‘ప్రతిపక్ష నేత’ వైఎస్ జగన్.. ఈ హోదా కష్టమే?

ఏపీలో ఎన్నికలు, ఫలితాలు, కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మంత్రుల శాఖల కేటాయింపు.. అన్నీ పూర్తయ్యాయి.

Update: 2024-06-15 13:30 GMT

ఏపీలో ఎన్నికలు, ఫలితాలు, కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మంత్రుల శాఖల కేటాయింపు.. అన్నీ పూర్తయ్యాయి. ఇక పాలన మీద ఫోకస్ పెట్టడమే మిగిలింది. ఇక మిగిలింది శాసన సభ సమావేశాలు. బహుశా త్వరలోనే, లేదంటూ జూలై మొదట్లోనే ఇవి జరిగే అవకాశాలున్నాయి. ఆ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణం ఉంటుంది.

బలాబలాల్లో భారీతేడా

ఇటీవలి ఫలితాల్లో ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఏకంగా 164 సీట్లు సాధించిన సంగతి తెలిసిందే. వైసీపీకి 11 స్థానాలు మాత్రమే దక్కాయి. అంటే.. పదో వంతు సీట్లు కూడా రాలేదు. ఉమ్మడి రాష్ట్రం, ఏపీ చరిత్రలోనే అసెంబ్లీలో అతి తక్కువ స్థానాలు సాధించిన పార్టీగా వైసీపీ నిలిచిపోయింది. 2004లో చంద్రబాబు ప్రభుత్వం ఉమ్మడి ఏపీలోని 294 స్థానాలకు గాను 47 మాత్రమే నెగ్గింది. అయితే, ప్రతిపక్షహోదా మాత్రం దక్కింది. 2019లో విభజిత ఏపీలో 175 సీట్లకు గాను 23 మాత్రమే నెగ్గినా.. మళ్లీ ప్రతిపక్ష హోదా దక్కింది.

జగన్ కు కష్టమే?

మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కడం అనుమానమే. 18 సీట్లు సాధిస్తే గానీ ప్రతిపక్షహోదాకు చాన్స్ ఉండదు. ఈ లెక్కన 7 సీట్ల దూరంలో నిలిచిపోయింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం టీడీపీ ప్రభుత్వానికి ససేమిరా ఇష్టం ఉండదు.

ప్రతిపక్ష నేత హోదా క్యాబినెట్ ర్యాంక్

ప్రతిపక్ష పార్టీ హోదా దక్కితే.. ఆ పార్టీ శాసనసభా పక్ష నేతకు ప్రతిపక్ష నాయకుడి హోదా లభిస్తుంది. ఇది క్యాబినెట్ ర్యాంకు. దీంతో కొన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా అసెంబ్లీలో కమిటీల నియామకం వంటి వాటిలో ప్రతిపక్ష నేత పాత్ర కీలకం. ఈ నేపథ్యంలో జగన్ కు మళ్లీ ఉనికి కల్పించే పాత్రను ఇచ్చేందుకు టీడీపీ సర్కారు ప్రయత్నిస్తుందా? అనేది కీలకం.

Tags:    

Similar News