జగన్ జనం బాట.. ఎప్పటి నుంచి..?
ఈలోగా పులివెందుల పర్యటనకు వెళ్లిపోయారు. తర్వాత బెంగళూరు పర్యటనకు వెళ్లిపోయారు.
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి త్వరలోనే జనం బాట పట్టనున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత దాదాపు నెల రోజులకు పైగా సమయం గడిచిపోయింది. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిజానికి అధికారం కోల్పోయిన తర్వాత అదే రోజు అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తాము ఎన్నో పథకాలు ఇచ్చామని కానీ ఆ ఓట్లన్నీ ఏమైపోయాయని ప్రశ్నించారు.
రెండు లక్షల 70 వేల మందికి సంక్షేమ పథకాల అమలు చేశామని లక్షల మందికి ట్యాబులు ఇచ్చామని అమ్మఒడి పథకం అమలు చేశామని ఆ ఓట్లన్నీ ఎటుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులు పార్టీ నాయకులతో మమేకమైనా ప్రజలను ఉద్దేశించి మాత్రం ఆయన ఎట్లాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈలోగా పులివెందుల పర్యటనకు వెళ్లిపోయారు. తర్వాత బెంగళూరు పర్యటనకు వెళ్లిపోయారు. తిరిగి వచ్చిన తర్వాత కూడా అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయడం వరకే పరిమితం అయ్యారు.
మళ్ళీ ఇప్పుడు బెంగళూరులోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలతో ఎప్పుడు మమేకమవుతారు? అనే ప్రశ్న సహజంగానే జగన్ చుట్టూ తిరుగుతుంది. దీనికి సంబంధించి తాజాగా వైసిపి నాయకులు వెల్లడించిన సమాచారం ప్రకారం వచ్చే సెప్టెంబర్ నుంచి జగన్ జనంలోకి వస్తారని వైఎస్ వర్ధంతిని పురస్కరించుకొని ఆ రోజు నుంచి ఆయన ప్రజల్లోనే ఉంటారని తెలుస్తోంది. అయితే ఏ కార్యక్రమం పెట్టుకుంటారు? ఏ అంశం మీద ప్రజల్లోకి వెళ్తారు? అనేది వేచి చూడాలి.
ప్రధానంగా అప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం పగ్గాలు చేపట్టి సెప్టెంబరు నాటికి మూడు నెలలు గడుస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వం వైపు జరిగే తప్పులను జగన్మోహన్ రెడ్డి ఆయుధంగా మలుచుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా తల్లికి వందనం, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు చొప్పున ఇస్తానన్న కీలకమైన హామీ, అదేవిధంగా నిరుద్యోగులకు నెలనెలా 3వేల రూపాయలు ఇస్తానన్న హామీ వంటివి జగన్ ఫోకస్ చేసే అవకాశం ఉంది.
అలాగే రైతులకు ఏటా 20 వేల రూపాయలు ఇస్తానని చంద్రబాబు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఈ పథకాన్ని కూడా అప్పటివరకు అమలు చేయకపోయినా లేదా అసలు ప్రస్తావించకపోయినా జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా వాటిని ప్రశ్నించే అవకాశం ఉంది. తద్వారా ఆయన జనంలోకి వచ్చి ప్రజలను మళ్లీ సంక్షేమ పథకాల దిశగా ఆలోచింపచేసే విధంగా ప్రయత్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో పార్టీని ముందుగా బలోపేతం చేసుకుని అనంతరమే ఆయన ప్రజల్లోకి వస్తారని వైసిపి వర్గాలు చెబుతున్నాయి.
కాబట్టి ఆగస్టు నుంచి నెలరోజుల పాటు పార్టీ క్యాడర్ తో మమేకం కావడం.. పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉండడం.. వారి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం వంటివి ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ లో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి రోజున కానీ ఆ తర్వాత వారంలో కానీ తిరిగి జనంలోకి వస్తారని పార్టీ వర్గాల సమాచారం. అయితే ఆయన పాదయాత్ర చేస్తారా లేక బస్సుయాత్ర చేస్తారా అనేది చూడాలి.
ఏదేమైనా ప్రజల్లోకి రావడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి సంసిద్ధంగానే ఉన్నారు. మరోవైపు అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలను ప్రశ్నించాల్సిన అవసరం కూడా ప్రతిపక్ష నాయకుడిగా జగన్ పై ఉంది. ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదన్న ఒకే ఒక కారణంతో ఆయన సభకు వెళ్లకపోతే అది మరింత ప్రమాదంగా మారే అవకాశం కనిపిస్తోంది. అయితే 2014 - 2019 మధ్య కూడా 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి రెండున్నర సంవత్సరాలు పాటు సభకు వెళ్లకుండా ప్రజల్లోనే ఉన్న విషయం తెలిసిందే.
మరి ఇప్పుడు కూడా అదే పంధాన అనుసరిస్తారా లేక ఒకవైపు సభకు వెళ్తూ అక్కడ ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ మరోవైపు ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారా అనేది చూడాలి. ఏదేమైనా రాబోయే రోజుల్లో వైసిపి అధినేత చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసే అవకాశం అయితే కనిపిస్తోంది.