మరోమారు అభ్యర్థుల మార్పు... ఆ జిల్లాలపై జగన్ స్పెషల్ ఫోకస్!

ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి ఉభయ గోదావరి, అనంత జిల్లాలో మార్పులు ఉంటాయని చెప్తున్నారు.

Update: 2024-04-05 12:30 GMT

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించేసి, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ, మేనిఫెస్టో లపై కసరత్తులు చేస్తున్నాయని తెలుస్తుంది. ఈ సమయంలో మరోసారి అభ్యర్థుల మార్పులపై వైఎస్ జగన్ దృష్టిపెట్టారని.. అందుతున్న సమాచారం మేరకు, సర్వే ఫలితాల మేరకు కొన్ని నియోజకవర్గాల్లో మార్పులకు సిద్ధమవుతున్నారని అంటున్నారు. దీంతో.. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

అవును... అభ్యర్థుల ఎంపికలో గతంలో ఎన్నడూ లేదు అన్నస్థాయిలో భారీ కసరత్తులు చేసిన వైఎస్ జగన్... అందులో భాగంగా సుమారు 99 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేశారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అనే తారతమ్యాలేమీ చూడలేదు! ఈ సమయంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడుతున్న రోజే ఇడుపులపాయ వేదికగా అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను ఒకేసారి ప్రకటించారు జగన్. దీంతో అభ్యర్థులు ప్రచార కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు.

ఈ సమయంలో... వస్తోన్న సర్వే ఫలితాలు, కార్యకర్తల సూచనల మేరకు కొన్ని నియోజకవర్గాల్లో మరోసారి అభ్యర్థుల మార్పుల ప్రక్రియ చేపట్టనున్నారని తెలుస్తుంది. దీంతో... మరోసారి అభ్యర్థుల మార్పుల ప్రక్రియ వైసీపీలో తీవ్ర చర్చనీయాంశం అవుతుందని అంటున్నారు. ఈ సమయంలో... ప్రస్తుతం బస్సుయాత్రలో ఉన్న జగన్.. ప్రచార కార్యక్రమాలతో పాటు క్షేత్రస్థాయిలో అభ్యర్థుల పనితీరు, ప్రత్యర్థి పార్టీల బలా బలాలపైనా దృష్టిసారించారని తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో.. గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలోని మూడు అసెంబ్లీ, ఒక లోక్ సభ స్థానానికి అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమిలో అభ్యర్థుల మార్పులకు అనుగుణంగా వైసీపీ నుంచి మార్పులు ఉండొచ్చని అంటున్నారు. ఇదే సమయంలో శ్రీకాకుళం జిల్లాలోనూ ఒక మార్పు ఉండొచ్చని అంటున్నారు. వీటికి ముహూర్తం ఉగాది తర్వాత అని సమాచారం!

మరోపక్క.. పలు సర్వేఫలితాలను దృష్టిలో ఉంచుకుని కూటమి కూడా అభ్యర్థుల మార్పులకు శ్రీకారం చుట్టబోతోందని అంటున్నారు. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి ఉభయ గోదావరి, అనంత జిల్లాలో మార్పులు ఉంటాయని చెప్తున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే ఈ విషయాలపై స్పష్టత రావొచ్చని.. ఆయా అభ్యర్థులకు సమాచారం అందొచ్చని అంటున్నారు!

Tags:    

Similar News