జగన్‌ బంపర్‌ ఆఫర్‌.. ఒకే కుటుంబంలో ముగ్గురికి టికెట్లు!

ఆదిమూలపు సురేష్‌.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దగ్గర తన ప్రాధాన్యతను నిరూపించుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Update: 2024-01-12 04:29 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ విడతలవారీగా అభ్యర్థులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు మూడు విడతల్లో అభ్యర్థులను ప్రకటించారు. ఈ మూడు విడతల్లో 50 అసెంబ్లీ స్థానాలకు, 9 లోక్‌ సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు.

కాగా ఒకే కుటుంబంలో ముగ్గురికి సీట్లు కేటాయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వైఎస్‌ జగన్‌ మంత్రివర్గంలో ఆదిమూలపు సురేశ్‌ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. 2009లో ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచిన ఆదిమూలపు సురేశ్‌ 2014లో వైసీపీ తరఫున సంతనూతలపాడు నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. ఇక 2019లో మళ్లీ యర్రగొండపాలెంకు మారి అక్కడ నుంచి గెలిచారు. ఈసారి కూడా ఆయన నియోజకవర్గాన్ని మారుస్తున్నారు. ప్రకాశం జిల్లా కొండెపి నుంచి ఆదిమూలపు సురేష్‌ పోటీ చేయనున్నారు. ఇప్పటికే ఈ దిశగా ఆయనను జగన్‌ కొండెపి అభ్యర్థిగా ప్రకటించారు.

వైఎస్‌ జగన్‌ రెండుసార్లు చేసిన కేబినెట్‌ విస్తరణలో ఆదిమూలపు సురేశ్‌ రెండుసార్లు తన బెర్త్‌ ను దక్కించుకోవడం విశేషం. ఐదేళ్లపాటు మంత్రిగా ఉన్నారు. ఈ విషయంలో పలు అభ్యంతరాలు వ్యక్తమయినా జగన్‌ పట్టించుకోకుండా ఆదిమూలపు సురేష్‌ పై తన ప్రేమను చాటుకున్నారు.

ఇప్పుడు ఏకంగా ఆయన సోదరుడు ఆదిమూలపు సతీష్‌ ను కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించారు. ఇందుకోసం ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సుధాకర్‌ ను తప్పించడం గమనార్హం. గత కొంతకాలంగా ఆదిమూలపు సతీష్‌.. ఎమ్మెల్యే సుధాకర్‌ కు పోటీగా కోడుమూరులో పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే సుధాకర్‌ ను కాదని.. మంత్రి సురేష్‌ సోదరుడు ఆదిమూలపు సతీష్‌ కు చాన్సు ఇచ్చారు.

ఇక ఆదిమూలపు సురేష్‌ బావ తిప్పేస్వామి ప్రస్తుతం అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పటివరకు ఆయనను అభ్యర్థిగా ప్రకటించకున్నా మళ్లీ ఆయనకే సీటు దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఒకే కుటుంబంలో ముగ్గురికి సీట్లు దక్కించుకోవడం ద్వారా మంత్రి ఆదిమూలపు సురేష్‌.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దగ్గర తన ప్రాధాన్యతను నిరూపించుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News