ఉపాధి కూలీకి.. టిప్పర్ డ్రైవర్ కు జగన్ టికెట్లు
ఎన్నికలంటే.. కోట్లాది రూపాయిల ఖర్చుతో కూడుకున్నవి. సామాన్యులు ఓటేయటమే తప్పించి
ఎన్నికలంటే.. కోట్లాది రూపాయిల ఖర్చుతో కూడుకున్నవి. సామాన్యులు ఓటేయటమే తప్పించి.. ఎన్నికల్లో పాల్గొనే రోజులు పోయి చాలా కాలమే అయ్యింది. కోట్లాది రూపాయిల నోట్ల కట్టలు.. వాటిని సంచులుగా తీసుకొస్తే తప్పించి టికెట్లను సొంతం చేసుకోలేని పరిస్థితి ప్రధాన రాజకీయ పార్టీల్లో ఉందన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. అందుకు భిన్నంగా అత్యంత సామాన్యులు.. ఆ మాటకు వస్తే కలలో కూడా ఊహించని వారిని అధికార పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దించిన ఏపీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరు విపక్షాలకు ఒక పట్టాన అర్థం కాని పరిస్థితి.
సింగిల్ షాట్ లో ఏపీలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు.. లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల్ని కేటాయించిన వైనం ఒక ఎత్తు అయితే.. ఈసారి టికెట్లను సొంతం చేసుకున్న వారిలో అత్యంత సామాన్యులు ఉండటం విశేషం. ప్రజల్లో పలుకుబడి.. తన చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేసే సత్తా ఉన్న వారికే టికెట్లు అన్న రీతిలో జగన్ టికెట్ కేటాయింపులు ఉన్నట్లుగా చెబుతున్నారు. దీనికి నిదర్శనంగా ఒక ఉపాధి కూలీకి.. ఒక టిప్పర్ డ్రైవర్ కు.. సేవా కార్యక్రమాల్ని నిర్వహించే ఒక చిన్నపాటి నేతకు.. పేదలకు అండగా నిలిచే డబ్బుల్లేని ఒక వైద్యురాలలికి.. ఇలా చెప్పుకుంటూ పోతే టికెట్ల కేటాయింపులో తనదైన మార్కును ప్రదర్శించారు జగన్.
రిజర్వు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు ఈర లక్కప్ప. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆయన ఉపాధి కూలీ. రెండు గదులున్న ఇంట్లో ఉండే ఆయన్ను మడకశిర అభ్యర్థిగా ఎంపిక చేసిన జగన్.. ఆయన్ను పిలిచి మరీ టికెట్ ఇవ్వటం విశేషం. శింగనమల అభ్యర్థిగా ప్రకటించిన వీరాంజనేయులు సైతం సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారే టిప్పర్ డ్రైవర్ గా సుపరిచితుడైన ఆయనకు ఎలాంటి ఆస్తులు లేవు.
మైలవరం అసెంబ్లీ స్థానానికి ఎంపిక చేసిన నర్నాల తిరుపతిరావు సామాన్య రైతు కుటుంబానికి చెందిన వాడు. ఆయన తండ్రి సహకార బ్యాంకులో అటెండర్ గా పని చేస్తున్నారు. 2021 మైలవరం జెడ్పీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగిన తిరుపతిరావు 16వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బద్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న వెంకట సుబ్బయ్య మరణంతో ఆయన భార్య డాక్టర్ దాసరి సుధాకు ఉప ఎన్నికల్లో టికెట్ ఇచ్చిన జగన్.. ఆయన అంచనాలకు తగ్గట్లే ఆమె గెలిచారు.
ఉప ఎన్నికల్లో గెలిచిన ఆమె.. ఎమ్మెల్యేగా అందరికి అందుబాటులో ఉండటమే తప్పించి ఆస్తుల్ని కూడబెట్టింది లేదు. ఆమె కమిట్ మెంట్.. నిజాయితీని గుర్తించిన సీఎం జగన్ తాజాగా మరోసారి ఆమెకు టికెట్ కేటాయించారు. పొన్నూరు అభ్యర్థిగా బరిలోకి దిగిన అంబటి మురళీ క్రిష్ణ బ్యాక్ గ్రౌండ్ చూస్తే.. సామాజిక సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ.. సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉంటారు. పొన్నూరు నియోజకవర్గంలోని 52 గ్రామాల్లో కంటి.. గుండె.. దివ్యాంగ.. ఫిజియోథెరపీ లాంటి వైద్య సేవల్ని ఉచిత వైద్య శిబిరాల్ని నిర్వహిస్తూ సేవలు అందిస్తుంటారు. ఆయనకు తాజాగా టికెట్ కేటాయించారు.
కనిగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దద్దాల నారాయణ యాదవ్ సైతం సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పటకీ.. ప్రజల్లో ఉన్న పలుకుబడి.. సేవా కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున సాయంగా నిలబడుతూ.. అభాగ్యులకు అండగా నిలిచే అతనికి టికెట్ ఇవ్వటం ద్వారా తన విలక్షణతను మరోసారి చాటారు జగన్మోహన్ రెడ్డి. మరి.. ఆయన వ్యూహం ఏమేరకు ఫలిస్తుందన్నది చూడాలి.