శ్రీవారి అన్న ప్రసాదంలో కొత్త రుచులు

అక్కడ స్వామి వారిని దర్శించుకున్న వెంటనే లడ్డూ ప్రసాదం కోసమే చూస్తారు.

Update: 2025-01-20 13:56 GMT

ప్రపంచ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. ఆయన కలియుగ దేవుడు. ఈ భువి మీద ప్రజలను కలియుగంలో తరింపచేయడానికి దివి నుంచి దిగి వచ్చిన దేవదేవుడు. భక్తులు నిత్యం వేలకు వేలుగా తిరుమలకు వెళ్తారు. అక్కడ స్వామి వారిని దర్శించుకున్న వెంటనే లడ్డూ ప్రసాదం కోసమే చూస్తారు.

ఆ తరువాత తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ఉన్న అన్న ప్రసాదానికి దారి తీస్తారు. అక్కడ అత్యంత రుచికరంగా ఉంటే భోజనాన్ని కడుపారా తిని శ్రీవారి నిండు ఆశీస్సులు అందుకుంటారు. ఇది దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి జరుగుతూ వస్తోంది.

ఇక తిరుమల శ్రీవారి అన్న ప్రసాదం రుచి ఎరగని వారు ఉండరు. తిరుమలకు దర్శనానికి వెళ్లారు అంటే ప్రసాదం తినడానికి తప్పనిసరిగా వెళ్తారు. ఇదిలా ఉండగా ఇటీవల తిరుమలలో కొత్తగా ఏర్పడిన పాలకమండలి తనదైన మార్క్ ని పాలనలో చూపిస్తూ ముందుకు సాగుతోంది.

శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యాలు కలుగచేయడమే కాదు,వారికి రుచికరమైన చక్కని ఆహారాన్ని అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. దాని కోసం కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో శ్రీవారి అన్న ప్రసాదంతో సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది.

ఇక మీదట శ్రీవారి భక్తులకు అన్న ప్రసాదం మెనూలో ఈ మార్పులు ఉంటాయని టీటీడీ స్పష్టం చేసింది. దాని ప్రకారం చూస్తే భోజన సమయంలో మసాలా వడను ఇక మీద వడ్డిస్తారు అని అంటున్నారు. ఈ వడ పూర్తిగా సాత్విక ఆహరంగా ఉంటుందని అంటున్నారు. ఈ మసాలా వడలలో ఉల్లిపాయలు కానీ వెల్లుల్లి పాయలు కానీ అసలు ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. దీనిని ప్రయోగాత్మకంగా సోమవారం అన్నప్రసాదాలలో వడ్డిస్తూ చర్యలు తీసుకుంది.

ఈ తొలి ప్రయత్నంలో అయిదు వేల మంది భక్తులకు శ్రీవారి అన్న ప్రసాదంలో మసాల వడను వడ్డించారు. అలా మసాలా వడతో భోజన చేసిన భక్తులు తృప్తిగా ఉందని చెబుతున్నారు రానున్న రోజులలో పూర్తి స్థాయిలో మొత్తం భక్తులకు మసాలా వడను ఒక పదార్ధంగా మెనూలో చేర్చేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటోంది.

దీంతో శ్రీవారి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తిక జనులు అంతా భోజనంలోనే దేవుడు ఉన్నారని నమ్ముతారు. రుచికరమైన శుచికరమైన భోజనం కోసం వారు ఎదురుచూస్తారు. దానిని పూర్తిగా విజయవంతం చేయడానికి టీటీడీ కట్టుబడి ఉందని అధికారులు చెబుతున్నారు. దాంతో శ్రీవారి ప్రసాదం ఇక మరింత రుచికరంగా మారనుంది అన్న మాట.

Tags:    

Similar News