ఏపీకి దూరంగా జగన్ !

దాని కోసం ఆయన సీబీఐ కోర్టుకు దాఖలు చేసుకున్న పిటిషన్ కి కోర్టు నుంచి అనుమతి లభించింది.

Update: 2024-05-14 12:52 GMT

జగన్ దాదాపుగా పదిహేను రోజుల పాటు ఏపీలో ఉండరు. ఆయన బిజీ పొలిటికల్ లైఫ్ నుంచి పూర్తిగా రిలాక్స్ అయ్యేందుకు విదేశీ టూర్ పెట్టుకున్నారు. దాంతో జగన్ ఒక భారీ విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టారు. దాని కోసం ఆయన సీబీఐ కోర్టుకు దాఖలు చేసుకున్న పిటిషన్ కి కోర్టు నుంచి అనుమతి లభించింది.

అలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు కోర్టు పచ్చజెండా ఊపింది. జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాలు పర్యటించేందుకు సీఎం జగన్ చేసుకున్న విజ్ఞాపనను నాంపల్లి సీబీఐ కోర్టు మన్నించింది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతించింది.

ఇదిలా ఉంటే తన విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ సీఎం జగన్ కొన్ని రోజుల కిందటే సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ నిబంధనలు సడలించాలని కోర్టును కోరారు. అయితే దీని మీద అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగుతోందని, జగన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారని, ఆయనకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ వాదించింది.

ఈ నేపధ్యంలో ఈ కేసు 14వ తేదీకి వాయిదా పడింది. అలా జగన్ పిటిషన్ పై మంగళవారం విచారణ కొనసాగించిన సీబీఐ కోర్టు జగన్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. జగన్ విదేశీ పర్యటన మరో రెండు రోజులలో మొదలు కాబోతోంది. ఏపీలో చూస్తే ఎన్నికలు ముగిసాయి. ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు కూడా లేవు.

దాంతో రిలాక్స్ అయ్యేందుకు జగన్ ఈ టూర్ పెట్టుకున్నారు అని అంటున్నారు. జగన్ గత డిసెంబర్ నుంచే ఎన్నికల వ్యూహాలు పాటు రాజకీయాల వేడిని పెంచేశారు. అలా ఆరేడు నెలల నుంచి అలుపెరగకుండా పనిచేస్తూ వస్తున్న ముఖ్యమంత్రి ఇపుడు విదేశీ పర్యటనకు వెళుతున్నారు. జగన్ తిరిగి జూన్ 1కి వస్తారు, జూన్ 4న ఎన్నికల ఫలితాలు వస్తాయి. కొత్త ప్రభుత్వం ఎవరిది అన్నది ఆనాడు తేలిపోనుంది.

Tags:    

Similar News