ఏంది జగనా? చిక్కీలు.. గుడ్ల కాంట్రాక్టర్లకు రూ.178 కోట్ల బకాయిలా?
ఐదేళ్ల జగన్ ప్రభుత్వానికి సంబంధించి బయటకు రాని ఎన్నో కొత్త విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి
ఐదేళ్ల జగన్ ప్రభుత్వానికి సంబంధించి బయటకు రాని ఎన్నో కొత్త విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వేళ.. గత ప్రభుత్వ నిర్ణయాల మీద ఫోకస్ పెట్టటం మామూలే. అయితే.. గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా తాజాగా కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేపట్టిన పంచాయితీ రాజ్ శాఖనే చూస్తే.. వేలాది కోట్ల రూపాయిలు ఎక్కడకు వెళ్లాయో అర్థం కావట్లేదని.. తరచి చూసే కొద్దీ.. కొత్త లోతుల్లోకి విషయాలు వెళుతున్నట్లుగా పవన్ ఈ మధ్యన పేర్కొన్నారు.
తాజాగా స్కూల్ పిల్లలకు కల్పించే మధ్యాహ్న భోజన పథకం.. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాలపై రివ్యూ నిర్వహించిన మంత్రి లోకేశ్ లో కొత్త అంశాలు వెలుగు చూడటం ఆసక్తికరంగా మారింది. జగన్ ప్రభుత్వం చేపట్టిన ప్లాగ్ షిప్ ప్రోగ్రాంలలో పిల్లల చదువు.. స్కూళ్లు అన్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలోనూ తమ ప్రభుత్వంలో మారిన స్కూళ్ల గురించి గొప్పగా చెప్పుకోవటం తెలిసిందే. అయితే.. ఇన్ని గొప్పలు చెప్పుకున్నప్పటికీ.. బోలెడన్ని పంచాయితీలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి.
గుడ్లు.. చిక్కీల సరఫరా కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున బకాయిలు ఉన్న అంశం మంత్రి లోకేశ్ నిర్వహించిన రివ్యూలో బయటకు వచ్చింది. కేవలం గుడ్లు.. చిక్కీల కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలే ఏకంగా రూ.178.5 కోట్లు ఉన్నట్లుగా అధికారులు చెప్పటంతో షాక్ తినటం లోకేశ్ వంతైంది. అంతేకాదు.. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకంలో భాగంగా విద్యా సంస్థలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవటంతో.. పిల్లలకు ఆయా సంస్థలు పంపిణీ చేయాల్సిన సర్టిఫికేట్లు ఆగిపోయాయని.. దీనితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వైనం చర్చకు వచ్చింది.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ స్పందిస్తూ.. ‘‘మేనమామ అని చెప్పుకునేవారు. అలా చెప్పి చిన్నారుల పొట్ట కొట్టాడా?’’ అంటూ ప్రశ్నించారు. గుడ్ల బకాయిలు పెరిగిపోవటంతో వాటిని సరఫరా చేసే పలువురు కాంట్రాక్టర్లు వాటి పంపిణీని ఆపేశారు. ఈ విషయం లోకేశ్ వరకు రావటంతో ఆయన వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నారులకు ఇబ్బంది కలగకుండా గుడ్లు.. చిక్కీలను పంపిణీ చేయాలని ఆదేశించారు.
బకాయిల్ని త్వరలోనే చెల్లిస్తామన్న భరోసాను ఇచ్చారు. గుడ్లు.. చిక్కీలకు ఉన్న బకాయిల లెక్క ఇలా ఉంటే.. విద్యా దీవెన.. వసతి వీవెన బకాయిలు ఏకంగా రూ.3480 కోట్లు ఉన్నట్లుగా అధికారులు చెప్పారు. ఇంత భారీగా బకాయిలు ఒక్క శాఖలోనే ఉంటే.. మిగిలిన అన్ని శాఖల అప్పుల తట్ట ఎంత పెద్దగా ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఈ లెక్కలన్ని చూశాక.. ‘‘ఇదేంది జగనా?’’ అన్న మాట నోటి వెంట రాకమానదు.