అన్నారు. అందుకే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతున్నట్లు తెలిపారు. ప్రత్యేకించి నేషనల్ మీడియా ఈ విషయాన్ని అందరి దృష్టికీ తీసుకెళ్లాలని.. ఫలితంగా ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు జగన్.

Tags:    

Similar News