సడెన్ గా జగన్ ఢిల్లీకి...పొలిటికల్ గా హై టెన్షన్...!

ఈ క్రమంలో జగన్ ఢిల్లీ టూర్ లో ప్రధాని సహా కేంద్ర మంత్రులను కలిసినపుడు ప్రత్యేక హోదా మీద వారిని డిమాండ్ చేస్తారా అన్నది చర్చకు వస్తోంది.

Update: 2024-01-31 15:05 GMT

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సడెన్ గా ఢిల్లీ వెళ్తున్నారు. ఒక వైపు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న టైం లో జగన్ ఢిల్లీ వెళ్ళడం ఒక ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. అదే విధంగా ఏపీలో ఎన్నికల వేడి మారుతున్న రాజకీయ పరిణామాలు పొత్తులు ఇతర వ్యవహారాలు వంటివి తేలని వేళ జగన్ ఢిల్లీ టూర్ పొలిటికల్ గా ఆసక్తిని పెంచేస్తోంది.

ఇక చూస్తే ఏపీ కాంగ్రెస్ కి కొత్తగా ప్రెసిడెంట్ గా నియమితురాలు అయిన వైఎస్ షర్మిల కూడా ఫిబ్రవరి 2న ఢిల్లీ వేదికగా చేసుకుని ప్రత్యేక హోదా మీద ఒక రోజు దీక్షను చేపడుతున్నారు. కాంగ్రెస్ వరకూ చూస్తే ఇది వారికి ఒక ఆయుధంగానే ఉంది. పైగా జగన్ ని ఇరుకున పెట్టే వ్యూహంగా కూడా ఉంది.

జగన్ ఎన్ని హామీలు తీర్చారు అన్నది పక్కన పెడితే ప్రత్యేక హోదా విషయం ఆయన ఫెయిల్ అయ్యారు అని షర్మిల చేస్తున్న విమర్శలు కొంతవరకూ సీరియస్ గానే ఆలోచించాల్సినవి అని అంటున్నారు. అదే విధంగా చూస్తే కాంగ్రెస్ వస్తే కనుక రాహుల్ గాంధీ ప్రధానిగా తొలి సంతకం ప్రత్యేక హోదా మీదనే పెడతారు అని ఆమె అంటున్నారు.

ఈ క్రమంలో జగన్ ఢిల్లీ టూర్ లో ప్రధాని సహా కేంద్ర మంత్రులను కలిసినపుడు ప్రత్యేక హోదా మీద వారిని డిమాండ్ చేస్తారా అన్నది చర్చకు వస్తోంది. బీజేపీ వైపు నుంచి చూసుకున్నపుడు ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం. వారికి ఏపీలో పెద్దగా రాజకీయ ఆశలు లేవు. ఏపీలో పార్టీలు అన్నీ కూడా బీజేపీ వైపు ఉన్నాయనే చెప్పాలి.

అందువల్ల బీజేపీ ప్రత్యేక హోదాని ఎందుకు ప్రకటిస్తుంది అన్నది ఒక ప్రశ్న. అందునా ఎన్నికలు ముంగిట ఉంచుకుని బీజేపీ హోదాను ప్రకటించి వైసీపీని బలోపేతం చేసే చర్యలకు దిగుతుందా అన్నది కూడా ప్రశ్నగా ఉంది. అదే విధంగా పోలవరం విషయం కూడా షర్మిల గట్టిగా ప్రస్తావనకు తెస్తోంది. పోలవరం వైఎస్సార్ కలల ప్రాజెక్ట్ అని దాన్ని జగన్ ఆచరణలో అయిదేళ్ళలో ఏమీ చేయలేకపోయారు అని ఆమె తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.

ఈ విషయంలో కూడా కేంద్రంలోని బీజేపీ రాజకీయ దాగుడుమూతలే ఆడుతోంది అని అంటున్నారు. సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపినా నిధుల విడుదల విషయంలో ఈ రోజుకీ ఆలస్యం చేయడం వెనక మతలబు ఏంటి అన్నది ఎవరికీ తెలియని విషయం. అంచనాలు పెంచి నిధులు పెద్ద ఎత్తున మంజూరు చేస్తేనే తప్ప పోలవరం వంటి భారీ ప్రాజెక్ట్ పూర్తి కాదు, ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అవుతారు అని అంటున్నారు.

అదే విధంగా ఇప్పటికి పదేళ్ల క్రితం తెలంగాణాకు ఏపీ నుంచి విద్యుత్ సరఫరా చేశారు. ఆ బాకీలు ఆరు వేల కోట్ల పై చిలుకు ఉన్నాయి. వాటిని ఇప్పటికీ వసూల్ చేయించే ప్రయత్నం అయితే కేంద్రం చేయలేకపోతోంది. మరి దీని మీద కేంద్రం సానుకూలంగా స్పందిన్స్తునందా అన్నది చూడాలని అంటున్నారు.

అంతే కాదు విభజన చట్టం లో పేర్కొన్న షెయ్డూల్ 9, 10 కి సంబంధించి ఉమ్మడి ఆస్తుల విభజన అలాగే పెండింగులో ఉంది. ఇదే విధంగా విభజన చట్టం ప్రకారం కేంద్రం ఏపీకి ఇవ్వాల్సిన నిధులు ప్రత్యేక సాయం వంటివి కూడా అలాగే ఉన్నాయి. మరి సీఎం జగన్ తన పర్యటనలో వీటి గురించి కేంద్రం వద్ద ప్రస్తావించి సానుకూలంగా ఏమైనా పరిష్కారం సాధిస్తారా అన్నది చూడాలి.

ఎన్నికల వేళ కేంద్రం నుంచి వీటిలో ఏ కొన్ని అయినా జరిగితే అది వైసీపీకి రాజకీయంగా ఎంతో మేలు జరుగుతుంది. కానీ ఆ విధంగా కేంద్రం సానుకూలంగా రియాక్ట్ అవుతుందా అన్నది చూడాల్సి ఉంది. మరో వైపు చూస్తే ఏపీలో టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కలసి అడుగులు వేస్తుంది అని అంటున్నారు.

అయితే అది ఇంకా అధికారికంగా ఎటూ తేలడం లేదు. మరి ప్రధానితో కానీ అమిత్ షా తో కానీ జగన్ భేటీ అయితే రాజకీయంగా కూడా వేడి పుట్టించే చాన్స్ ఉంది. బీజేపీ ఆలోచనలు ఏమిటో తెలుసుకుని దానికి అనుగుణంగా వైసీపీ తన వ్యూహాలను మార్చుకునే వీలు ఉందని భావిస్తున్నారు. మొత్తానికి సడెన్ గా జగన్ ఢిల్లీ టూర్ పెట్టుకుంటున్నారు అంటే అందులో చాలా వ్యూహాలే ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News