ఇండియా కూటమి వైపు జగన్ మొగ్గాల్సిందేనా ?

ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ఇపుడు రాజకీయంగా అత్యంత కష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు

Update: 2024-07-24 13:15 GMT

ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ఇపుడు రాజకీయంగా అత్యంత కష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు అండగా నిలబడింది ఎన్డీయే ఏ మాత్రం కాదు ఇండియా కూటమే వైసీపీ ఢిల్లీలో ధర్నా చేపడితే జగన్ కి బాసటగా నిలిచింది ఇండియా కూటమి లోని మిత్రులే . భుజం భుజం కలిపింది. ఇండియా కూటమిలో కాంగ్రెస్ తరువాత ఎక్కువ సీట్లు సాధించిన సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ జగన్ కి వెన్ను దన్నుగా నిలిచారు.

అలాగే మరో పెద్ద పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా జగన్ కి గట్టి మద్దతు తెలియచేసింది. ఇక శివసేన పార్టీ కూడా జగన్ పక్షం వహిస్తూ తాము ఉన్నామని భరోసా ఇచ్చింది. అలాగే ఇండియన్ ముస్లిం లీగ్ తో పాటు అన్నా డీఎంకే పార్టీ కూడా జగన్ కి అండగా నిలిచింది.

ఏపీలో చూస్తే వైసీపీ ఎన్డీయేకు వ్యతిరేకంగానే పోరాటం చేస్తోంది. ఢిల్లీ స్థాయిలో చూస్తే బీజేపీని నిత్యం వ్యతిరేకించే పార్టీలు అన్నీ జగన్ చుట్టూ ర్యాలీ అయ్యాయి. వారి ఉద్దేశ్యంలో జగన్ కి మద్దతు తెలపడం అంటే ఇండియా కూటమిలోకి వైసీపీని ఆహ్వానించడమే.

ఈ విషయాన్ని శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది స్పష్టం చేశారు కూడా. జగన్ కి ఏ ఇబ్బంది వచ్చినా ఇండియా కూటమి అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. కేంద్రంలో యూపీలో మోడీతో ఢీ అంటే ఢీ కొట్టే ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ జగన్ కి మద్దతుగా నిలిచారు అంటే ఆయనను ఇండియా కూటమిలో చేరమని కోరినట్లే అని అంటున్నారు.

రాజకీయాల్లో పోరు ఎపుడూ ఒకేలా ఉండదు. రాజకీయాల్లో మడి తడి అన్నవి అంతకంటే ఉండవు. కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఉంది. అదే కాంగ్రెస్ ని గతంలో తీవ్రంగా వ్యతిరేకించే శరద్ పవార్ ఎన్సీపీ, అలాగే మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ అలాగే శివసేన పార్టీలు ఉన్నాయి. వీటితో పాటు కాంగ్రెస్ గతంలో వ్యతిరేకించిన డీఎంకే ఇపుడు ప్రియ మిత్రుడిగా ఉంది.

మరి ఇవన్నీ చూసినపుడు రాజకీయాల్లో ఎపుడూ ఎత్తులే ప్రాధాన్యత వహిస్తాయి తప్ప శాశ్వత వైరాలు కానే కావు. జగన్ ఈ విషయంలో పట్టుదలగా ఉండబట్టే చాలా కోల్పోతున్నారు అని అంటున్నారు. నిజానికి 2024 ఎన్నికల్లో జగన్ ఇండియా కూటమితో చేతులు కలిపి ఉంటే ఏపీలో అధికారం చేజారేది కాదు అన్న లెక్కలూ ఉన్నాయి.

బీజేపీతో జగన్ అంటకాగుతున్నారు అని కాంగ్రెస్ వామపక్షాలు చేసిన ప్రచారానికి మైనారిటీలు వైసీపీని వీడిపోయారు అన్నది కూడా మరో విశ్లేషణ గా ఉంది. మొత్తం మీద చూస్తే జగన్ తలపెట్టిన ఢిల్లీ ధర్నా లో తెలిసి వచ్చిన విషయం ఏంటి అంటే జగన్ కి మద్దతు ఇచ్చేది ఇండియా కూటమి తప్ప మరేమీ కాదని.

ఏపీలో బీజేపీ కూడా చేరిన ఎన్డీయే ప్రభుత్వం మీద జగన్ ద్వజమెత్తుతూంటే ఎన్డీయే పెద్దలు జగన్ కి ఎందుకు బాసటగా నిలుస్తారు అన్నది ప్రశ్న. ఈ లాజిక్ ని వైసీపీ ఎంత తొందరగా అర్ధం చేసుకుంటే అంత తొందరగా వైసీపీకి రాజకీయ దారి దొరుకుతుందని జాతీయ స్థాయిలో సైతం వైసీపీకి గట్టిగా మద్దతు దక్కుతుందని అంటున్నారు.

ఏపీలో ఒంటరి పోరాటం చేయడం ఇపుడు ఉన్న పరిస్థితుల్లో చాలా కష్టమైన విషయం అనే అంటున్నారు. బలమైన పార్టీలు అన్నీ కూటమి కట్టాయి. దాంతో ఏపీలో జగన్ కూడా ఇండియా కూటమిలో పార్టనర్స్ అయిన వామపక్షాలు ఇతర పార్టీలతో కలసి ఉమ్మడి పోరాటం చేయాలి. అవసరం అయితే ఎన్నికల వేళకు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఆ పార్టీకి కూడా కొన్ని సీట్లు ఇస్తే ఏపీలో 2029 నాటికి వైసీపీకి అధికారం దక్కే సూచనలు ఉంటాయని అంటున్నారు.

అయితే ఎన్డీయేకి మద్దతు ఇవ్వకుండా దూరంగా ఉంటే బీజేపీ రాజకీయ పంజా విప్పడం ఖాయం. ఆ పార్టీ జగన్ మీద ఉన్న కేసులను వేగం పెంచి జైలుకు పంపించినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. అయితే అలా అని ఆలోచిస్తూ కూర్చుంటే ఏపీలో వైసీపీ ఉనికికే ముప్పు వాటిల్లుతుంది అని కూడా అంటున్నారు. దాంతో జగన్ ఇండియా కూటమి వైపు మళ్ళితేనే మంచిదని అంటున్నారు. దేశంలో వేగంగా ఇండియా కూటమి గ్రాఫ్ పెరుగుతోంది. దాంతో జగన్ ఆ దిశగా అడుగులు వేస్తే ఏపీలో కూటమిని అడ్డుకోగలరని అలాగే రేపటి రోజులు వైసీపీకి మంచిగా ఉంటాయని అంటున్నారు.

Tags:    

Similar News