ఉత్తరాంధ్రా జగన్ ని ఎందుకు అంతలా ద్వేషించింది ?

ఇది చాలా పెద్ద ప్రశ్న. ఆలోచిస్తే అంతులేని జవాబులు కూడా దొరికే ప్రశ్న. ఉత్తరాంధ్రా అంటేనే ఒక ఆదరాభిమానాలు పంచే ప్రాంతం

Update: 2024-06-07 00:30 GMT

ఇది చాలా పెద్ద ప్రశ్న. ఆలోచిస్తే అంతులేని జవాబులు కూడా దొరికే ప్రశ్న. ఉత్తరాంధ్రా అంటేనే ఒక ఆదరాభిమానాలు పంచే ప్రాంతం. ముఖ్యంగా కొత్త రాజకీయానికి పెద్ద పీట వేసే గుణం ఉంది. ప్రతిపక్ష పార్టీలకు ఆలవాలంగా నిలుస్తుంది.

తెలుగుదేశం పెట్టినపుడు ఉత్తరాంధ్రా ముందుకు వచ్చి ఆదరించింది. అంతకు ముందు గౌతు లచ్చన్న వంటి వారు విపక్షంలో పోరాటాలు చేస్తే అండగా నిలబడింది. కృషికార్ వంటి పార్టీలను దగ్గరకు తీసింది. 2009లో ప్రజారాజ్యం పార్టీకి ఉత్తరాంధ్రా నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది.

అలాంటి ఉత్తరాంధ్రా వైసీపీ పెట్టాక 2014లో తొమ్మిది ఎమ్మెల్యే ఒక ఎంపీ సీటు ఇచ్చి సమాదరించింది. అలాగే 2019లో ఏకంగా 28 ఎమ్మెల్యే సీట్లు నాలుగు ఎంపీ సీట్లతో బంపర్ విక్టరీని అందించింది. అయిదేళ్ళు గిర్రున తిరిగేసరికి అదే ఉత్తరాంధ్రా వైసీపీని ఆమడ దూరం పెట్టింది. కేవలం రెండు అంటే రెండు ఎమ్మెల్యే ఒక ఎంపీ సీటు దక్కాయి. అది కూడా గిరిపుత్రులు దయతలచి ఇచ్చిన స్థానాలుగా ఉన్నాయి.

మరి ఉత్తరాంధ్రా ఎందుకు వైసీపీని అంత ద్వేషించింది అంటే దానికి అనేక కారణాలు కనిపిస్తాయి. విశాఖను రాజధానిగా చేస్తామని వైసీపీ పదే పదే చెప్పింది. కానీ అదే ఆ పార్టీకి మైనస్ గా మారింది అని అంటున్నారు. ఉత్తరాంధ్రాలో భూ కబ్జాలు పెరిగిపోతాయని తమకు శాంతి ఉండదని ఉత్తరాంధ్రా ప్రజానీకం భయపడ్డారు.

అంతే కాదు తమకు ఇబ్బందులు ఎదురవుతాయని కూడా ఆవేదన చెందారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందు శ్రీకాకుళం మంత్రి ధర్మాన ప్రసాదరావు అయితే ఎక్కడ నుంచో వచ్చిన వారు శ్రీకాకుళం భూముల మీద పెత్తనం చేయాలనుకుంటున్నారు అని బాంబే పేల్చారు. అది కుదరదు అని తాను గట్టిగా నిలబడ్డానని చెప్పారు. మా ప్రాంతం దోచుకుంటామంటే చూస్తూ ఊరుకోను అని ఆయన స్పష్టం చేశారు.

అది ఆనాడు సంచలన వార్తగానే ఉంది. దానిని టీడీపీ అనుకూల మీడియా కూడా విస్తృతంగా ప్రచారం చేసింది. దానికి తోడు పెద్ద ఎత్తున జరిగిన భూ కబ్జాలు కూడా భయాందోళనలు పెంచాయి. దాంతో విశాఖ రాజధాని అయితే మరింతగా జరుగుతాయని భయపడే ఉత్తరాంధ్రా జిల్లాలు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నాయని అంటున్నారు.

వైసీపీ విశాఖ రాజధాని అన్నది అనకుండా ఉంటే ఎంతో కొంత మేలు జరిగేదని ఇంత దారుణంగా ఓడి ఉండేది కాదని అంటున్నారు. విశాఖ రాజధాని అంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒక్క సీటూ వైసీపీకి దక్కనీయకుండా చేశారు. అలాగే విజయనగరం శ్రీకాకుళం టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసి పారేసింది. మరి జనాల మనోభావాలను ఏ మాత్రం అర్ధం చేసుకోకుండా విశాఖ రాజధాని అని వైసీపీ అధినాయకత్వం ఒకటికి పదిసార్లు చెప్పి పూర్తిగా నష్టపోయింది అన్నది ఒక అభిప్రాయం ఉంది. మరి ఇప్పటికైనా వైసీపీ ఆ నినాదాన్ని మార్చుకుంటే మేలు అని అంటున్నారు.

Tags:    

Similar News