రేవంత్ రెడ్డికి కీలక బాధ్యతలు.. రాహుల్ ఆలోచన అదేనా..!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కీలక బాధ్యతలను అప్పగించేందుకు కాంగ్రెస్ అగ్ర నాయకత్వం యోచిస్తోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కీలక బాధ్యతలను అప్పగించేందుకు కాంగ్రెస్ అగ్ర నాయకత్వం యోచిస్తోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్లారు. అక్కడి నుంచి రాగానే ఢిల్లీ ఎన్నికల ప్రచారంలోకి ఆయన దిగనున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ అగ్రనాయకత్వం కీలక బాధితులు అప్పగించేందుకు సిద్ధమవుతోంది.
వచ్చే నెలలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో ప్రచారం కోసం రేవంత్‌ను కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా ఎంపిక చేసింది. మొత్తం 40 మందితో జాబితా విడుదల చేసింది. తాజాగా ఢిల్లీ ఎన్నికలకు సంబంధించిన రెండు కీలక హామీలను రేవంత్ పీసీసీ చీఫ్‌తో కలిసి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు బాధ్యత తీసుకుంటానని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో గ్యారంటీల ప్రచార బాధ్యతలను రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అప్పగించింది.
ఢిల్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ.. కీలకమైన హామీలను ఇవ్వడం ద్వారా అధికారంలోకి రావచ్చని భావిస్తోంది. అధికారంలో ఉన్న ఆప్‌పై ఉన్న ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఐదు కీలక హామీలను ఇస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, పార్టీ అధికారంలోకి వస్తే వీటిని అమలు చేసే బాధ్యత తనదేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఢిల్లీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరిని ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఏపీ తెలంగాణకు చెందిన పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి నియమిస్తోంది. తాజాగా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో సోనియా, రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంకతో సహా మొత్తం 40 మంది వరకు ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలోనూ రేవంత్‌కు స్టార్ క్యాంపైనర్‌గా కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించడంతో గ్యారంటీల గురించి ప్రచారం చేయడంతో పాటు పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం పనిచేయాలని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి సూచించారు ఇప్పుడు ఢిల్లీ వేదికగా రేవంత్ పార్టీ కోసం ప్రచారం చేయనున్నారు.