జగన్ వర్సెస్ బాబు...నెవర్ బిఫోర్ !
మళ్లీ ఇంతటి పోరు ఇంతలా క్లోజ్ గా ఫైట్ చేసే సందర్భం ఇక ముందు రాకపోవచ్చు అని అంటున్నారు.
ఏపీలో పోలింగ్ ముగిసింది. రిజల్ట్స్ రావాల్సి ఉంది. దీని కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు కోటి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈసారి జరిగిన ఎన్నికల యుద్ధం నెవర్ బిఫోర్ అన్నట్లుగా సాగింది. ఈసారి పోరు చరిత్రలో ఉండాల్సిందే. మళ్లీ ఇంతటి పోరు ఇంతలా క్లోజ్ గా ఫైట్ చేసే సందర్భం ఇక ముందు రాకపోవచ్చు అని అంటున్నారు.
దానికి కారణం వైసీపీ అధినేత జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరూ ఇద్దరే. ఇద్దరూ వ్యూహకర్తలే. ఇద్దరికీ పట్టుదల ఎక్కువే. ఇద్దరికీ రాజకీయాలే ఆశ శ్వాస. ఇద్దరూ ఓటమిని అంత తేలికగా తీసుకునే రకాలు కాదు. చిత్రంగా ఇద్దరూ రాయలసీమ వాసులే. ఇద్దరూ పక్క పక్క జిల్లా వారు.
ఇవన్నీ పక్కన పెడితే వైఎస్ నారా కుటుంబాల మధ్య మొదట స్నేహం సాగింది. ఆ తరువాత వారు ఒకే పార్టీలో సహచరులుగా ఉన్నారు. టీడీపీ ఆవిర్భావంతో ఇద్దరూ ప్రత్యర్ధులు అయ్యారు. అయినా సరే వారి మధ్య రాజకీయమే ఎంతలో సాగాలో అంత వరకే సాగింది.
ఇక చంద్రబాబు సీఎం అయినా వైఎస్సార్ ముఖ్యమంత్రి అయినా కూడా ఆ సామరస్యం ఎక్కడా దెబ్బతినలేదు. కానీ అదే కుటుంబం నుంచి వచ్చిన జగన్ వర్సెస్ చంద్రబాబు మాత్రం ఉప్పూ నిప్పుగానే సాగింది. ఇద్దరి మధ్యన తరాల అంతరం కూడా మరో కారణం కావచ్చు అని అంటారు.
జగన్ రాజకీయాన్ని మొగ్గలోనే చిదిమేయాలని బాబు చూశారని అంటారు. అలాగే బాబుని సీఎం కానీయకుండా టీడీపీ ఎదుగుదలకు జగన్ తనదైన మార్క్ పాలిటిక్స్ ప్రదర్శించారు అని చెబుతారు. చంద్రబాబుకు అసలైన రాజకీయం చూపించింది మాత్రం జగన్ అంటారు. చంద్రబాబు అయినా టీడీపీ అయినా జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ తోనే పోరాడుతూ వచ్చారు.
కాంగ్రెస్ తో పోరు అంటే ఢిల్లీ నుంచి ఆదేశాలు రావడం పాటించడం, ఏ నాయకుడికీ పెద్దగా స్వేచ్చ లేకపోవడం, బహు నాయకత్వం అనైక్యత వంటి కారణాల వల్ల ఖద్దరు పార్టీతో పోరు అన్నది టీడీపీకి ఒకింత సులువుగానే మారింది అన్న విశ్లేషణలు ఉన్నాయి.
అదే టైం లో జాతీయ పార్టీలు అంత తొందరగా డెసిషన్లు తీసుకోలేవు. దాంతో దూకుడు చేయడం కుదరదు. అదే ఒక ప్రాంతీయ పార్టీకి అచ్చం అదే తీరున ఉన్న మరో పార్టీతో పోరు అంటే ఎలా ఉంటుంది అన్నదే 2014 నుంచి ఏపీ అంతా చూస్తోంది. ముచ్చటగా మూడవ ఎన్నిక ఇది. 2014లో టీడీపీ గెలిచింది. 2019లో వైసీపీ గెలిచింది.
ఇక చూస్తే 2024లో ఎవరిది గెలుపు అన్నదే తీరని ఉత్కంఠగా మారింది. ఎందుకు అంటే ఇద్దరికీ చెరో చాన్స్ అయిపోయింది. ఇదే అసలైన చాన్స్ కాబట్టి. ఈ చాన్స్ ఎవరికి దక్కితే వారిదే ఏపీ పాలిటిక్స్ లో పై చేయి అవుతుంది. అంతే వారే రాజకీయంగా పూర్తిగా అధిపత్యం చలాయించడానికి వీలు ఉంటుంది అని అంటున్నారు.
దాంతోనే అన్నీ కలగలసి 2024 పోరుని భీకరంగా చేసి పారేసాయి. గెలిచిన పార్టీ శాశ్వతం ఓడిన పార్టీ నాశనం అన్న నినాదాలు కూడా తీసుకున్నారు. దాంతో ఈ పోరు కాస్తా డూ ఆర్ డై గా మారిపోయింది. రెండు వైపులా శక్తులు మోహరించాయి. ఎవరి స్థాయిలో వారు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోలేదు. దాంతో 2024లో ఏపీలో జరిగిన రాజకీయ యుద్ధం మాత్రం చరిత్రలో నిలిచిపోయేదే అని అంటున్నారు.
మళ్లీ ఇటువంటి పోరుని ఎవరూ చూడబోరు అని అంటున్నారు. సర్వం ఫణంగా పెట్టి సాగిన ఈ పోరులో గ్లోబ్ మొత్తం మీద ఉన్న ఆంధ్రులు అంతా ఏపీకి వచ్చారు. తమకు నచ్చిన పార్టీకి ఫుల్ సపోర్ట్ చేశారు. ఈ హోరా హోరీ పోరులో తమ వంతు పాత్ర పోషించారు. ఈసారి కురుక్షేత్ర సంగ్రామమే అని చంద్రబాబు జగన్ ఇద్దరూ అన్నారు.
వారు ఏ ముహూర్తాన అన్నారో తెలియదు కానీ అచ్చంగా కురుక్షేత్ర యుద్ధమే సాగింది. ఏ ఒక్కరూ ఖాళీగా లేరు. తమకు తోచిన సైడ్ తీసుకున్నారు. వివిధ రంగాలకు చెందిన వారు కూడా ఏపీలో రాజకీయంలో తన పాత్ర ఏమిటో స్పష్టంగా నిర్ధారించుకుని మరీ మద్దతుగా నిలిచారు. సో ఇలాంటి భీకరమైన పోరుని చూసిన ఈ తరం లక్కీయే అని చెప్పాలి. మళ్ళీ ఇంతటి వేడి వాడి రాజకీయ సమరాన్ని ఎవరూ చూడలేరు అన్నది ఒక కచ్చితమైన విశ్లేషణ. ఎవరి విజేతలు ఎవరు పరాజితులు అన్నది పక్కన పెడితే ఇంతలా అన్ని శక్తులూ ఒడ్డిన రెండు వైపుల వారూ విజేతలే అనడం సబబేమో.