అప్పులు ఏపీకి... ఆస్తులు తెలంగాణాకు : తేల్చమంటున్న జగన్
ఏపీకి రాష్ట్ర విభజన వల్ల తీరని అన్యాయం జరిగింది అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీకి రాష్ట్ర విభజన వల్ల తీరని అన్యాయం జరిగింది అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూల్ లో పేర్కొన్న అంశాల పురోగతిపై మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రం నుంచి లేవనెత్తాల్సిన అంశాల మీద అధికారులతో సీఎం సమావేశం నిర్వహించిన నేపధ్యంలో పలు వ్యాఖ్యలు చేశారు.
విభజన జరిగి పదేళ్ళు కావస్తున్నా కూడా చట్టంలో పేర్కొన్న అనేక అంశాలు అలాగే ఉన్నాయని సీఎం సమావేశంలో పేర్కొనడం విశేషం. ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానిదే అని జగన్ స్పష్టం చేస్తున్నారు. అప్పుల్లో 58 శాతం ఏపీకి, 42 శాతం తెలంగాణకు కేటాయించారని, అలాగే, రెవిన్యూ పరంగా 58 శాతం తెలంగాణకు, 42 శాతం ఏపీకి వచ్చిందని ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రం ఆదాయాలు ఏ రకంగా పెరుగుతాయని ఆయన కీలక ప్రశ్ననే సంధించారు. ప్రత్యేక హోదా హామీని కేంద్రం ఈ రోజుకీ నెరవేర్చలేదని, అలాగే ఏపీకి జీవనాడి అయిన పోలవరానికి నిధుల రాకలో సమస్యలు అలాగే ఉన్నాయని ఆయన చెప్పడం విశేషం. తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు కూడా రాలేదని కూడా ఎత్తి చూపుతున్నారు.
ఉమ్మడి ఏపీకి అతి పెద్ద రాజధానిగా ఉన్న హైదరాబాద్ కోల్పోవడంతో పారిశ్రామిక, రోడ్డు రవాణా, విద్యా సంస్ధల పరంగా ఇలా అన్నిరకాల మౌలిక సదుపాయాలను ఏపీ పోగొట్టుకుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల రాష్ట్రానికి రెవిన్యూ రూపంలో చాలా నష్టపోయామని ఇక ఈ రెవిన్యూ లోటుని సర్దుబాటు చేస్తూ విభజన చట్టంలో ఆయా రంగాలకు సంబంధించి మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు విభజన చట్టంలో అనెక హామీలు ఇచ్చారని గుర్తు చేశారు.
అయితే విభజన చట్టంలో ఉన్న ఈ స్ఫూర్తి ఇప్పుడు అమలులో కనిపించడం లేదని జగన్ అంటున్నారు. విభజన చట్టంలోని అన్ని అంశాలు నెరవేరిస్తేనే రాష్ట్రంలో పలు వసతులు సమకూరుతాయని, తద్వారా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటాయని జగన్ స్పష్టం చేశారు. ఇక ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ పట్ల కేంద్రం తప్పనిసరిగా ప్రత్యేకత చూపించాల్సిన అవసరం ఉందని జగన్ పేర్కొన్నారు.
ఇక ఏపీలో అధికార వికేంద్రీకరణతో పాటు, సమగ్రాభివృద్ధిలో భాగంగా మూడు రాజధానులను ప్రకటించామని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రాంతాల మధ్య సమతుల్యమైన, సమగ్రమైన అభివృద్ధి ప్రభుత్వం బాధ్యత అని ఆయన అన్నారు. అలాగే మూడు ప్రాంతాలను అనుసంధానిస్తూ రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని జగన్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సమగ్రమైన సహకారం, సహాయం అవసరం ఉందని అన్నారు.
కేంద్రం నుంచి కొత్తగా సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీని కోరుతున్నామని, కడపలో స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రం హామీ ఇచ్చిందని, విశాఖపట్నం నుంచి రాయలసీమ ప్రాంతానికి అత్యంత వేగంగా నడిచే రైళ్లకోసం హై స్టీడ్ రైల్ కారిడార్ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
విశాఖ రైల్వే జోన్ అంశంతో పాటు, వైజాగ్, విజయవాడ, తిరుపతి ఎయిర్ పోర్టులను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా మారుస్తామని చెప్పినా పనులు జరగడం లేదని జగన్ అన్నారు. అలాగే విశాఖ మెట్రో రైలు అంశాన్ని కూడా కేంద్రం కొలిక్కి తీసుకురావాలని జగన్ కోరారు. ఈ మెట్రో ప్రాజెక్ట్ విషయంలో ప్రైవేట్ డెవలపర్ 60 శాతం భరిస్తున్నందున, భూ సేకరణ సహా మిగిలిన 40 శాతం కేంద్రం భరించేలా హోం శాఖ కార్యదర్శి సమావేశంలో అధికారులు వత్తిడి తీసుకురావాలని జగన్ కోరారు.
అలాగే రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన ఇంకా పెండింగ్‌లో ఉందిని దాని విషయంలో కూడా కేంద్రం మీద వత్తిడి పెంచాల్సి ఉందని వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై కూడా దృష్టిపెట్టాలని జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ఏపీకి పూర్తి న్యాయం చేయాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాలు అన్నీ రాష్ట్ర అధికారులు కేంద్రం నిర్వహించే సమావేశంలో ప్రస్తావించనున్నారు. మరి కేంద్రం నుంచి స్పందన ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.