జగన్ 'తమిళ' వ్యూహం.. గమనించారా...?
కానీ వాస్తవం చూస్తే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడి కేవలం రెండున్నర నెలలు మాత్రమే అయింది.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పదేపదే చెబుతున్న మాట మళ్లీ మేము అధికారంలోకి వస్తామని. చంద్రబాబు ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేసిందని. దీంతో తాము అధికారంలోకి వచ్చేస్తామని ఆయన అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కానీ వాస్తవం చూస్తే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడి కేవలం రెండున్నర నెలలు మాత్రమే అయింది. మరి ఇంత తక్కువ సమయంలోనే ప్రజలకు వ్యతిరేకత వచ్చేస్తుందా? అసలు జగన్ ఉద్దేశం ఏంటి? ఎందుకు ఆయన అలా చెబుతున్నారో అనే విషయాలను జాగ్రత్తగా ఆలోచిస్తే ఆయన అంతా తమిళనాడు రాజకీయాలను ఏపీలో ప్రయోగించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.
ఎందుకంటే తమిళనాడులో ప్రతిపక్షాలు సంక్షేమ పథకాలను నమ్ముకుని ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని భావిస్తాయి. అక్కడ ఒక వైపు అభివృద్ధి జరుగుతున్నా మరోవైపు సంక్షేమ పథకాలు ఎక్కువగా ఎన్నికల్లో ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అధికార పార్టీ కన్నా ఎక్కువ ఇస్తామని ఎక్కువ సంక్షేమ అమలు చేస్తామని ఉచిత పథకాలు అమలు చేస్తామని చెప్పడం ద్వారా అక్కడ ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. దీంతో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి తమిళనాడులో ప్రభుత్వం మారిపోతూ ఉంటుంది.
ఇదే ఫార్ములాను జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో కూడా నమ్ముకున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఆయన ఇంకా అమలు చేయలేదని, ప్రధానంగా మాతృ వందనం పేరుతో 15 వేల రూపాయలు చొప్పున కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా ఇస్తానన్న మాటకు ఆయన నిలబడలేదని, రైతు భరోసా ఇవ్వలేదని, ఫీజు రియంబర్స్మెంట్ చేయట్లేదని అందుకే ప్రజలు ఆగ్రహంతో ఉన్నారనేది జగన్ చెబుతున్న మాట.
సంక్షేమం అమలు చేయడంలో తమకే పేటెంట్ ఉన్నట్టుగా జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోతుందని తాము అధికారంలోకి వచ్చేస్తామని ఆయన అంత నిబ్బరంగా ఉన్నారని అనిపిస్తోంది. కేవలం సంక్షేమం అమలు చేయనంత మాత్రాన ప్రభుత్వాలు కూలిపోయినట్టయితే పూర్తి స్థాయిలో సంక్షేమం అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా కూలిపోవడానికి వీల్లేదు. ప్రజలందరూ సంక్షేమం వైపే ఉంటే ఆయన ప్రభుత్వం ఇప్పుడు కూడా వచ్చి ఉండాలి.
కానీ అలా జరగలేదు. రాష్ట్ర ప్రజలు సంక్షేమం మాత్రమే కాదు తమకు అభివృద్ధి కూడా కావాలని పక్కాగా కోరుకున్నారు. నిజానికి అభివృద్ధి కోరుకున్న వారే 50 శాతం మంది పైగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వేస్తున్న తమిళనాడు అంచనా విఫలమవుతుందని ఆయన అంచనాలు సరికాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.